Monday, December 23, 2024

భారమంతా బౌలర్లపైనే!

- Advertisement -
- Advertisement -

Team India were all out for 202 in first innings

టీమిండియా 202 ఆలౌట్, సౌతాఫ్రికా 35/1, రెండో టెస్టు

జోహెన్నస్‌బర్గ్: సౌతాఫ్రికాతో సోమవారం ప్రారంభమైన రెండో టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 202 పరుగులకే ఆలౌటైంది. తర్వాత తొలి ఇన్నింగ్స్ చేపట్టిన ఆతిథ్య సౌతాఫ్రికా సోమవారం ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 35 పరుగులు చేసింది. ఇక భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరును అందుకోవాలంటే దక్షిణాఫ్రికా మరో 167 పరుగులు చేయాలి. ఆట ముగిసే సమయానికి ఓపెనర్ డీన్ ఎల్గర్ (11), కీగన్ పీటర్సన్ (14) క్రీజులో ఉన్నారు. మరో ఓపెనర్ ఐడెన్ మార్‌క్రామ్ ఏడు పరుగులు మాత్రమే చేసి షమి బౌలింగ్‌లో ఎల్బీగా ఔటయ్యాడు.

మళ్లీ తేలిపోయారు..

వెన్ను నొప్పితో బాధపడుతున్న విరాట్ కోహ్లి ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగలేదు. దీంతో జట్టు సారథ్య బాధ్యతలను కెఎల్.రాహుల్ తీసుకున్నాడు. టాస్ గెలిచిన రాహుల్ బ్యాటింగ్‌ను ఎంచుకున్నాడు. అయితే తొలి టెస్టు మాదిరిగా ఈసారి టీమిండియాకు ఆశించిన స్థాయిలో శుభారంభం లభించలేదు. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ ఎక్కువ సేపు క్రీజులో నిలువలేక పోయాడు. 37 బంతుల్లో ఐదు ఫోర్లతో 26 పరుగులు చేసిజాన్‌సెన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. దీంతో 36 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్‌ను కోల్పోయింది. ఇక జట్టును ఆదుకుంటాడని భావించిన మిస్టర్ డిపెండబుల్ చటేశ్వర్ మరోసారి నిరాశ పరిచాడు. మూడు పరుగులు మాత్రమే చేసి ఓలివర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. తర్వాత వచ్చిన అజింక్య రహానె తాను ఎదుర్కొన్న తొలి బంతికే పెవిలియన్ చేరాడు. ఓలివర్ వరుసగా వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసి టీమిండియాకు కోలుకోలేని షాక్ ఇచ్చాడు.

రాహుల్ ఒంటరి పోరాటం..

ఈ దశలో ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను కెప్టెన్ రాహుల్ తనపై వేసుకున్నాడు. అతనికి హనుమ విహారి అండగా నిలిచాడు. ఇద్దరు కలిసి కొద్ది సేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. అయితే 53 బంతుల్లో 3 ఫోర్లతో 20 పరుగులు చేసిన విహారిను రబాడ వెనక్కి పంపాడు. ఆ వెంటనే రాహుల్ కూడా ఔటయ్యాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన రాహుల్ 133 బంతుల్లో 9 ఫోర్లతో 50 పరుగులు చేసి వెనుదిరిగాడు. వికెట్ కీపర్ పంత్ (17) కూడా నిరాశ పరిచాడు. మరోవైపు కీకల ఇన్నింగ్స్ ఆడిన అశ్విన్ ఆరు ఫోర్లతో 46 పరుగులు చేశాడు. మిగతావారు విఫలం కావడంతో భారత్ ఇన్నింగ్స్ 63.1 ఓవర్లలో 202 పరుగుల వద్ద ముగిసింది. సఫారీ బౌలర్లలో జాన్‌సెన్ నాలుగు, రబాడ, ఓలివర్ మూడేసి వికెట్లు పడగొట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News