అదరగొట్టిన అశ్విన్, రాణించిన కోహ్లి, కష్టాల్లో ఇంగ్లండ్, గెలుపు బాటలో టీమిండియా
చెన్నై: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆతిథ్య టీమిండియా గెలుపు దిశగా అడుగులు వేస్తోంది. 482 పరుగుల క్లిష్టమైన లక్షంతో రెండో ఇన్నింగ్స్ చేపట్టిన ఇంగ్లండ్ సోమవారం ఆట ముగిసే సమయానికి 53 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 286 పరుగులకు ఆలౌటైంది. రవిచంద్రన్ అశ్విన్ (106) అద్భుత సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. కెప్టెన్ విఆరాట్ కోహ్లి (62) అతనికి అండగా నిలిచాడు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కలుపుకుని భారత్ ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఇక ఈ మ్యాచ్‌లో గెలుపు కోసం మరో ఏడు వికెట్లు అవసరం కాగా, ఇంగ్లండ్ విజయం సాధించాలంటే మరో 429 పరుగులు చేయాలి.
పిచ్ బౌలింగ్‌కు అనుకూలంగా మారడంతో ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓటమిని తప్పించుకోవడం దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది. ఇక మరో రెండు రోజుల ఆట మిగిలివుండడంతో ఈ మ్యాచ్ డ్రాగా ముగిసే అవకాశాలు దాదాపు లేవనే చెప్పాలి. పరిస్థితులు గమనిస్తే టీమిండియా మంగళవారం నాలుగో రోజే మ్యాచ్‌ను సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. కానీ క్రికెట్‌లో ఫలితాలను ముందే ఊహించడం అనుకున్నంత తేలిక కాదు. రూట్, స్టోక్స్ వంటి స్టార్లతో కూడిన ఇంగ్లండ్‌ను ఏ మాత్రం తక్కువ అంచన వేయలేం. అయితే మంగళవారం భోజన విరామ సమయానికి మ్యాచ్ ఫలితంపై ఓ స్పష్టత రావడం ఖాయం.
ఆరంభంలోనే
ఓవర్‌నైట్ స్కోరు 54/1తో మూడో రోజు రెండో ఇన్నింగ్స్ చేపట్టిన టీమిండియాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. మిస్టర్ డిపెండబుల్ చటేశ్వర్ పుజారా (7) తొలి ఓవర్‌లోనే రనౌట్‌గా వెనుదిరిగాడు. ఆ వెంటనే రోహిత్ శర్మ (26) కూడా ఔటయ్యాడు. కొద్ది సేపటికే యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కూడా వెనుదిరిగాడు. పంత్ 8 పరుగులు మాత్రమే చేసి వికెట్‌ను చేజార్చుకున్నాడు. ఇక జట్టును ఆదుకుంటాడని భావించిన వైస్ కెప్టెన్ అజింక్య రహానె కూడా నిరాశ పరిచాడు. రహానె రెండు ఫోర్లతో 10 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ వెంటనే అక్షర్ పటేల్ (7) కూడా పెవిలియన్ చేరాడు. దీంతో భారత్ 106 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఆదుకున్న కోహ్లి, అశ్విన్
ఈ దశలో ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను కెప్టెన్ విరాట్ కోహ్లి, రవిచంద్రన్ అశ్విన్ తమపై వేసుకున్నారు. ఇద్దరు ఇంగ్లండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు తీసుకెళ్లారు. కోహ్లి సమన్వయంతో బ్యాటింగ్ చేయగా, అశ్విన్ ఆరంభం నుంచే దూకుడును ప్రదర్శించాడు. ఇటు అశ్విన్, అటు కోహ్లి కుదురు కోవడంతో భారత్ మళ్లీ కోలుకుంది. ఈ జోడీని విడగొట్టేందుకు ఇంగ్లండ్ బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన కోహ్లి 149 బంతుల్లో ఏడు ఫోర్లతో 62 పరుగులు చేసి ఔటయ్యాడు. దీంతో 96 పరుగుల ఏడో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.
మరోవైపు అశ్విన్ తన జోరును కొనసాగించాడు. అతనికి ఇషాంత్ శర్మ, మహ్మద్ సిరాజ్ అండగా నిలిచాడు. ఇంగ్లండ్ బౌలర్లను హడలెత్తించిన అశ్విన్ 148 బంతుల్లోనే 14 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 106 పరుగులు చేసి చివరి వికెట్ రూపంలో ఔటయ్యాడు. సహచరులు ఒక్కొక్కరే పెవిలియన్ చేరుతున్నా అశ్విన్ సెంచరీ మార్క్‌ను అందుకోవడం విశేషం. తొలుత ఇషాంత్ అతనికి అండగా ఉన్నాడు. ఆ తర్వాత సిరాజ్ తనవంతు సహకారం అందించాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన సిరాజ్ రెండు సిక్సర్లతో 16 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో మోయిన్ అలీ, జాక్ లీచ్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు
కష్టాల్లో ఇంగ్లండ్
ఇక క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. ఓపెనర్ డొమినిక్ సిబ్లి (3)ను అక్షర్ పటేల్ వెనక్కి పంపాడు. మరో ఓపెనర్ రోరి బర్న్‌ను అశ్విన్ ఔట్ చేశాడు. ధాటిగా ఆడిన బర్న్ 4 ఫోర్లతో 25 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. మరోవైపు నైట్ వాచ్‌మన్‌గా వచ్చిన జాక్ లీచ్ (౦)ను అక్షర్ పటేట్ వెనక్కి పంపాడు. దీంతో ఇంగ్లండ్ 50 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి లారెన్స్ 19 (బ్యాటింగ్), జో రూట్ 2 (బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.