8 వికెట్ల తేడాతో విజయం సాధించిన న్యూజిలాండ్
బెంగళూరు: తొలి టెస్టులో భారత్ పరాజయంపాలైంది. తొలి రోజు నుంచే టీమిండియాను శాసించిన న్యూజిలాండ్ భారత గడ్డపై చరస్మరణీయ విజయాన్ని అందుకుంది. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్టులో కివీస్ జట్టు 8 వికెట్ల తేడాతో టీమిండియాను చిత్తు చేసింది. చివరి రోజు భారత బౌలర్లు అద్భుతం చేస్తారని భావించిన టీమిండియా అభిమానుల ఆశలపై నీళ్లు చల్లారు.
దీంతో 107 పరుగుల లక్షాన్ని అలవోకగా ఛేదించి సిరీస్‌లో 10 ఆదిక్యంలోకి దూసుకెళ్లింది. దాదాపు 36 ఏళ్ల తర్వాత భారత గడ్డపై న్యూజిలాండ్ టెస్ట్ మ్యాచ్ గెలిచింది. చివరిసారిగా 1988లో న్యూజిలాండ్ చివరిసారిగా టెస్ట్ మ్యాచ్‌లో విజయం సాధించింది. 107 పరుగుల స్వల్ప లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన న్యూజిలాండ్ 27.4 ఓవర్లలో 2 వికెట్లు 110 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. విల్ యంగ్ 48 (నాటౌట్), రచిన్ రవీంద్ర 39 (నాటౌట్) న్యూజిలాండ్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇక భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా ఒక్కడే 2 వికెట్లు తీసాడు. అక్టోబర్ 24 నుంచి పుణే వేదికగా రెండో టెస్ట్ ప్రారంభం కానుంది.
సర్ఫరాజ్, పంత్ శ్రమ వృథా..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే కుప్పకూలింది. అనంతరం న్యూజిలాండ్ 402 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. రచిన్ రవీంద్ర(134) సెంచరీతో సత్తా చాటగా.. డెవాన్ కాన్వే(91), టీమ్ సౌథీ(65) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా మూడేసి వికెట్లు తీయగా.. సిరాజ్ రెండు వికెట్లు పడగొట్టాడు. బుమ్రాకు ఓ వికెట్ దక్కింది.
అనంతరం 356 పరుగుల భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 462 పరుగుల భారీ స్కోర్ చేసింది. సర్ఫరాజ్ ఖాన్(150) సెంచరీతో చెలరేగగా.. రిషభ్ పంత్(99) తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. విరాట్ కోహ్లీ(70), రోహిత్ శర్మ(52) హాఫ్ సెంచరీలతో రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ, విలియమ్ ఓ రూర్కీ మూడేసి వికెట్లు తీయగా.. ఆజాజ్ పటేల్ రెండు వికెట్లు పడగొట్టాడు.
అగ్రస్థానంలోనే భారత్..
తొలి టెస్టులో న్యూజిలాండ్ చేతిలో ఓడినా వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. ఇక అంతకుముందు బంగ్లాతో జరిగిన రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ క్లీన్‌స్వీప్ చేసిన విషయం విధితమే. ఇక తొలి టెస్టులో చారిత్రక విజయానందుకున్న న్యూజిలాండ్‌కు బూస్ట్ లభించినట్టైంది. శ్రీలంక చేతిలో 2-0తో టెస్టు సిరీస్ కోల్పోయిన న్యూజిలాండ్‌కు ఈ విజయం భాగా కలిసొచ్చింది. భారత్‌పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించడంతో టెస్టు చాంపియన్‌షిప్ ర్యాకింగ్స్‌లో న్యూజిలాండ్ రెండు స్థానాలు ఎగబాకి నాలుగో స్థానానికి దూసుకెళ్లింది. ఈ క్రమంలో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాలను వెనక్కు నెట్టింది. ప్రస్తుతం డబ్ల్యూటీసీ పట్టికలో భారత్ నంబర్ 1లో ఉండగా.. ఆస్ట్రేలియా, శ్రీలంకలు వరుసగా 2, 3 స్థానాల్లో కొనసాగుతున్నాయి.