Monday, December 23, 2024

తొలి రోజు బౌలర్లదే..

- Advertisement -
- Advertisement -

TeamIndia were all out for 252 in first innings

భారత్ 252 ఆలౌట్, శ్రీలంక 86/6
గులాబి టెస్టు సమరం

బెంగళూరు: భారత్‌-శ్రీలంక జట్ల మధ్య శనివారం ప్రారంభమైన డేనైట్ టెస్టు మ్యాచ్‌లో తొలి రోజు బౌలర్లు ఆధిపత్యం చెలాయించారు. బెంగళూరు వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో మొదటి రోజే ఏకంగా 16 వికెట్లు నేల కూలడం విశేషం. టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 59.1 ఓవర్లలో 252 పరుగులకే ఆలౌటైంది. తర్వాత మొదటి ఇన్నింగ్స్ చేపట్టిన శ్రీలంక కూడా శనివారం ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్ల నష్టానికి 86 పరుగులు మాత్రమే చేసింది. భారత్ మొదటి ఇన్నింగ్స్ స్కోరును అందుకోవాలంటే శ్రీలంక మరో 166 పరుగులు చేయాలి. ఇప్పటికే కీలకమైన వికెట్లను కోల్పోయిన లంక ఈ స్కోరును అధిగమించాలంటే చాలా కష్టమనే చెప్పాలి.

బుమ్రా, షమి మాయ..

భారత్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేశామన్నా ఆనందం లంకకు ఎక్కువ సేపు నిలువలేదు. తొలి ఇన్నింగ్స్ చేపట్టిన లంకకు ప్రారంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. ఓపెనర్ కుశాల్ మెండిస్ (2)ను బుమ్రా వెనక్కి పంపాడు. కొద్ది సేపటికే వన్‌డౌన్‌లో వచ్చిన లహిరు తిరిమన్నే (8)ను కూడా బుమ్రా ఔట్ చేశాడు. ఇక కెప్టెన్ దిముత్ కరుణరత్నె (4), ధనంజయ డిసిల్వా (10)లను మహ్మద్ షమి పెవిలియన్ బాట పట్టించాడు. దీంతో లంక 28 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. మరోవైపు సీనియర్ ఆటగాడు ఎంజిలో మాథ్యూస్ కొద్ది సేపు పోరాటం చేశాడు. భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న మాథ్యూస్ 3 ఫోర్లు, రెండు సిక్సర్లతో 43 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఇక ప్రమాదకర బ్యాట్స్‌మన్ చరిత్ అసలంక (5)ను అక్షర్ పటేల్ వెనక్కి పంపాడు. దీంతో లంక 85 పరుగుల వద్ద ఆరో వికెట్‌ను కోల్పోయింది. ఆట ముగిసే సమయానికి వికెట్ కీపర్ డిక్వెల్లా 13 (బ్యాటింగ్), లసిత్ 0 (బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. టీమిండియా బౌలర్లలో బుమ్రా మూడు, షమి రెండు వికెట్లు పడగొట్టారు.

అయ్యర్ సెంచరీ మిస్..

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో లంక బౌలర్లు సఫలమయ్యారు. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (4), రోహిత్ శర్మ (15) జట్టుకు శుభారంభం అందించలేక పోయారు. హనుమ విహారి (31), విరాట్ కోహ్లి (23) కూడా నిరాశ పరిచారు. ధాటిగా ఆడిన రిషబ్ పంత్ ఏడు ఫోర్లతో 39 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ దశలో జట్టును ఆదుకునే బాధ్యతను యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ తనపై వేసుకున్నాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా అయ్యర్ తన పోరాటాన్ని కొనసాగించాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన అయ్యర్ 98 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 92 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో 8 పరుగుల తేడాతో శతకం సాధించే అవకాశాన్ని కోల్పోయాడు. ఇక లంక బౌలర్లలో లసిత్, జయవిక్రమ మూడేసి వికెట్లు పడగొట్టారు. ధనంజయకు రెండు వికెట్లు దక్కాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News