Thursday, November 14, 2024

ఐసిసి టి20 ర్యాంకింగ్స్.. టీమిండియాదే అగ్రస్థానం

- Advertisement -
- Advertisement -

దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం తాజాగా ప్రకటించిన టి20 టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. తాజా ర్యాంకింగ్స్‌లో భారత్ టాప్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ప్రపంచ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను రెండో ర్యాంక్‌కు నెట్టేసింది. అయితే భారత్ కంటే ఇంగ్లండ్ కేవలం రెండు రేటింగ్ పాయింట్లు మాత్రమే వెనుకబడి ఉంది. దీంతో రానున్న రోజుల్లో టాప్ ర్యాంక్‌ను కాపాడుకోవడం భారత్‌కు అంత తేలిక కాదనే చెప్పాలి.

ప్రస్తుతం భారత్ 268 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇంగ్లండ్ 266 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. భారత్ ఓవరాల్‌గా 63 మ్యాచుల్లో 16,881 పాయింట్లను సాధించింది. రెండో స్థానంలో ఉన్న ఇంగ్లండ్ 13,029 పాయింట్లకే పరిమితమైంది. కాగా, పాకిస్థాన్ 258 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. సౌతాఫ్రికా నాలుగో, న్యూజిలాండ్ ఐదో ర్యాంక్‌లో కొనసాగుతున్నాయి. మాజీ ఛాంపియన్లు ఆస్ట్రేలియా ఆరో, విండీస్ ఏడో, శ్రీలంక 8వ ర్యాంక్‌లను దక్కించుకున్నాయి.

ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్
మరోవైపు టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ తన ర్యాంక్‌ను గణనీయంగా మెరుగుపరుచుకున్నాడు. తాజా ర్యాంకింగ్స్‌లో అయ్యర్ ఏకంగా పది స్థానాలను ఎగబాకి 16వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. శ్రేయస్ కెరీర్‌లో ఇదే అత్యుత్తమ ర్యాంక్ కావడం విశేషం. ఇటీవల బంగ్లాదేశ్‌తో ముగిసిన టెస్టు సిరీస్‌లో అయ్యర్ నిలకడైన బ్యాటింగ్‌ను కనబరిచాడు. మరోవైపు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి రెండు ర్యాంక్‌లు కోల్పోయి 14వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. బంగ్లా సిరీస్‌లో కోహ్లి పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరిచాడు. దీని ప్రభావం అతని ర్యాంకింగ్స్‌పై పడింది. కాగా, తాజా ర్యాంకింగ్స్‌లో మార్నస్ లబుషేన్ (ఆస్ట్రేలియా) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

లబుషేన్ 936 రేటింగ్ పాయింట్లతో టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. బాబర్ ఆజమ్ (పాకిస్థాన్) రెండో, స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా) మూడో, ట్రావిస్ హెడ్ (ఆస్ట్రేలియా) నాలుగో, జో రూట్ (ఇంగ్లండ్) ఐదో ర్యాంక్‌లో నిలిచారు. భారత యువ సంచలనం రిషబ్‌పంత్ తన ఆరో ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. రోహిత్ శర్మ తొమ్మిదో ర్యాంక్‌లో నిలిచాడు. ఆల్‌రౌండర్ల విభాగంలో భారత స్టార్ రవీంద్ర జడేజా టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. భారత్‌కే చెందిన రవిచంద్రన్ అశ్విన్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. బౌలింగ్ విభాగంలో ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ అగ్రస్థానాన్ని కాపాడుకున్నాడు. భారత బౌలర్లు జస్‌ప్రిత్ బుమ్రా, అశ్విన్‌లు టాప్10లో కొనసాగుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News