Sunday, November 3, 2024

మూడు ఫార్మాట్‌లలోనూ మనమే నంబర్‌వన్!

- Advertisement -
- Advertisement -

ఐసిసి ర్యాంకింగ్స్‌లో భారత్ హవా

మన తెలంగాణ/ హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) టీమ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా మూడు ఫార్మాట్‌లలోనూ నంబర్‌వన్‌గా కొనసాగుతోంది. పురుషుల విభాగంలో భారత్ టెస్టులతో పాటు వన్డే, టి20లలో అగ్రస్థానంలో నిలిచింది. 2023 ఏడాది ముగిసే సమయానికి టీమిండియా అన్ని ఫార్మాట్‌లలో మొదటి స్థానంలో నిలవడం విశేషం. టి20 టీమ్ విభాగంలో భారత్ టాప్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. 68 మ్యాచ్‌లు ఆడిన భారత్ 265 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఇంగ్లండ్ 256 పాయింట్లతో రెండో, న్యూజిలాండ్ మూడో ర్యాంక్‌లో నిలిచింది. పాకిస్థాన్, ఆస్ట్రేలియా తర్వాతి స్థానాలను దక్కించుకున్నాయి.

టి20 బ్యాటింగ్ విభాగంలో సూర్యకుమార్ యాదవ్ టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. వన్డేల్లో కూడా భారత్ టీమ్ ర్యాంకింగ్స్‌లో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతోంది. ఇటీవల ముగిసిన ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచిన టీమిండియా ర్యాంకింగ్స్‌లో మాత్రం ఆస్ట్రేలియాను వెనక్కినెట్టి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. 58 మ్యాచ్‌లు ఆడిన భారత్ 121 రేటింగ్ పాయింట్లతో టాప్ ర్యాంక్‌ను దక్కించుకుంది. ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియా 117 పాయింట్లతో రెండో, సౌతాఫ్రికా 110 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాయి.

ఇక పాకిస్థాన్ నాలుగో, న్యూజిలాండ్ ఐదో ర్యాంక్‌ను దక్కించుకున్నాయి. వన్డే బ్యాటింగ్ విభాగంలో శుభ్‌మన్ గిల్ రెండో, విరాట్ కోహ్లి మూడో, రోహిత్ శర్మ నాలుగో ర్యాంక్‌లో నిలిచారు. బాబర్ ఆజమ్ (పాకిస్థాన్) ఈ విభాగంలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. టెస్టు టీమ్ ర్యాంకింగ్స్‌లో కూడా భారత్ టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకుంది. 29 టెస్టు మ్యాచ్‌లు ఆడిన భారత్ 118 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా కూడా 118 పాయింట్లు సాధించినా రెండో ర్యాంక్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇంగ్లండ్ మూడో, సౌతాఫ్రికా నాలుగో, న్యూజిలాండ్ ఐదో ర్యాంక్‌లో కొనసాగుతున్నాయి. కాగా, టెస్టుల్లో బౌలింగ్ విభాగంలో భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టాప్ ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. 879 పాయింట్లతో అశ్విన్ అగ్రస్థానంలో నిలిచాడు. ఆల్‌రౌండర్ల విభాగంలో భారత్‌కే చెందిన రవీంద్ర జడేజా మొదటి ర్యాంక్‌కు దక్కించుకున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News