సిరీస్‌పై సౌతాఫ్రికా కన్ను నేడు రెండో వన్డే
పార్ల్: తొలి వన్డేలో అనూహ్య ఓటమి పాలైన టీమిండియాకు శుక్రవారం సౌతాఫ్రికాతో జరిగే రెండో వన్డే చావో రేవోగా మారింది. సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్‌లో గెలవడం తప్ప మరో మార్గం భారత్‌కు లేకుండా పోయింద. ఇక తొలి మ్యాచ్‌లో అద్భుత విజయాన్ని అందుకున్న ఆతిథ్య దక్షిణాఫ్రికా ఈ పోరుకు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. ఇందులోనూ గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో సౌతాఫ్రికా సమతూకంగా కనిపిస్తోంది. కిందటి మ్యాచ్‌లో కెప్టెన్ బవుమా, వండర్ డుసెన్ శతకాలతో కదం తొక్కారు.
ఈ సారి కూడా వీరి నుంచి మెరుగైన ప్రదర్శనను జట్టు ఆశిస్తోంది. ఇక డికాక్, మార్‌క్రామ్ తదితరులతో సౌతాఫ్రికా బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. బౌలింగ్‌లోనూ సఫారీలు మెరుగ్గానే ఉన్నారు. ఇక ఈ మ్యాచ్ భారత్‌కు సవాల్‌గా మారింది. కెప్టెన్ రాహుల్ వైఫల్యం జట్టును వెంటాడుతోంది. కొంతకాలంగా అతను వరుస వైఫల్యాలు చవిచూస్తున్నాడు. ఈసారైనా రాహుల్ తన బ్యాట్‌కు పని చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక విరాట్ కోహ్లి, శిఖర్ ధావన్‌లు కిందటి మ్యాచ్‌లో అర్ధ శతకాలతో అలరించారు. ఈసారి కూడా మెరుగ్గా ఆడాలనే పట్టుదలతో ఉన్నారు. శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ తదితరులు తమవంతు పాత్ర పోషించాలి. అప్పుడే టీమిండియాకు గెలుపు అవకాశాలుంటాయి.