విలువైన సమాచారాన్ని సేకరిస్తున్నామన్న డబ్ల్యూహెచ్‌ఒ
వుహాన్: మంగళవారం ప్రపంచ ఆరోగ్యసంస్థ(డబ్ల్యూహెచ్‌ఒ) నిపుణుల బృందం చైనా వుహాన్‌లోని పశువుల ఆసుపత్రిని సందర్శించింది. తమతో సమావేశం కోసం ఆసుపత్రిలో అద్భుతమైన సదుపాయాలు కల్పించారని, తమకు అవసరమైన సమాచారం అందించారని బృందం సభ్యుడు, జంతు శాస్త్రవేత్త పీటర్ దాస్‌జాక్ తెలిపారు. హుబే రాష్ట్రం పశువుల ఆరోగ్య విభాగం ఇంచార్జ్‌తోనూ భేటీ అయ్యామని ఆయన తెలిపారు. అతని నుంచి పలు ప్రశ్నలకు సమాధానాలు రాబట్టామని ఆయన తెలిపారు. హుబే రాష్ట్ర రాజధాని వుహాన్ అన్నది గమనార్హం. చైనాలో పర్యటన సందర్భంగా నిపుణుల బృందం తమ ఆరోగ్య రక్షణ కోసం ప్రత్యేక దుస్తులు ధరిస్తోంది. ఇప్పటికే వుహాన్‌లోని పలు పరిశోధనా సంస్థలు, ఆసుపత్రులు, మాంసం విక్రయ కేంద్రాలను సందర్శించి పలు వివరాలను సేకరించింది.
2019 చివరి నెలల్లో మొదటిసారిగా కరోనా కేసులు వుహాన్‌లో నమోదైన విషయం తెలిసిందే. అక్కడి నుంచి ఇతర దేశాలకు కరోనా వ్యాప్తిని అడ్డుకోవడంలో చైనా నిర్లక్షంగా వ్యవహరించిందన్న విమర్శలున్నాయి. సమాచారాన్ని దాచిపెట్టిందని అమెరికాసహా పలు దేశాలు మండిపడ్డాయి. దాంతో, అంతర్జాతీయ నిపుణుల బృందంతో నిజ నిర్ధారణకు చైనా అంగీకరించింది. ఈ నేపథ్యంలోనే నిపుణుల బృందం అక్కడ కరోనా వ్యాప్తికి సంబంధించిన కీలక ప్రాంతాల్లో తిరుగుతూ వివరాలు సేకరిస్తోంది. నిపుణుల బృందానికి అవసరమైన సహకారాన్ని అందిస్తున్నామని చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి వ్యాంగ్‌వెన్‌బిన్ వివరణ ఇచ్చారు. చైనా నిపుణుల బృందం పలు శాస్త్రీయ అంశాల్ని అంతర్జాతీయ బృందానికి తెలియజేసిందని ఆయన అన్నారు. చైనా నుంచి నిర్దిష్ట సమాచారాన్ని సేకరించడంలో డబ్లూహెచ్‌ఒ బృందం విఫలమవుతోందన్న విమర్శలను ఆ సంస్థ ఎమర్జెన్సీ చీఫ్ డాక్టర్ మైఖేల్ రియాన్ తిరస్కరించారు. తమ సంస్థ సేకరిస్తున్న పశువుల శాంపిళ్లు, జన్యు విశ్లేషణ ద్వారా మహమ్మారులకు సంబంధించి ఏళ్ల తరబడి సమాధానం దొరకని పలు ప్రశ్నలకు అవసరమైన డేటా లభిస్తుందని ఆయన అన్నారు.