Tuesday, November 5, 2024

తొలి టెస్టులో భారత్ విజయం

- Advertisement -
- Advertisement -

TeamIndia solid win over South Africa

సత్తా చాటిన భారత బౌలర్లు, ఎల్గర్, బవుమా శ్రమ వృథా, సౌతాఫ్రికాపై టీమిండియా ఘన విజయం

సెంచూరియన్: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 113 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 10 ఆధిక్యాన్ని అందుకుంది. 305 పరుగుల లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య దక్షిణాఫ్రికా 191 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లు సమష్టి కృషితో జట్టుకు చారిత్రక విజయం సాధించి పెట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో అద్భుత సెంచరీని సాధించిన ఓపెనర్ కెఎల్.రాహుల్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది. 94/4 ఓవర్‌నైట్ స్కోరుతో గురువారం చివరి రోజు బ్యాటింగ్‌ను చేపట్టిన సౌతాఫ్రికా మరో 97 పరుగులు జోడించి మిగతా వికెట్లను కోల్పోయింది.

ఎల్గర్, బవుమా పోరాటం..

ఐదో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన సౌతాఫ్రికా ఆరంభంలో కుదరుగా ఆడింది. కెప్టెన్ డీన్ ఎల్గర్, తెంబా బవుమా జాగ్రత్తగా ఆడుతూ ముందుకు సాగారు. ఇద్దరు వికెట్ కాపాడుకుంటూ భారత బౌలర్లను ఒత్తిడికి గురి చేశారు. వీరి బ్యాటింగ్ చూస్తుంటే ఒక దశలో మ్యాచ్ డ్రాగా ముగుస్తుందా అనిపించింది. పరుగుల జోలికి వెళ్లకుండా ఇద్దరు సమన్వయంతో ఆడారు. అద్భుత డిఫెన్స్‌తో భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నారు. ఈ జోడీని ఔట్ చేసేందుకు భారత బౌలర్లు చాలా సేపటి వరకు ఎదురు చూడాల్సి వచ్చింది. అయితే భారత నిరీక్షణకు బుమ్రా తెరదించాడు. కుదురుగా ఆడుతున్న డీన్ ఎల్గర్‌ను బుమ్రా వెనక్కి పంపాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన ఎల్గర్ 156 బంతుల్లో 12 ఫోర్లతో 77 పరుగులు చేసి ఎల్బీడబ్లూగా వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన వికెట్ కీపర్ డికాక్ ఎక్కువ సేపు క్రీజులో నిలువలేక పోయాడు. 28 బంతుల్లో రెండు ఫోర్లతో 21 పరుగులు చేసి సిరాజ్ వేసిన అద్భుత బంతికి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఆ వెంటనే వియాన్ ముల్డర్ కూడా ఔటయ్యాడు. అతను ఒక పరుగు మాత్రమే చేసి షమి బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు.

మరోవైపు ధాటిగా ఆడిన జాన్‌సెన్ మూడు ఫోర్లతో 13 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ వికెట్ కూడా షమి ఖాతాలోకే వెళ్లింది. ఇక కగిసో రబాడ (0), ఎంగిడి (0) అశ్విన్ వరుస బంతుల్లో పెవిలియన్ పంపించాడు. ఒంటరి పోరాటం చేసిన బవుమా 80 బంతుల్లో 4 ఫోర్లతో 35 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో బుమ్రా, షమి మూడేసి వికెట్లు పడగొట్టారు. అశ్విన్, సిరాజ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. కాగా, ఈ మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 327 పరుగులు చేసింది. ఓపెనర్లు కెఎల్.రాహుల్ (123), మయాంక్ అగర్వాల్ (60)లు జట్టును ఆదుకున్నారు. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం భారత్ 174 పరుగులకే ఆలౌటైంది. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 197 పరుగులకే పరిమితమైంది. దీంతో టీమిండియాకు కీలకమైన 130 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఇది భారత్ విజయంలో కీలక పాత్ర పోషించింది.

గెలుపుతో ముగింపు..

ఇక భారత్ విజయంతో ఈ ఏడాదిని ముగించింది. అంతేగాక ఒకే ఏడాది విదేశాల్లో నాలుగు టెస్టుల్లో గెలిచి అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఈ ఏడాది ఇంగ్లండ్‌లో రెండు, ఆస్ట్రేలియాలో ఒక టెస్టు మ్యాచ్‌లో టీమిండియా జయకేతనం ఎగుర వేసింది. తాజాగా సౌతాఫ్రికాతో సెంచూరియన్‌లో జరిగిన తొలి టెస్టులో కూడా జయభేరి మోగించింది. కాగా ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియాపై చారిత్రక విజయంతో టెస్టులకు శ్రీకారం చుట్టిన టీమిండియా గెలుపుతోనే సిరీస్‌ను ముగించడం విశేషం. ఇక విదేశాల్లో నాలుగు టెస్టుల్లో గెలవడం ఇది భారత్‌కు రెండోసారి. 2018లో కూడా టీమిండియా ఇలాంటి రికార్డును నమోదు చేసింది. అప్పుడూ ఇంగ్లండ్, సౌతాఫ్రికాలో ఒక్కో మ్యాచ్‌లో విజయం సాధించిన భారత్, మరో రెండు టెస్టులను ఆస్ట్రేలియాలో గెలిచింది. కాగా, సెంచూరియన్ మైదానంలో భారత్‌కు టెస్టుల్లో ఇదే తొలి విజయం కావడం గమనార్హం. గతంలో ఇక్కడ ఒక్కసారి కూడా భారత్ టెస్టుల్లో గెలవలేదు. కానీ ఈసారి ఆ రికార్డును తిరగరాసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News