రాణించిన బౌలర్లు, రాహుల్, సూర్య అర్ధ సెంచరీలు
తొలి టి20లో భారత్ ఘన విజయం
తిరునంతపురం: దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగిన తొలి టి20లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ 3 మ్యాచ్‌ల సిరీస్‌లో 10 ఆధిక్యాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 16.4 ఓవర్లలోనే కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. బౌలింగ్‌కు సహకరించిన పిచ్‌పై స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు కూడా భారత్ తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. సఫారీ ఫాస్ట్ బౌలర్లు పార్నెల్, రబడా అసాధారణ బౌలింగ్‌తో భారత బ్యాట్స్‌మెన్‌ను హడలెత్తించారు. కెప్టెన్ రోహిత్ శర్మ (0) ఖాతా తెరవకుండానే రబడా బౌలింగ్‌లో ఔటయ్యాడు. కొద్ది సేపటికే విరాట్ కోహ్లి (3) కూడా వెనుదిరిగాడు. దీంతో 17 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను రాహుల్, సూర్యకుమార్ తమపై వేసుకున్నారు.
సూర్యకుమార్ దూకుడుగా ఆడాడు. ధాటిగా ఆడిన సూర్య 33 బంతుల్లోనే 5 ఫోర్లు, 3 సిక్సర్లతో అజేయంగా 50 పరుగులు చేశాడు. ఇక సమన్వయంతో ఆడిన రాహుల్ 4 సిక్సర్లు, రెండు బౌండరీలతో 51 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో భారత్ అలవోక విజయాన్ని సొంతం చేసుకుంది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికాను భారత బౌలర్లు దీపక్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్ హడలెత్తించారు. వీరి ధాటికి దక్షిణాఫ్రికా ఒక దశలో 9 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. అయితే పార్నెల్ (24), కేశవ్ మహారాజ్ (41) అసాధారణ బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ మూడు, చాహర్, హర్షల్ పటేల్ రెండేసి వికెట్లు తీశారు.