Thursday, January 23, 2025

టీమిండియాకు సవాల్ వంటిదే..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ క్రీడా విభాగం: ఆస్ట్రేలియాతో జరిగే ఐదు మ్యాచ్‌ల బోర్డర్‌గవాస్కర్ ట్రోఫీ టీమిండియాకు సవాల్‌గా మారింది. నవంబర్ 22 నుంచి ఈ సుదీర్ఘ సిరీస్‌కు తెరలేవనుంది. ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను ఆడేందుకు భారత్ ఇప్పటికేఆస్ట్రేలియా బయలు దేరింది. సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు మినహా మిగతా ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, ప్రధాన కోచ్ తదితరులు రెండు ప్రత్యేక బృందాలుగా ఆస్ట్రేలియాకు బయలు దేరనున్నాయి.

ఇప్పటికే ఓ బృందం ఆస్ట్రేలియాకు చేరుకుంది. ప్రధాన కోచ్ గౌతం గంభీర్ నేతృత్వంలోని మరో బృందం కూడా ఆస్ట్రేలియా ప్రయాణం కానుంది. కాగా, సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లి భార్య, పిల్లలతో కలిసి ఇప్పటికే ఆస్ట్రేలియాలోని పెర్త్ నగరానికి చేరుకున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియా ప్రయాణంపై అనుమానాలు నెలకొన్నాయి. అతను ఎప్పటి వరకు అక్కడికి చేరుకుంటాడనే దానిపై స్పష్టత రాలేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను గమనిస్తే నవంబర్ 22 నుంచి జరిగే తొలి టెస్టులో రోహిత్ ఆడే అవకాశాలు పెద్దగా కనిపించడం లేదు. ప్రధాన కోచ్ గంభీర్ కూడా రోహిత్ ఆడతాడా లేదా అనే దానిపై స్పష్టత లేదని పేర్కొన్నాడు.

పరీక్షలాంటిదే..

ఇక, ఆస్ట్రేలియా సిరీస్ టీమిండియాకు అతి పెద్ద సవాల్‌గా మారింది. సొంత గడ్డపై న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత్ క్లీన్‌స్వీప్‌కు గురైన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో బలమైన ఆస్ట్రేలియాతో సిరీస్ భారత్‌కు పరీక్షగా తయారైంది. సొంతగడ్డపై ఆస్ట్రేలియాకు అద్భుతమైన రికార్డు ఉంది. ఆస్ట్రేలియాను వారి సొంత గడ్డపై ఓడించడం ఎంత పెద్ద జటుకైనా సవాల్‌తో కూడుకున్న అంశమే. ప్రస్తుతం టీమిండియా తీవ్ర ఒత్తిడిలో ఉంది. కివీస్‌లో చేతిలో భారత్‌కు ఇలాంటి ఘోర పరాజయం ఎదురవుతుందని ఎవరూ ఊహించలేదు.

ఏమాత్రం అంచనాలు లేకుండా సిరీస్ బరిలోకి దిగిన న్యూజిలాండ్ చారిత్రక ప్రదర్శనతో భారత్‌ను చిత్తుగా ఓడించింది. అంతేగాక భారత్ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ అవకాశాలను క్లిష్టంగా మార్చింది. డబ్లూటిసి ఫైనల్‌కు చేరాలంటే ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్‌లో 40 తేడాతో గెలవాల్సిన పరిస్థితి భారత్‌కు నెలకొంది. ప్రస్తుతం టీమిండియా ఆత్మవిశ్వాసం పూర్తిగా సన్నగిల్లింది. బ్యాటింగ్ వైఫల్యం జట్టుకు సమస్యగా తయారైంది. దీనికి తోడు రోహిత్ శర్మ జట్టుకు అందుబాటులో ఉంటాడా లేదా అనే దానిపై సందేహం నెలకొంది. సిరీస్ సమీపిస్తున్నా రోహిత్ విషయంలో స్పష్టత రావడం లేదు. ఒకవేళ రోహిత్ అందుబాటులో లేకుంటే సారథ్య బాధ్యతలను బుమ్రా సమర్థంగా నిర్వర్తిస్తాడా లేదా అనేది అందరిలోనూ ఆందోళక కలిగిస్తోంది.

ఒక మాటలో చెప్పాలంటే బోర్డర్‌గవాస్కర్ టెస్టు సిరీస్ భారత్‌కు పెద్దగా సమస్యగా తయారైందనే చెప్పాలి. కీలక ఆటగాళ్లు ఫామ్‌ల కోసం తంటాలు పడుతుండడం దీనికి ప్రధాన కారణం. రోహిత్, అశ్విన్, కోహ్లి తదితరులు ఫామ్‌ను కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారు. కెఎల్ రాహుల్ కూడా నిరాశ పరుస్తున్నాడు. యువ ఆటగాడు సర్ఫరాజ్ కేవలం ఒకే ఒక ఇన్నింగ్స్‌లో మెరుగైన బ్యాటింగ్‌ను కనబరిచాడు. ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకుంటే ఈ సిరీస్ భారత్‌కు అతి పెద్ద సవాలేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News