కదం తొక్కిన అభిషేక్
రుతురాజ్, రింకు మెరుపులు
రాణించిన బౌలర్లు, రెండో టి20లో భారత్ ఘన విజయం
హరారే: జింబాబ్వేతో ఆదివారం జరిగిన రెండో టి20లో యువ ఆటగాళ్లతో కూడిన టీమిండియా 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 11తో సమం చేసింది. శనివారం జరిగిన తొలి టి20లో జింబాబ్వే జయకేతనం ఎగుర వేసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన జింబాబ్వే 18.4 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలింది. క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన జింబాబ్వేకు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. ఓపెనర్ ఇన్నొసెంట్ కైయ 4 పరుగులు మాత్రమే చేసి ముకేశ్ కుమార్ వేసిన అద్భుత బంతికి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.
అయితే వన్‌డౌన్‌లో వచ్చిన బ్రియాన్ బెన్నెట్ కొంత సేపు మెరుపులు మెరిపించాడు. 9 బంతుల్లో 3 సిక్సర్లు, ఒక ఫోర్‌తో 26 పరుగులు చేసిన బ్రియాన్‌ను కూడా ముకేశ్ కుమార్ వెనక్కి పంపాడు. ఆ తర్వాత జింబాబ్వే మళ్లీ కోలుకోలేక పోయింది. డియాన్ మేయర్స్ (0), కెప్టెన్ సికందర్ రజా (4), జోనాథన్ క్యాంప్‌బెల్ (10), క్లైవ్ మదాండె (0), వెల్లింగ్టన్ మసకద్జా (1) ఘోరంగా విఫలమయ్యారు. ఒంటరి పోరాటం చేసిన ఓపెనర్ వెస్లీ మధెవర్ 3 ఫోర్లు, ఒక ఫోర్‌తో 43 పరుగులు సాధించాడు. మిగతా వారిలో లుక్ జోంగ్వే 4 ఫోర్లతో 33 పరుగులు చేశాడు. భారత బౌలర్లు అసాధారణ బౌలింగ్‌తో చెలరేగడంతో జింబాబ్వే ఏ దశలోనూ లక్షం దిశగా సాగలేదు. ముకేశ్ కుమార్, అవేశ్ ఖాన్ మూడేసి వికెట్లను పడగొట్టారు. రవి బిష్ణోయ్‌కు రెండు వికెట్లు దక్కాయి.
అభిషేక్ విధ్వంసం..
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌కు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌గా దిగిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రెండు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. అయితే వన్‌డౌన్‌లో వచ్చిన రుతురాజ్ గైక్వాడ్‌తో కలిసి మరో ఓపెనర్ అభిషేక్ శర్మ జట్టును ఆదుకున్నాడు. ఇద్దరు ప్రత్యర్థి టీమ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. రుతురాజ్ సమన్వయంతో బ్యాటింగ్ చేయగా, అభిషేక్ ప్రారంభం నుంచే దూకుడును ప్రదర్శించాడు.
ఈ జోడీని కట్టడి చేసేందుకు ఆతిథ్య టీమ్ బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అభిషేక్ విధ్వంసక బ్యాటింగ్‌తో స్కోరును పరిగెత్తించాడు. చెలరేగి ఆడిన అభిషేక్ 47 బంతుల్లోనే ఏడు ఫోర్లు, 8 సిక్సర్లతో 100 పరుగులు చేశాడు. ఆడిన రెండో మ్యాచ్‌లోనూ శతకం చేసి అభిషేక్ పెను ప్రకంపనలు సృష్టించాడు. మరోవైపు కీలక ఇన్నింగ్స్ ఆడిన రుతురాజ్ 47 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్స్‌తో 77 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించిన రింకు సింగ్ 22 బంతుల్లోనే 5 సిక్సర్లు, రెండు ఫోర్లతో అజేయంగా 48 పరుగులు సాధించాడు. దీంతో భారత్ స్కోరు 234 పరుగులకు చేరింది.