బయోబుడగ నుంచి 20 రోజులు విముక్తి!
లండన్: ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన టీమిండియాకు భారీ ఊరట లభించింది. కఠినమైన సిరీస్ నేపథ్యంలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయంతో విరాట్ కోహ్లి సేన ఊపిరి పీల్చుకుంది. న్యూజిలాండ్‌తో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ సమరం ముగిసిన తర్వాత కొద్ది రోజుల పాటు బయో బుడగకు దూరంగా ఉండేందుకు టీమిండియాకు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు వెసులుబాటు కల్పించింది. డబ్లూటిసి ఫైనల్ ముగిసిన తర్వాత దాదాపు 20 రోజుల పాటు బయోబబుల్‌కు దూరంగా ఉండేందుకు భారత క్రికెట్ జట్టుకు అనుమతి ఇచ్చినట్టు సమాచారం. ఫైనల్ అయిపోయిన వెంటనే భారత క్రికెటర్లు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఇంగ్లండ్ మొత్తం పర్యటించేందుకు అనుమతి ఉంటుంది. అయితే జులై 14న మళ్లీ భారత క్రికెటర్లు బయోబుడగకు రావాల్సి ఉంటుంది.
ఇక ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల అనంతరం టీమిండియా ఆటగాళ్లు నేరుగా ఐపిఎల్ బుడగకు వెళ్లొచ్చు. ఇదిలావుండగా న్యూజిలాండ్‌తో డబ్లూటిసి ఫైనల్ జూన్ 24న ముగియనుంది. అది అయిపోగానే భారత ఆటగాళ్లు బయోబుడగను వీడేందుకు అవకాశం కలుగుతోంది. ఈ క్రమంలో దాదాపు 20 రోజుల పాటు టీమిండియా క్రికెటర్లు బ్రిటన్‌లో ఎక్కడైనా ఉండొచ్చు. కీలకమైన ఇంగ్లండ్ సిరీస్‌కు ముందు ఇది భారత్‌కు భారీ ఊరట కలిగించే అంశంగానే పేర్కొనవచ్చు. కాగా దీనిపై ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు నుంచి ఇప్పటి వరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే ఇంగ్లండ్‌లో కరోనా కేసులు చాలా తక్కువ సంఖ్యలో ఉండడంతో ఎలాంటి ఆంక్షలు అమలులో లేవు. ఇది ఇండియాకు కలిసి వచ్చింది.
- Advertisement -