Sunday, November 17, 2024

పరువు కోసం భారత్

- Advertisement -
- Advertisement -

చట్టోగ్రామ్: ఇప్పటికే వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడి సిరీస్‌ను కోల్పోయిన టీమిండియా శనివారం బంగ్లాదేశ్‌తో జరిగే చివరి వన్డేలోనైనా గెలిచి కాస్తయిన పరువును కాపాడుకోవాలని భావిస్తోంది. అయితే రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ గాయంతో ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేకుండా పోయాడు. ఇది భారత్‌కు పెద్ద ఎదురుదెబ్బగానే చెప్పాలి. ఆఖరి వన్డేలో కెఎల్ రాహుల్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇక వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచి సిరీస్‌ను దక్కించుకున్న ఆతిథ్య బంగ్లాదేశ్ ఈ పోరుకు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఇందులోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని తహతహలాడుతోంది. మెహదీ హసన్ మీరాజ్ జోరుమీదుండడం బంగ్లాదేశ్‌కు సానుకూల అంశం.

రెండు మ్యాచుల్లోనూ మెహదీ హసన్ బంగ్లాదేశ్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. ఈసారి కూడా జట్టు అతనిపై భారీ ఆశలు పెట్టుకుంది. అయితే కెప్టెన్ లిటన్ దాస్, ఓపెనర్ నజ్ముల్ హుస్సేన్ పేలవమైన బ్యాటింగ్ బంగ్లాదేశ్‌ను కలవరానికి గురిచేస్తోంది. సీనియర్లు ముష్ఫికుర్ రహీం, షకిల్ అల్ హస్, ఆఫిఫ్ హుస్సేన్ తదితరులు కూడా ఆశించిన స్థాయిలో రాణించలేక పోతున్నారు. కాగా, కిందటి మ్యాచ్‌లో మహ్మదుల్లా మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచడం, మీరాజ్‌దూకుడు మీద ఉండడంతో బంగ్లాదేశ్ ఆత్మవిశ్వాసంతో ఈ మ్యాచ్‌కు సిద్ధమైంది. ఇందులోనూ గెలిచి హ్యాట్రిక్ నమోదు చేయాలని భావిస్తోంది.

సవాల్ వంటిదే..

మరోవైపు టీమిండియాకు చివరి వన్డే సవాల్‌గా మారింది. ఇటీవల కాలంలో టీమిండియా తన స్థాయికి తగ్గ ఆటను కనబరచడంలో విఫలమవుతోంది. తొలి రెండు వన్డేల్లో ఆశించిన విధంగా రాణించలేక పోయింది. బ్యాటింగ్, బౌలింగ్ వైఫల్యాలు జట్టును వెంటాడుతున్నాయి. ముఖ్యంగా సీనియర్లు శిఖర్ ధావన్, విరాట్ కోహ్లిలు తమ స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరచడంలో విఫలమవుతున్నారు. తొలి రెండు మ్యాచుల్లో కోహ్లి పూర్తిగా నిరాశ పరిచాడు. ఇక ఈ మ్యాచ్‌లో రోహిత్ సేవలు కూడా జట్టుకు అందుబాటులో లేకుండా పోయాయి.

ఇలాంటి స్థితిలో భారత్ కష్టాలు రెట్టింపయ్యాయి. ఈ మ్యాచ్‌లో కోహ్లి, ధావన్, రాహుల్‌లు మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచాల్సి ఉంటుంది. అంతేగాక యువ ఆటగాళ్లు శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్, సుందర్‌లు కూడా తమ బ్యాట్‌కు పనిచెప్పాలి. అప్పుడే భారత్‌కు భారీ స్కోరు చేసే అవకాశాలుంటాయి. అంతేగాక బౌలర్లు శార్దూల్, ఉమ్రాన్, సిరాజ్, అక్షర్, సుందర్‌లు కూడా రాణించక తప్పదు. ఇలా బౌలర్లు, బ్యాటర్లు సమష్టిగా రాణిస్తేనే చివరి వన్డేలో భారత్‌కు గెలిచే ఛాన్స్ ఉంటుంది. లేకుంటే ఈ మ్యాచ్‌లో కూడా ఓటమి ఖాయం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News