Thursday, January 23, 2025

భారత్ క్లీన్‌స్వీప్

- Advertisement -
- Advertisement -

Team India won third ODI against West Indies by 96 runs

అహ్మదాబాద్: వెస్టిండీస్‌తో శుక్రవారం జరిగిన మూడో, చివరి వన్డేలో టీమిండియా 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ 30 తేడాతో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. వెస్టిండీస్‌పై టీమిండియాకు ఇది రికార్డు స్థాయిలో 11వ సిరీస్ విజయం కావడం విశేషం. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌటైంది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 37.1 ఓవర్లలోనే కేవలం 169 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లు సమష్టి ప్రతిభతో జట్టుకు హ్యాట్రిక్ విజయాన్ని సాధించి పెట్టారు.

ఆరంభంలోనే..

ఊరిస్తున్న లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌కు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. ఓపెనర్ షాయ్ హోప్ (5)ను సిరాజ్ వెనక్కి పంపాడు. ఆ వెంటనే మరో ఓపెనర్ బ్రాండన్ కింగ్ కూడా ఔటయ్యాడు. రెండు ఫోర్లతో 14 పరుగులు చేసిన కింగ్‌ను దీపక్ చాహర్ ఔట్ చేశాడు.ఆ వెంటనే శమర్ బ్రూక్స్ (0) కూడా వెనుదిరిగాడు. ఈ వికెట్‌ను కూడా దీపక్ పడగొట్టాడు. దీంతో విండీస్ 25 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. ఈ దశలో డారెన్ బ్రావో, కెప్టెన్ నికోలస్ పూరన్ కొద్ది సేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. అయితే మూడు ఫోర్లతో 19 పరుగులు చేసిన బ్రావోను ప్రసిద్ధ్ కృష్ణ ఔట్ చేశాడు. ఆ తర్వాత విండీస్ కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. జట్టును ఆదుకుంటారని భావించిన జేసన్ హోల్డర్ (6), ఫబియాన్ అలెన్ (0) నిరాశ పరిచారు. కెప్టెన్ పూరన్ రెండు ఫోర్లు, ఒక సిక్స్‌తో 34 పరుగులు చేసి ఔటయ్యాడు. చివర్లో జోసెఫ్ (29), ఓడియన్ స్మిత్ (36) పోరాడినా ఫలితం లేకుండా పోయింది. ధాటిగా ఆడిన స్మిత్ 18 బంతుల్లోనే మూడు సిక్సర్లు, మరో 3 ఫోర్లతో 36 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ మూడేసి వికెట్లు పడగొట్టారు. దీపక్, కుల్దీప్ చెరో రెండు వికెట్లను తీసి తమవంతు పాత్ర పోషించారు.

ఆదుకున్న అయ్యర్, పంత్

ఇక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఆశించిన స్థాయిలో ఆరంభం లభించలేదు. ఓపెనర్‌గా దిగిన కెప్టెన్ రోహిత్ శర్మ మూడు ఫోర్లతో 13 పరుగులు చేసి ఔటయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (0) ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. కొద్ది సేపటికే మరో ఓపెనర్ ధావన్ (10) కూడా వెనుదిరిగాడు. దీంతో భారత్ 42 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ తమపై వేసుకున్నారు. ధాటిగా ఆడిన పంత్ ఆరు ఫోర్లు, సిక్స్ 56 పరుగులు చేశాడు. ఇక కీలక ఇన్నింగ్స్ ఆడిన అయ్యర్ 9 ఫోర్లతో 80 పరుగులు సాధించాడు. చివరల్లో దీపక్ చాహర్ (38), వాషింగ్టన్ సుందర్ (33) మాత్రమే రాణించారు. మిగతావారు విఫలం కావడంతో భారత్ ఇన్నింగ్స్ 265 పరుగుల వద్దే ముగిసింది. ఇక అయ్యర్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కగా, యువ సంచలనం ప్రసిద్ధ్ కృష్ణ ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్ అవార్డును సొంతం చేసుకున్నాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News