Saturday, November 23, 2024

కోహ్లికి సవాల్ వంటిదే..

- Advertisement -
- Advertisement -

Team India Test series against South Africa

ముంబై: త్వరలో సౌతాఫ్రికాతో జరిగే టెస్టు సిరీస్ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి సవాల్ వంటిదేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు. గతంతో పోల్చితే ప్రస్తుతం కోహ్లి తీవ్ర ఒత్తిడిలోఉన్నాడని వారంటున్నారు. జట్టును విజయపథంలో నడిపించాల్సిన బాధ్యత కోహ్లిపై నెలకొందన్నారు. వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించడంతో కోహ్లిపై స్పష్టమైన ఒత్తిడి నెలకొందని వారు అభిప్రాయపడుతున్నారు. కొంతకాలంగా వరుస వైఫల్యాలు చవిచూస్తున్న కోహ్లి సౌతాఫ్రికా సిరీస్‌లో ఎలా రాణిస్తాడో అంతుబట్టకుండా పోయింది. కెప్టెన్‌గా, బ్యాటర్‌గా తన బాధ్యతను సమర్థంగా నిర్వర్తించాల్సిన అవసరం అతనికి ఏర్పడింది. ఒకప్పుడూ టీమిండియాలో కోహ్లి ఎదురులేని శక్తిగా కొనసాగిన విషయం తెలిసిందే. జట్టు ఎంపికలో తనదైన ముద్ర వేశాడు. అంతేగాక అతన్ని కాదని ఏ నిర్ణయం కూడా బిసిసిఐ పెద్దలు తీసుకునే వారు కాదు.

కానీ కొంతకాలంగా కోహ్లి బ్యాటింగ్‌లో తడబడుతున్నాడు. అంతేగాక ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో టీమిండియా ఓటమి పాలైంది. ఇలాంటి స్థితిలో కోహ్లి కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో టి20 ప్రపంచకప్‌కు ముందు కోహ్లి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టి20 సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. అయితే అతను వన్డేల్లో కెప్టెన్‌గా కొనసాగుతాడని అందరూ భావించారు. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ బిసిసిఐ అనూహ్య నిర్ణయం తీసుకుంది. వన్డే సారథ్య బాధ్యతల నుంచి కోహ్లిని తప్పించి రోహిత్ శర్మకు కెప్టెన్సీ అప్పగించింది. అంతేగాక టెస్టుల్లో అజింక్య రహానెను కాదని రోహిత్ శర్మను వైస్ కెప్టెన్‌గా నియమించింది.

బిసిసిఐ తీసుకున్న ఈ నిర్ణయాలు కోహ్లిపై బాగానే ప్రభావం చూపాయని చెప్పాలి. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం కోహ్లి ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. ఇలాంటి స్థితిలో దక్షిణాఫ్రికాతో జరిగే మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ అతనికి సవాల్‌గా తయారైంది. జట్టును గెలిపించి తానెంటో నిరూపించాల్సిన పరిస్థితి అతనికి నెలకొంది. ఈ సిరీస్‌లో కోహ్లి కెప్టెన్‌గానే కాకుండా బ్యాట్స్‌మన్‌గా కూడా రాణించాల్సిందే. ఏ మాత్రం విఫలమైనా టెస్టుల్లో కూడా సారథ్య బాధ్యతలు కోల్పోయినా ఆశ్చర్యం లేదు. ఒకవేళ సౌతాఫ్రికా చేతిలో టీమిడియా ఓడిపోతే కోహ్లికి మరిన్ని ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది. అవి రాకుండా ఉండాలంటే కోహ్లి తన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించడం తప్పించి మరో మార్గం కనిపించడం లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News