Sunday, January 19, 2025

టీమిండియా జైత్రయాత్ర

- Advertisement -
- Advertisement -

వరుస విజయాలతో పెను ప్రకంపనలు

మన తెలంగాణ/క్రీడా విభాగం : సొంత గడ్డపై జరుగుతున్న ప్రపంచకప్‌లో ఆతిథ్య టీమిండియా వరుస విజయాలతో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈసారి వరల్డ్‌కప్‌పై భారత్ తనదైన ముద్ర వేసింది. ఆరంభ మ్యాచ్ నుంచే ప్రత్యర్థి జట్లను హడలెత్తిస్తూ అజేయంగా నిలిచింది. ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచుల్లోనూ టీమిండి యా జయకేతనం ఎగుర వేసింది. ఆస్ట్రేలియాపై విజయంతో ఆరంభమైన భారత జైత్రయాత్ర సౌతాఫ్రికాతో జరిగిన కిందటి మ్యాచ్ వరకు కూడా కొనసాగింది. ఎనిమిది విజయాలతో టీమిండియా పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది.

ఆదివారం బెంగళూరులో జరిగే చివరి మ్యాచ్‌లో పసికూన నెదర్లాండ్స్‌తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లోనూ గెలి చి లీగ్ దశను అజేయంగా ముగించాలనే పట్టుదలతో ఉంది. ఆ తర్వాత జరిగే సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లో గెలిస్తే భారత్ అరుదైన రికార్డును దక్కించుకుంటుంది. వెస్టిండీస్, ఆస్ట్రేలియాల తర్వాత ఒక్క మ్యాచ్‌ను కూడా ఓడిపోకుండా ప్రపంచకప్ గెలిచిన జట్టుగా భారత్ నిలుస్తోంది. ఇప్పటి వరకు విండీస్, ఆస్ట్రేలియాలు రెండేసి సార్లు ఇలాంటి ఫీట్‌ను సాధించాయి.

ప్రత్యర్థి ఎవరైనా..

ఈ వరల్డ్‌కప్‌లో భారత ఆట తీరును ఎంత పొగిడినా తక్కువే. ఒక్క న్యూజిలాండ్‌తో తప్పించి ఇతర జట్లతో ఆడిన అన్ని మ్యాచుల్లోనూ భారత్ భారీ విజయాలను సొంతం చేసుకుంది. ఆరంభ మ్యాచ్‌లో పటిష్టమూన ఆస్ట్రేలియాను ఆరు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. భారత బౌలర్ల ధాటికి ఎదురు నిలువలేక ఆస్ట్రేలియా 199 పరుగులకే కుప్పకూలింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. అఫ్గానిస్థాన్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో జయకేతనం ఎగుర వేసిం ది. దాయాది పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. బంగ్లాదేశ్‌తో జరిగిన తర్వాతి మ్యాచ్‌లో కూడా అలవోక విజయం సాధించింది. ఐదో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను మట్టికరిపించింది. వరుస విజయాలతో జోరుమీదున్న కివీస్ జోరు కు బ్రేక్ వేసింది.

తర్వాతి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌పై 100 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోయింది. తొలుత బ్యాటి ంగ్ చేసి 357 పరుగుల భారీ స్కోరును నమోదు చేసిం ది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకను 55 పరుగులకే కుప్పకూల్చింది. ఈ క్రమంలో 302 పరుగుల భారీ తేడాతో రికార్డు విజయాన్ని సొంతం చేసుకుంది. తాజాగా ఆదివారం సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో కూడా 243 పరుగుల భారీ విజయాన్ని అందుకుంది. డికాక్, డుస్సేన్, మిల్లర్, క్లాసెన్, మార్‌క్రమ్, బవుమా, జాన్‌సెన్ వంటి విధ్వంసక బ్యాటర్లు ఉన్న సౌతాఫ్రికాను 83 పరుగులకే కుప్పకూల్చి రికార్డు విజయం నమోదు చేసింది.

భారత్ విజయాల్లో బ్యాటర్లు, బౌలర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. బ్యాటింగ్‌లో రోహిత్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, రాహుల్‌లు మెరుగైన ప్రదర్శన చేస్తున్నారు. ఓపెనర్లు రోహిత్, గిల్ లు ప్రతి మ్యాచ్‌లోనూ జట్టుకు శుభారంభం అందిస్తున్నారు. కోహ్లి కూడా నిలకడైన బ్యాటింగ్‌తో తనవంతు పాత్ర పోషిస్తున్నాడు. శ్రేయస్, రాహుల్‌లు కూడా సందర్భోచితంగా బ్యాటింగ్ చేస్తూ జట్టుకు అండగా నిలుస్తున్నారు. ఇక జడేజా ఆల్‌రౌండ్‌షోతో అదరగొడుతున్నాడు. ఇటు బ్యాట్‌తో అటు బంతితో చెలరేగి పోతున్నాడు. మరోవైపు బౌలింగ్‌లో మహ్మద్ షమి, సిరాజ్, బుమ్రా, కుల్దీప్‌లు అసాధారణ రీతిలో రాణిస్తున్నారు. షమి ఆడిన మూడు మ్యాచుల్లోనూ చెలరేగిపోయాడు. ఇప్పటికే రెండేసి సార్లు ఐదు వికెట్లను పడగొట్టాడు. సిరాజ్, బుమ్రాలు కూడా ఆరంభంలోనే వికెట్లే తీస్తూ ప్రత్యర్థి జట్లను హడలెత్తిస్తున్నారు. కుల్దీప్, జడేజాలు తమ స్పిన్‌తో జట్టుకు అండగా నిలుస్తున్నారు. ఇలా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణిస్తున్న టీమిండియా ప్రపంచకప్ సాధించే దిశగా ముందుకు దూసుకెళుతోంది. మిగిలిన మూడు మ్యాచుల్లో గెలిస్తే భారత్ ముచ్చటగా మూడోసారి ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంటోంది. రోహిత్ సేన ఆటను గమనిస్తే ఈసారి ట్రోఫీ భారత్‌దే అనడంలో ఎలాంటి సందేహం లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News