దుబాయి: ప్రపంచకప్‌కు సన్నాహకంగా టీమిండియా తన రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌ను బుధవారం ఆస్ట్రేలియాతో ఆడనుంది. తొలి వార్మప్ మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించింది. ఇక ఆస్ట్రేలియా కూడా తన మొదటి ప్రాక్టీస్ మ్యాచ్‌లో గెలిచింది. అయితే కివీస్‌తో జరిగిన పోరులో ఆస్ట్రేలియా అతి కష్టంమీద విజయం సాధించింది. మరోవైపు ఇంగ్లండ్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా అదరగొట్టింది. క్లిష్టమైన లక్ష్యాన్ని సయితం అలవోకగా ఛేదించింది. ఓపెనర్లు ఇషాన్ కిషన్, రాహుల్‌లు అద్భుత బ్యాటింగ్‌తో చెలరేగి పోయారు. ఇద్దరు ఆరంభం నుంచే దూకుడుగా ఆడి ఇంగ్లండ్ బౌలర్లను హడలెత్తించారు. విధ్వంసక ఇన్నింగ్స్ కనబరిచిన రాహుల్ 24 బంతుల్లోనే 51 పరుగులు చేశాడు. ఇక ఇషాన్ కూడా దూకుడుగా ఆడి 46 బంతుల్లోనే 70 పరుగులు సాధించాడు. కానీ కెప్టెన్ విరాట్ కోహ్లి వైఫల్యం జట్టును కలవరానికి గురి చేస్తోంది. కోహ్లి ఇంగ్లండ్‌పై తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు.
అంతేగాక యువ ఆటగాడు సూర్యకుమార్ కూడా నిరాశ పరిచాడు. 8 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. అయితే రిషబ్ పంత్ దూకుడుగా ఆడడం భారత్‌కు కాస్త ఊరటనిచ్చే అంశం. కాగా, తొలి మ్యాచ్‌లో భువనేశ్వర్, షమి, రాహుల్ చాహర్‌లు ఘోరంగా విఫలమయ్యారు. షమి మూడు వికెట్లు తీసినా పరుగులు భారీగా సమర్పించుకున్నాడు. సీనియర్ బౌలర్ 4 ఓవర్లలో ఏకంగా 54 పరుగులు ఇచ్చుకున్నాడు. చాహర్ కూడా నిరాశ పరిచాడు. అయితే బుమ్రా, అశ్విన్ రాణించడం టీమిండియాకు కాస్త కలిసివచ్చే అంశం. ఇక ఆస్ట్రేలియాను కూడా బ్యాటింగ్ వైఫల్యం ఆందోళన కలిగిస్తోంది. స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కిందటి మ్యాచ్‌లో ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లోనైనా వార్నర్ మెరుగ్గా రాణించాల్సిన అవసరం ఉంది. స్మిత్, కెప్టెన్ ఫించ్, మిఛెల్ మార్ష్, వేడ్ తదితరులతో ఆస్ట్రేలియా బ్యాటింగ్ బలంగా మారింది. బౌలింగ్‌లో కూడా జట్టు సమతూకంగానే కనిపిస్తోంది. కాగా ఇటు ఆస్ట్రేలియా, అటు భారత్ ఈ మ్యాచ్ ద్వారా తమ లోపాలను సరిదిద్దుకోవాలనే పట్టుదలతో ఉన్నాయి.