Monday, January 20, 2025

భారత్ చేతిలో బంగ్లా చిత్తు

- Advertisement -
- Advertisement -

Team India thrashed Bangladesh by huge margin of 110 runs

టీమిండియా సెమీస్ ఆశలు సజీవం

హామిల్టన్: మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత్ మూడో విజయం సాధించింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 110 పరుగుల భారీ తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. ఈ విజయంతో మిథాలీ సేన సెమీ ఫైనల్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 229 పరుగులు సాధించింది. తర్వాత లక్షఛేదనకు దిగిన బంగ్లాదేశ్ 40.3 ఓవర్లలో కేవలం 119 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయం చవిచూసింది. ఊరిస్తున్న లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన బంగ్లాదేశ్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో భారత బౌలర్లు విఫలమయ్యారు.

ఆరంభం నుంచే..

ఓ మోస్తరు లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన బంగ్లాదేశ్‌కు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. టీమిండియా బౌలర్లు ప్రారంభం నుంచే వరుస క్రమంలో వికెట్లు తీస్తూ ప్రత్యర్థి జట్టును కోలుకునే అవకాశం ఇవ్వలేదు. ఓపెనర్ షమీమ్ అక్తర్ (5) రాజేశ్వరి గైక్వాడ్ వెనక్కి పంపింది. వన్‌డౌన్‌లో వచ్చిన ఫర్జానా హక్ (0)ను పూజా వస్త్రకర్ ఔట్ చేసింది. ఇక జట్టును ఆదుకుంటుందని భావించిన కెప్టెన్ నిగర్ సుల్తానా కూడా నిరాశ పరిచింది. 3 పరుగులు మాత్రమే చేసి స్నేహ్ రాణా బౌలింగ్‌లో వెనుదిరిగింది. ఇక సమన్వయంతో ఆడుతున్న ముర్షిదా ఖాతున్ (19)ను పూనమ్ యాదవ్ పెవిలియన్ బాట పట్టించింది. ఆ వెంటనే రుమానా అహ్మద్ (2) కూడా ఔటైంది.

దీంతో బంగ్లాదేశ్ 35 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో లత మొండల్, సల్మా ఖాతూన్ కొద్ది సేపు పోరాటం చేశారు. ఇద్దరు భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. అయితే 4 ఫోర్లతో 32 పరుగులు చేసి దూకుడు మీద కనిపించిన సల్మాను గోస్వామి ఔట్ చేసింది. మరోవైపు లత రెండు బౌండరీలతో 24 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరింది. చివర్లో రితు (16) మాత్రమే రాణించింది. మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 119 పరుగుల వద్దే ముగిసింది. టీమిండియా బౌలర్లలో స్నేహ్ రాణా నాలుగు, గోస్వామి, పూజా వస్త్రకర్ రెండేసి వికెట్లు పడగొట్టారు.

శుభారంభం..

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌కు ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మ శుభారంభం అందించారు. మంధాన సమన్వయంతో బ్యాటింగ్ చేయగా, షఫాలీ తన మార్క్ షాట్లతో అలరించింది. షఫాలీ ఆరంభం నుంచే దూకుడును ప్రదర్శించింది. బంగ్లా బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ స్కోరును పరిగెత్తించింది. ఇక మంధాన భారీ షాట్ల జోలికి వెళ్లకుండా ఆత్మరక్షణతో ఆడింది. అయితే మూడు ఫోర్లతో 30 పరుగులు చేసిన మంధానను నాహిదా అక్తర్ వెనక్కి పంపింది. దీంతో 74 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ వెంటనే షఫాలీ కూడా ఔటైంది. 42 బంతుల్లో ఆరు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 42 పరుగులు చేసిన షఫాలీను రితు ఔట్ చేసింది. కెప్టెన్ మిథాలీ రాజ్ (0) ఖాతా తెరవకుండానే ఔటైంది. హర్మన్‌ప్రీత్ కౌర్ (14) కూడా జట్టుకు అండగా నిలువలేక పోయింది. అయితే యస్తిక భాటియా (50), వికెట్ కీపర్ రిచా ఘోష్ (26), పూజా వస్త్రకర్ 30 (నాటౌట్), స్నేహ్ రాణా (27) మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచడంతో భారత్ స్కోరు 229 పరుగులకు చేరింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News