Wednesday, January 22, 2025

సత్తా చాటిన కుర్రాళ్లు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సొంత గడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన టి20 సిరీస్‌లో యువ ఆటగాళ్లతో బరిలోకి దిగిన టీమిండియా 4-1 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. రోహిత్ శర్మ, కోహ్లి, రాహుల్, జడేజా, హార్దిక్, శుభ్‌మన్, బుమ్రా, షమి, సిరాజ్ తదితరులు లేకుండానే భారత్ ఈ సిరీస్‌లో తలపడింది. అయినా ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియాను మట్టికరిపించి సిరీస్‌ను తన ఖాతాలో వేసుకుంది. సిరీస్‌లో కెప్టెన్‌గా వ్యవహరించిన సూర్యకుమార్ యాదవ్ జట్టును విజయపథంలో నడిపించడంలో సఫలమయ్యాడు.

యువ ఓపెనర్లు యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్‌లు విధ్వంసక బ్యాటింగ్‌తో అలరించారు. యశస్వి భారీ స్కోర్లు సాధించక పోయినా ప్రతి మ్యాచ్‌లోనూ జట్టుకు మెరుపు ఆరంభాన్ని అందించాడనే చెప్పాలి. రుతురాజ్ కూడా మెరుపులు మెరిపించాడు. వీరిద్దరూ అద్భుత బ్యాటింగ్‌తో అలరించారు. రానున్న ప్రపంచకప్ నేపథ్యంలో యువ ఆటగాళ్లు సత్తాను చాటడం భారత్‌కు కలిసి వచ్చే అంశంగానే చెప్పాలి. వీరితో పాటు ఇషాన్ కిషన్ కూడా తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాడు. కీలక ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్నాడు.

ఇక తొలిసారి భారత్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన వికెట్ కీపర్ జితేశ్ శర్మ కూడా బాగానే బ్యాటింగ్ చేశాడు. యువ సంచలనం రింకు సింగ్ కూడా జట్టుకు సిరీస్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు. జట్టు యాజమాన్యం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాడనే చెప్పాలి. విధ్వంసక బ్యాటింగ్‌తో రింకు అలరించాడు. రానున్న రోజుల్లో టీమిండియా కీలక ఆటగాళ్లలో ఒకడిగా అతను ఎదుగుతాడనడంలో ఎలాంటి సందేహం లేదు. శ్రేయస్ అయ్యర్ కూడా అర్ధ సెంచరీతో సత్తా చాటాడు. చివరి టి20లో జట్టు మెరుగైన స్కోరును సాధించిండంటే శ్రేయస్ ఇన్నింగ్స్ కీలకమని చెప్పొచ్చు. మరోవైపు శ్రేయస్ అయ్యర్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు.

బ్యాట్‌తోనే కాకుండా బౌలింగ్‌లోనూ సత్తా చాటాడు. చివరి రెండు మ్యాచుల్లో అతను జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు. జడేజా లేని లోటును అక్షర్ పూడ్చాడని చెప్పాలి. అంతేగాక ముకేశ్ కుమార్, అవేశ్ ఖాన్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్‌లు బంతితో రాణించారు. ట్రావిస్ హెడ్, ఫిలిప్, వేడ్, డేవిడ్, మెక్‌డెర్మట్, స్మిత్, మ్యాక్స్‌వెల్ తదితరులతో కూడిన ఆస్ట్రేలియాపై యువ భారత్ సిరీస్ సాధించడం శుభపరిణామంగానే చెప్పాలి.

రానున్న టి20 ప్రపంచకప్‌లో సీనియర్, జూనియర్ ఆటగాళ్ల కళాయికతో భారత్ మెరుగైన ప్రదర్శన చేస్తుందనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. అయితే ఫీల్డింగ్, బౌలింగ్ ప్రమాణాలు అంతంత మాత్రంగానే ఉండడం కాస్త ఇబ్బంది కలిగించే అంశమే. భవిష్యత్తులో ఈ లోపాలను సరిదిద్దుకుంటే టీమిండియా పొట్టి ప్రపంచకప్‌లోనూ సత్తా చాటడం ఖాయం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News