గయానా : వెస్టిండీస్‌తో మంగళవారం జరిగిన మూడో టి20 మ్యాచ్‌లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ప్రస్తుతం ఆతిథ్య జట్టు విండీస్ 21 ఆధిక్యంలో కొనసాగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన భారత్ 17.5 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఊరిస్తున్న లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఒక పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. అయితే వన్‌డౌన్‌లో వచ్చిన సూర్యకుమార్ యాదవ్ అద్భుత బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నాడు. ఆరంభం నుంచే సూర్యకుమార్ దూకుడును ప్రదర్శించాడు.
ప్రత్యర్థి టీమ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును పరిగెత్తించాడు. మరోవైపు శుభ్‌మన్ గిల్ (6) మరోసారి విఫలమయ్యాడు. అయితే తిలకక్‌వర్మతో కలిసి సూర్యకుమార్ జట్టును లక్షం దిశగా నడిపించాడు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన సూర్యకుమార్ 44 బంతుల్లోనే 4 సిక్సర్లు, మరో పది ఫోర్లతో 83 పరుగులు చేశాడు. ఇక కీలక ఇన్నింగ్స్ ఆడిన తిలక్ వర్మ 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 37 బంతుల్లోనే అజేయంగా 49 పరుగులు చేశాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన హార్దిక్ పాండ్య15 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో భారత బౌలర్లు సఫలమయ్యారు. ఓపెనర్లు బ్రాండన్ కింగ్ (42), కైల్ మేయర్స్ (25) శుభారంభం అందించారు. చివర్లో రొమన్ పొవెల్ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో అలరించాడు. ధాటిగా ఆడిన పొవెల్ 19 బంతుల్లోనే 3 సిక్సర్లు, ఒక ఫోర్‌తో అజేయంగా 40 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లను పడగొట్టాడు.