స్పష్టం చేసిన భారత విదేశాంగ శాఖ
న్యూఢిల్లీ: ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ కోసం టీమిండియాను పాకిస్థాన్‌కు పంపించే ప్రసక్తే లేదని భారత విదేశాంగ శాఖ తేల్చి చెప్పింది. ఈ మేరకు విదేశాంగ శాఖ కీలక ప్రకటన జారీ చేసింది. ఇంతకు ముందు భారత క్రికెట్ బోర్డు కూడా తాము పాకిస్థాన్ వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా శుక్రవారం భారత విదేశాంగ శాఖ కూడా ఇలాంటి ప్రకటనే చేసింది. భద్రతాపరమైన కారణాలతో టీమిండియాను పాకిస్థాన్‌కు పంపించలేమని ఆ శాఖ స్పష్టం చేసింది. అంతేతప్ప వేరే కారణాలు ఏవీ లేవని ఆ ప్రకటనలో పేర్కొంది.
తమకు క్రికెట్ కంటే ఆటగాళ్ల భద్రత ముఖ్యమని విదేశాంగ శాఖ తెలిపింది. అక్కడికి క్రికెట్ టీమ్‌ను పంపించి సమస్యలు తెచ్చుకోవడం తమకు ఇష్టం లేదని వివరించింది. పాకిస్థాన్ తప్పించే వేరే ప్రాంతంలో మ్యాచ్‌లను నిర్వహిస్తే జట్టును పంపించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని విదేశాంగ శాఖ తెలిపింది. ఇదిలావుండగా ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ తదితర అంశాలను చర్చించేందుకు శుక్రవారం ఏర్పాటు చేసిన అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) సమావేశం అర్ధాంతరంగా ముగిసింది.
ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. త్వరలోనే మళ్లీ ఐసిసి భేటి జరిగే అవకాశం ఉంది. ఇదిలావుంటే ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహించాలని బిసిసిఐ కోరుతుండగా ఆతిథ్య పాకిస్థాన్ క్రికెట్ బోర్డు దీనికి ఒప్పుకోవడం లేదు. అన్ని మ్యాచ్‌లు పాకిస్థాన్‌లోనే నిర్వహిస్తామని పట్టుదలతో ఉంది. దీంతో ఐసిసి కూడా ఈ విషయంలో ఎటూ తేల్చుకోలేక పోతోంది.