Thursday, January 23, 2025

ఎదురులేని టీమిండియా

- Advertisement -
- Advertisement -

ఎదురులేని టీమిండియా
వరుస విజయాలతో రోహిత్ సేన ప్రకంపనలు

Rohit Sharma passes the fitness test

మన తెలంగాణ/క్రీడా విభాగం: కొత్త కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా వరుస విజయాలతో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే వెస్టిండీస్, శ్రీలంక జట్లతో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసి సత్తా చాటింది. తొలుత వెస్టిండీస్‌తో జరిగిన వన్డే, టి20 సిరీస్‌లను రోహిత్ సేన వైట్‌వాష్ చేసింది. ఆడిన ఆరు మ్యాచుల్లోనూ విజయం సాధించి సిరీస్‌లను సొంతం చేసుకుంది. తాజాగా శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను 30 తేడాతో క్లీన్‌స్వీప్ చేసింది. సొంత గడ్డపై టీమిండియా ఎదురులేని శక్తిగా మారింది.

ముఖ్యంగా టి20 ఫార్మాట్‌లో వరుసగా 12 మ్యాచుల్లో గెలిచి ప్రపంచ రికార్డును సమం చేసింది. టి20 వరల్డ్‌కప్ తర్వాత ఆడిన 12 టి20 మ్యాచుల్లోనూ టీమిండియా విజయాలు సాధించింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆరు టి20లు, మరో మూడు వన్డేల్లో జయకేతనం ఎగుర వేసింది. విరాట్ కోహ్లి స్థానంలో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన రోహిత్ శర్మ జట్టును విజయపథంలో నడిపిస్తున్నాడు. జట్టును ముందుండి నడిపిస్తూ యువ క్రికెటర్లకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఇదే క్రమంలో జట్టు యాజమాన్యం తనపై ఉంచిన నమ్మకాన్ని సయితం నిలబెడుతున్నాడు. ఇక యువ ఆటగాళ్లు కూడా అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. రవి బిష్ణోయ్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షల్ పటేల్, వెంకటేశ్ అయ్యర్, అవేశ్ ఖాన్ తదితరులు మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.

వీరితో పాటు సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ తదితరులు కూడా సత్తా చాటారు. యువ ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపడంలో రోహిత్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఒత్తిడిలోనూ నిబ్బరంగా ఆడేలా వారిని తీర్చిదిద్దుతున్నాడు. దీనికి శ్రీలంకతో జరిగిన మూడు టి20 మ్యాచుల్లోనూ టీమిండియా సాధించిన విజయాలే నిదర్శంగా చెప్పొచ్చు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో భారత్ సమతూకంగా మారింది. సీనియర్, జూనియర్ ఆటగాళ్ల కలయికతో టీమిండియా చాలా బలంగా తయారైంది.

సీనియర్ బౌలర్లు జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, యజువేంద్ర చాహల్, సిరాజ్ తదితరులు తమ స్థాయికి తగ్గ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు. వీరికి తోడు యువ బౌలర్లు ప్రసిద్ధ్ కృష్ణ, హర్షల్ పటేల్, అవేశ్ ఖాన్, బిష్ణోయ్ తదితరులు కూడా మెరుగైన ప్రదర్శనతో జట్టు యాజమాన్యం తమపై పెట్టిననమ్మకాన్ని నిలబెడుతున్నారు. ఇక రానున్న ఐపిఎల్ ద్వారా యువ ఆటగాళ్లు మరింత రాటుదేలడం ఖాయం. ఇదే జరిగితే రానున్న టి20 వరల్డ్‌కప్‌లో ట్రోఫీని సాధించడం టీమిండియాకు కష్టమేమీ కాదనే చెప్పాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News