Friday, December 20, 2024

మెగా టోర్నీకి భారత్ రెడీ

- Advertisement -
- Advertisement -

నేడు బంగ్లాదేశ్‌తో వార్మప్ పోరు

న్యూయార్క్: టి20 ప్రపంచకప్ కోసం టీమిండియా ఇప్పటికే సాధన ప్రారంభించిన విషయం తెలిసిందే. అమెరికా, వెస్టిండీస్‌లు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న 9వ టి20 వరల్డ్‌కప్ ఫేవరెట్ జట్లలో టీమిండియా ఒకటిగా బరిలోకి దిగుతోంది. మెగా టోర్నీలో భారత్ తన తొలి మ్యాచ్‌ను జూన్ 5న ఐర్లాండ్‌తో ఆడనుంది. కాగా, ఈ మ్యాచ్ కంటే ముందు టీమిండియా ఒక వార్మప్ పోరులో తలపడనుంది. బంగ్లాదేశ్‌తో శనివారం ఈ మ్యాచ్ జరుగనుంది. వరల్డ్‌కప్‌నకు ముందు భారత్ ఆడే ఏకైక మ్యాచ్ ఇదే కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. సుదీర్ఘ కాలంగా సాగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భారత్ ఆటగాళ్లు చాలా మంది ఎడతెరిపి లేని క్రికెట్‌ను ఆడారు.

కెప్టెన్ హార్దిక్ పాండ్య, మాజీ సారథి విరాట్ కోహ్లి, సీనియర్లు బుమ్రా, జడేజా, సిరాజ్, చాహల్, కుల్దీప్, అక్షర్ పటేల్ తదితరులు ఐపిఎల్‌లో ఆడారు. ఇలాంటి స్థితిలో చాలా మంది ఆటగాళ్లు అలసిపోయి కనిపిస్తున్నారు. మరోవైపు కనీసం విరామం కూడా లేకుండానే వరల్డ్‌కప్ వంటి మెగా టోర్నమెంట్‌లో తలపడాల్సిన పరిస్థితి జట్టుకు నెలకొంది. దీంతో బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌ను టీమిండియా తనకు అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తోంది. న్యూయార్క్‌లోని వాతావరణానికి అలవాటు పడేందుకు దీన్ని సాధనగా మలచుకోవాలనే పట్టుదలతో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో భారత్ సమతూకంగా కనిపిస్తోంది.

ఐపిఎల్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, యశస్వి జైస్వాల్, శివమ్ దూబె, రవీంద్ర జడేజా, రిషబ్ పంత్, సంజు శాంసన్, అక్షర్ పటేల్, కుల్దీప్, చాహల్ తదితరులు అత్యంత మెరుగైన ప్రదర్శనతో అలరించారు. ఈ మెగా టోర్నమెంట్‌లో కూడా జట్టు వీరిపై భారీ ఆశలు పెట్టుకుంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బ్యాటర్లు, బౌలర్లకు జట్టులో కొదవలేదు. రోహిత్ శర్మ, విరాట్, హార్దిక్, జడేజా వంటి సీనియర్లు ఉండడం జట్టుకు కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. రోహిత్, కోహ్లిల అపార అనుభవం ఈ మెగా టోర్నీలో జట్టుకు కీలకంగా మారనుంది. యువ ఆటగాళ్లకు తగు సలహాలు, సూచనలు ఇస్తూ జట్టును ముందుకు నడిపించాల్సిన బాధ్యత వీరిపై నెలకొంది.

ఈ వరల్డ్‌కప్‌లో కోహ్లి, రోహిత్‌లకు ఛాన్స్ ఉండదని మొదట్లో అందరూ భావించారు. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ రోహిత్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసి బిసిసిఐ అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. శాంసన్, పంత్‌లకు తుది జట్టులో స్థానం కోసం గట్టి పోటీ నెలకొంది. రిషబ్‌తో పోల్చితే ఐపిఎల్‌లో శాంసన్ మెరుగైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. దీంతో అతనికే తుది జట్టులో ఛాన్స్ లభించడం ఖాయంగా కనిపిస్తోంది. యువ ఆల్‌రౌండర్ శివమ్ దూబె ఈ టోర్నీకి ప్రత్యేక ఆకర్షణగా మారాడు. ఐపిఎల్‌లో దూబె మెరుపులు మెరిపించాడు. ఇదే జోరును వరల్డ్‌కప్‌లోనూ కనబరిచేందుకు సిద్ధమయ్యాడు. జడేజా, అక్షర్ పటేల్, హార్దిక్‌ల రూపంలో టీమిండియా అగ్రశ్రేణి ఆల్‌రౌండర్లు అందుబాటులో ఉన్నారు. బుమ్రా, సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్, చాహల్‌లతో బౌలింగ్ కూడా బాగానే ఉంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

తక్కువ అంచనా వేయలేం..

మరోవైపు బంగ్లాదేశ్‌ను కూడా తక్కువ అంచనా వేయలేం. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో జట్టు సమతూకంగా ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లు జట్టుకు అందుబాటులో ఉన్నారు. కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ షాంటో, సౌమ్య సర్కార్, తంజీద్ హసన్, షకిబ్ అల్ హసన్, మెహదీ హసన్, మహ్మదుల్లా, తస్కిన్ అహ్మద్ వంటి మ్యాచ్ విన్నర్‌లతో బంగ్లాదేశ్ చాలా బలంగా ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో భారత్‌కు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News