హార్దిక్ మ్యాజిక్, సూర్యకుమార్ మెరుపులు, నాలుగో టి20లో టీమిండియా గెలుపు
అహ్మదాబాద్: ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో ట్వంటీ20 మ్యాచ్‌లో ఆతిథ్య టీమిండియా 8 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 177 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. చివరి బంతి వరకు నువ్వానేనా అన్నట్టు సాగిన పోరులో టీమిండియా అతి కష్టంగా విజయం సాధించింది. బెన్ స్టోక్స్ విధ్వంసక ఇన్నింగ్స్ ఆడడంతో ఇంగ్లండ్ గెలుపు అవకాశాలు చిగురించాయి. ధాటిగా ఆడిన స్టోక్స్ 23 బంతుల్లోనే మూడు సిక్సర్లు, మరో నాలుగు ఫోర్లతో 46 పరుగులు చేశాడు.
బెయిర్‌స్టో (25) కూడా దూకుడుగా ఆడాడు. చివర్లో జోఫ్రా ఆర్చర్ రెండు ఫోర్లు, సిక్సర్లతో వేగంగా 18 పరుగులు చేయడంతో ఇంగ్లండ్ విజయం సాధించేలా కనిపించింది. ఇక భారత బౌలర్లలో హార్దిక్ పాండ్య అద్భుత బౌలింగ్‌ను కనబరిచాడు. 4 ఓవర్లలో 16 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. భువనేశ్వర్, రాహుల్ చాహర్ కూడా మెరుగైన ప్రదర్శన చేయడంతో భారత్ విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో సిరీస్‌ను టీమిండియా 22తో సమం చేసింది.
సూర్యకుమార్ జోరు
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన టీమిండియాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ రోహిత్ శర్మ ఒక ఫోర్, మరో సిక్స్‌తో 12 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. అతన్ని ఆర్చర్ వెనక్కి పంపాడు. ఈ దశలో ఆరంగేట్రం ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ క్రీజులోకి చ్చాడు. వచ్చి రావడంతోనే సూర్య బ్యాట్‌ను ఝులిపించాడు. ఇంగ్లండ్ బౌలర్లను హడలెత్తిస్తూ స్కోరను పరిగెత్తించాడు. ఆడిన తొలి మ్యాచ్‌లోనే విధ్వంసక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. మరోవైపు లోకేశ్ రాహుల్ తన పేలవమైన ఫామ్‌ను ఈ మ్యాచ్‌లోనూ కొనసాగించాడు. రెండు ఫోర్లతో 14 పరుగులు మాత్రమే చేసి స్టోక్స్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. తర్వాత వచ్చిన కెప్టెన్ కోహ్లి నిరాశ పరిచాడు.
ఒక పరుగు మాత్రమే చేసి వెనుదిరిగాడు. అయితే సూర్యకుమార్ మాత్రం తన జోరును కొనసాగించాడు. ధాటిగా ఆడిన సూర్య 31 బంతుల్లోనే మూడు సిక్స్‌లు, మరో ఆరు ఫోర్లతో 57 పరుగులు చేసి ఔటయ్యాడు. మరోవైపు రిషబ్ పంత్ కూడా దూకుడును ప్రదర్శించాడు. 4 ఫోర్లతో వేగంగా 30 పరుగులు చేశాడు. ఇక విధ్వంసక ఇన్నింగ్స్‌ను ఆడిన శ్రేయస్ అయ్యర్ 18 బంతుల్లోనే ఐదు ఫోర్లు, సిక్స్‌తో 37 పరుగులు చేసి చివరి ఓవర్‌లో ఔటయ్యాడు. హార్దిక్ పాండ్య 11 పరుగులు చేయగా, రాకూర్ 10(నాటౌట్‌గా నిలిచాడు. దీంతో భారత్ స్కోరు 8 వికెట్లకు 185 పరుగులకు చేరింది.