సిరీస్‌పై భారత్ కన్ను, ఇంగ్లండ్‌కు సవాల్
నేడు లార్డ్స్ లో రెండో వన్డే
లండన్ : ఇంగ్లండ్‌తో చారిత్రక లార్డ్ మైదానంలో గురువారం జరిగే రెండో వన్డేకు టీమిండియా సమరోత్సాహంతో సిద్ధమైంది. ఇప్పటికే తొలి వన్డేలో ఘన విజయం సాధించిన భారత్ ఈసారి కూడా గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో కనిపిస్తోంది. ఇక మొదటి వన్డేలో ఘోర పరాజయం పాలైన ఇంగ్లండ్‌కు ఈ మ్యాచ్ సవాల్‌గా మారింది. సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే తప్పక గెలవాల్సిన పరిస్థితి ఇంగ్లండ్‌కు నెలకొంది. దీంతో ఆతిథ్య ఇంగ్లండ్‌పై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఓవల్ మ్యాచ్‌లో పది వికెట్ల తేడాతో గెలిచిన టీమిండియా ఈసారి కూడా అదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. కిందటి మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగి పోయిన టీమిండియా ఈసారి కూడా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. తొలి వన్డేలో స్పీడ్‌స్టర్ బుమ్రా చారిత్రక ప్రదర్శనతో చెలరేగి పోయాడు. ఓవల్‌లో బుమ్రా 19 పరుగులు మాత్రమే ఇచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో కూడా బుమ్రా నుంచి ఇలాంటి ప్రదర్శననే జట్టు యాజమాన్యం ఆశిస్తోంది. ఇటీవల కాలంలో బుమ్రా మూడు ఫార్మాట్‌లలోనూ అత్యంత నిలకడైన బౌలింగ్‌ను కనబరుస్తున్న విషయం తెలిసిందే. ఇక షమీ రూపం లో మరో మెరుగైన అస్త్రం ఉండనే ఉంది. అంతేగాక చాహల్, ప్రసిద్ధ్ కృష్ణ, హార్దిక్‌లతో టీమిండియా బౌలింగ్ చాలా బలంగా ఉన్న తెలిసిందే.
మరోవైపు తొలి మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన కెప్టెన్ రోహిత్ శర్మపై ఈసారి కూడా జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. రోహిత్ తన మార్క్ బ్యాటింగ్‌తో చెలరేగితే ఇంగ్లండ్ బౌలర్లకు ఇబ్బందలు ఖాయం. శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ తదితరులతో బ్యాటింగ్ చాలా పటిష్టంగా ఉంది. టి20 సిరీస్‌లో సూర్యకుమార్ అద్భుత సెంచరీతో అలరించాడు. కాగా, గాయం బారిన పడిన సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లి ఈ మ్యాచ్‌కు కూడా దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఒకవేళ కోహ్లి తుది జట్టులోకి వస్తే అయ్యర్ పెవిలియన్‌కే పరిమితం కాక తప్పదు.
గెలిచి తీరాల్సిందే..
మరోవైపు ఆతిథ్య టీమ్ ఇంగ్లండ్‌కు ఈ మ్యాచ్ చావో రేవోగా మారింది. సిరీస్‌లో నిలవాలంటే రెండో వన్డేలో తప్పక గెలవాల్సిందే. ఓవల్ వన్డేలో నలుగురు బ్యాటర్లు డకౌట్ కావడం ఇంగ్లండ్‌ను కలవరానికి గురిచేస్తోంది. ఓపెనర్ వరుస వైఫల్యాలు జట్టుకు ప్రతికూలంగా మారాయి. వరుసగా నాలుగు మ్యాచుల్లోనూ రాయ్ నిరాశ పరిచాడు.
ఇక కిందటి మ్యాచ్‌లో రూట్, స్టోక్స్, లివింగ్‌స్టోన్ ఖాతా తెరవకుండానే ఔటయ్యారు. జట్టును ఆదుకుంటాడని భావించిన బెయిర్‌స్టో కూడా ఏడు పరుగులు మాత్రమే చేశాడు. కెప్టెన్ బట్లర్ కూడా 30 పరుగులకే వెనుదిరిగాడు. ఈ మ్యాచ్‌లోనైనా టాప్ ఆర్డర్ మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకుంటే ఇంగ్లండ్‌కు మరో ఓటమి ఖాయం.