Thursday, January 16, 2025

మంధాన, ప్రతీకా మెరుపు శతకాలు.. భారత్ రికార్డు విజయం

- Advertisement -
- Advertisement -

చివరి వన్డేలోనూ ఐర్లాండ్ చిత్తు
భారత మహిళల క్లీన్‌స్వీప్

రాజ్‌కోట్: ఐర్లాండ్‌తో రాజ్‌కోట్ వేదికగా బుధవారం జరిగిన మూడో, చివరి వన్డేలో భారత మహిళా క్రికెట్ జట్టు 304 పరుగుల తేడాతో రికార్డు విజయం సాధించింది. ఈ గెలుపుతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 30తో క్లీన్‌స్వీప్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 435 పరుగుల భారీ స్కోరును సాధించింది. వన్డేల్లో భారత మహిళా జట్టుకు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్ టీమ్ 31.4 ఓవర్లలో 131 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ సారా ఫోర్బ్ 7 ఫోర్లతో 41 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచింది. మిగతా వారిలో ఒర్లా పెండర్‌గాస్ట్ (36), లౌరా డెలాని (10), లీ పాల్ (15)లు మాత్రమే రెండంకెల స్కోరును అందుకున్నారు. ఇతర బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. దీంతో ఐర్లాండ్ ఇన్నింగ్స్ తక్కువ స్కోరుకే కుప్పకూలింది. టీమిండియా బౌలర్లలో దీప్తి శర్మ మూడు, తనుజా కన్వర్ రెండు వికెట్లను పడగొట్టారు.
మంధాన, ప్రతీకా రావల్ మెరుపులు..
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాకు ఓపెనర్లు ప్రతీకా రావల్, స్మృతి మంధానలు శుభారంభం అందించారు. ఇద్దరు అద్భుత బ్యాటింగ్‌తో ప్రత్యర్థి జట్టు బౌలర్లను హడలెత్తించారు. ఈ జోడీని విడగొట్టేందుకు ఐర్లాండ్ బౌలర్లు చేసిన ప్రయత్నాలు చాలా సేపటి వరకు ఫలించలేదు. కెప్టెన్ మంధాన ఆరంభం నుంచే దూకుడును ప్రదర్శించింది. ఐర్లాండ్ బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ స్కోరును పరిగెత్తించింది. ప్రతీకా రావల్ కూడా తనదైన శైలీలో చెలరేగి పోయింది. ఇటు మంధాన అటు రావల్ దూకుడును ప్రదర్శించడంతో స్కోరు వేగంగా పరిగెత్తింది. మంధాన తన జోరును ఈ మ్యాచ్‌లోనూ కొనసాగించింది. కళ్లు చెదిరే షాట్లతో అలరించిన మంధాన 70 బంతుల్లోనే సెంచరీని సాధించింది. ఈ క్రమంలో మహిళల వన్డేల్లో భారత్ తరఫున అత్యంత వేగంగా శతకం సాధించిన బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పింది. మంధాన, రావల్‌ను కట్టడి చేసేందుకు ఐర్లాండ్ బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇద్దరు కలిసి తొలి వికెట్‌కు రికార్డు స్థాయిలో 233 పరుగులు జోడించారు. విధ్వంసక బ్యాటింగ్‌తో అలరించిన మంధాన 80 బంతుల్లోనే 12 ఫోర్లు, మరో ఏడు సిక్సర్లతో 135 పరుగులు చేసింది. తర్వాత వచ్చిన వికెట్ కీపర్ రిచా ఘోష్‌తో కలిసి ప్రతీకా రావల్ జోరును కొనసాగించింది. మంధాన ఔటైనా ప్రతీకా వెనక్కి తగ్గలేదు. వరుస బౌండరీలతో ప్రత్యర్థి జట్టు బౌలర్లను హడలెత్తించింది. దూకుడుగా ఆడిన రావల్ 129 బంతుల్లోనే 20 బౌండరీలు, ఒక సిక్సర్‌తో 154 పరుగులు సాధించింది. ఇక రిచా ఘోష్ 10 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 59, తేజల్ హసబ్నిస్ (28) కూడా రాణించడంతో భారత్ స్కోరు 435 పరుగులకు చేరింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News