రాణించిన రోహిత్, కోహ్లి.. సర్ఫరాజ్ మెరుపులు
భారత్ రెండో ఇన్నింగ్స్ 231/3
మొదటి ఇన్నింగ్స్‌లో కివీస్ 402 ఆలౌట్
బెంగళూరు: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఎదురీదుతోంది. 356 పరుగుల భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్ చేపట్టిన భారత్ శుక్రవారం ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. కివీస్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని అందుకోవాలంటే భారత్ మరో 125 పరుగులు చేయాలి. అంతకుముందు 180/3తో మూడో రోజు బ్యాటింగ్ కొనసాగించిన న్యూజిలాండ్ 402 పరుగులకు ఆలౌటైంది. దీంతో కివీస్‌కు 356 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. శుక్రవారం తిరిగి బ్యాటింగ్ కొనసాగించిన న్యూజిలాండ్ వరుస క్రమంలో వికెట్లను కోల్పోయింది. భారత బౌలర్లు అద్భుత బౌలింగ్‌తో క్రమం తప్పకుండా వికెట్లను తీస్తూ పోయింది. డారిల్ మిఛెల్ (18), టామ్ బ్లుండెల్ (5), గ్లెన్ ఫిలిప్స్ (14), మ్యాట్ హెన్రీ (8) ఎక్కువ సేపు క్రీజులో నిలువలేక పోయారు.
దీంతో కివీస్ 233 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. ఈ దశంలో ఇన్నింగ్స్‌ను కుదుట పరిచే బాధ్యతను టిమ్ సౌథి, రచిన్ రవీంద్ర తమపై వేసుకున్నారు. ఇద్దరు భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు తీసుకెళ్లారు. ఈ జోడీని విడగొట్టేందుకు ఆతిథ్య జట్టు బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. దూకుడుగా ఆడిన సౌథి 73 బంతుల్లోనే ఐదు ఫోర్లు, 4 భారీ సిక్సర్లతో 65 పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. అప్పటికే రచిన్‌తో కలిసి 8వ వికెట్‌కు రికార్డు స్థాయిలో 317 పరుగులు జోడించాడు. మరోవైపు చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన రచిన్ రవీంద్ర 157 బంతుల్లో 4 సిక్సర్లు, 13 ఫోర్లతో 134 పరుగులు చేసి ఇన్నింగ్స్ చివరి వికెట్‌గా ఔటయ్యాడు. దీంతో కివీస్ తొలి ఇన్నింగ్స్ 91.3 ఓవర్లలో 402 పరుగుల వద్ద ముగిసింది. భారత బౌలర్లలో కుల్దీప్, జడేజా మూడేసి వికెట్లను తీశారు. సిరాజ్‌కు రెండు వికెట్లు దక్కాయి. కాగా, టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే కుప్పకూలిన సంగతి తెలిసిందే. దీంతో కివీస్‌కు మొదటి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం లభించింది.
ఆదుకున్న కోహ్లి, సర్ఫరాజ్
ఈ దశలో ఇన్నింగ్స్‌ను కుదుట పరిచే బాధ్యతను విరాట్ కోహ్లి, సర్ఫరాజ్ ఖాన్ తమపై వేసుకున్నారు. ఇద్దరు అద్భుత బ్యాటింగ్‌తో ఇన్నింగ్స్‌ను పటిష్ట పరిచారు. కోహ్లి జాగ్రత్తగా బ్యాటింగ్ చేయగా సర్ఫరాజ్ దూకుడును ప్రదర్శించాడు. ఇటు కోహ్లి, అటు సర్ఫరాజ్ అద్భుత షాట్లతో కనువిందు చేశారు. వీరి ఔట్ చేసేందుకు కివీస్ కెప్టెన్ తర చూ బౌలర్లను మార్చినా ఫలితం లేకుం డా పోయింది. కీలక ఇన్నింగ్స్ ఆడిన కోహ్లి 102 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 70 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో సర్ఫరాజ్‌తో కలిసి మూడో వికెట్‌కు 136 పరుగులు జోడించాడు. మరోవైపు ధాటిగా ఆడిన సర్ఫరాజ్ 78 బంతుల్లో ఏడు ఫోర్లు, 3 సిక్సర్లతో 70 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు.
శుభారంభం..
తర్వాత భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్ చేపట్టిన భారత్‌కు ఓపెనర్లు యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మలు మెరుగైన ఆరంభాన్ని అందించారు. ఇద్దరు కివీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ఇన్నింగ్స్ ముందుకు తీసుకెళ్లారు. తొలి ఇన్నింగ్స్‌లో ఘోరంగా విఫలమైన భారత ఓపెనర్లు ఈసారి మాత్రం సమన్వయంతో బ్యాటింగ్ చేశారు. ఈ జోడీని విడగొట్టేందుకు కివీస్ బౌలర్లు చాలా సేపటి వరకు నిరీక్షించక తప్పలేదు. కీలక ఇన్నింగ్స్ ఆడిన యశస్వి 52 బంతుల్లో ఆరు ఫోర్లతో 35 పరుగులు చేసి ఎజాజ్ పటేల్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. దీంతో 72 పరుగుల తొలి ఇన్నింగ్స్ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ వెంటనే రోహిత్ కూడా ఔటయ్యాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ 63 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 52 పరుగులు చేసి ఎజాజ్ బౌలింగ్‌లోనే వెనుదిరిగాడు.