అండర్-19 మహిళల టి20 ప్రపంచకప్‌లో భారత్ బోణీ
కౌలాలంపూర్: ఐసిసి అండర్-19 మహిళల టి20 ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు బోణీ కొట్టింది. ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో కేవలం 26 బంతుల్లోనే లక్ష్యాన్ని ఛేదించి మ్యాచ్ ముగించింది. వెస్టిండీస్ జట్టుపై 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 13.2 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి 44 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ లక్ష్యాన్ని ఛేదించిన భారత మహిళల జట్టు 4.2 ఓవర్లలో 1 వికెట్ మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ భారత బౌలర్ల ధాటికి పూర్తి 20 ఓవర్లు ఆడలేకపోయింది. దీంతో జట్టు మొత్తం 13.2 ఓవర్లలో 44 పరుగులే చేసి చాపచుట్టేసింది.
దీంతో టోర్నీ చరిత్రలోనే అతి తక్కువ స్కోరుకే వెస్టిండీస్ జట్టు ఓ చెత్త రికార్డును నమోదు చేసింది. 45 పరుగుల లక్ష్యా ఛేదనకు దిగిన భారత్ 4 పరుగులకే వికెట్ కోల్పోయింది. కానీ, ఆ తర్వాత భారత బ్యాట్స్‌మెన్ వెస్టిండీస్‌కు రెండో వికెట్ దక్కే అవకాశం ఇవ్వలేదు. కమలిని, చాల్కే మధ్య రెండో వికెట్‌కు 43 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొంది. దీంతో వెస్టిండీస్‌పై భారత్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్ తరపున బౌలింగ్‌లో అద్భుతంగా రాణించిన జోషితాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. జోషిత తన 2 ఓవర్లలో 5 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టింది.