Friday, November 22, 2024

తాళాలు పగులగొట్టి.. సోదాలు

- Advertisement -
- Advertisement -

 

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆదాయపు పన్ను, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. కరీంనగర్‌లో మంత్రి గంగుల కమలాకర్, అతడి సోదరుడి నివాసం, జిల్లా కేంద్రంలోని ఐదు గ్రానైట్ కంపెనీల కార్యాలయాలపై ఈడి, ఐటి అధికారుల బృందాలు దాడుల నిర్వహించారు. కరీంనగర్ కు ఉదయమే చేరుకున్న ఈడి, ఐటి అధికారులు ఏకకాలంలో శ్వేత, పిఎస్‌ఆర్, ఎస్‌విజి1,ఎస్‌విజి2, అరవింద్ వ్యాస్ గ్రానైట్ కార్యాలయాలు, ఆయా సంస్థల యజమానుల ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. గ్రానైట్ వ్యాపారంలో అవకతవకలు జరిగినట్లు ఫిర్యాదు రావడంతో ఐటి, ఈడి అధికారులు సోదాలు చేసినట్లు తెలిసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కేటాయించిన మైన్లలో అనుమతికి మించి మైనింగ్ చేపట్టారని ఫిర్యాదులు వచ్చినట్లు తెలిసింది.

ఈ ఫిర్యాదులపై ఐటి, ఈడి అధికారులు దృష్టిసారించారు. ముందుగా కరీంనగర్, మంకమ్మతోటలోని మంత్రి గంగుల కమలాకర్ ఇంటికి వచ్చిన అధికారులకు తాళాలు వేసి ఉన్నాయి. వెంటనే ఆరా తీసిన అధికారులకు మంత్రి కుటుంబ సభ్యులతో కలిసి దుబాయ్‌కు వెళ్లినట్లు తెలిసింది. వెంటనే మంత్రి గంగుల పిఏను పిలిచి ఆయన సమక్షంలో తాళాలను డ్రిల్ మిషన్‌తో పగులగొట్టి అధికారులు ఇంటిలోకి వెళ్లి సోదాలు చేశారు అనంతరం మంత్రి క్యాంప్ కార్యాలయంలో తనిఖీలు చేశారు. శ్వేతా ఏజెన్సీ, ఎఎస్‌యూవై షిప్పింగ్, జెఎమ్ బాక్సీ, మైథిలీ ఆదిత్య ట్రాన్స్‌పోర్టు, అరవింద్ గ్రానైట్స్, షాండియా ఏజెన్సీస్, సిఎస్‌ఆర్ ఏజెన్సీ, కెవిఏ ఎనర్జీ, శ్రీవెంకటేశ్వర గ్రానైట్స్‌లో తనిఖీలు నిర్వహించారు. ఈ కంపెనీలు విదేశాలకు గ్రానైట్‌ను ఎగుమతులకు సంబంధించి ఫెమా నిబంధనలు ఉల్లంఘించి మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా ఆదాయపన్ను ఎగవేతలపై ఐటి శాఖ సోదాలు నిర్వహించింది.

మంత్రులు గంగుల కమలాకర్ సోదరుడు గంగుల వెంకన్న ఇంట్లో కూడా ఐటి, ఈడి అధికారులు సోదాలు నిర్వహించారు. ఈయన శ్వేతా గ్రానైట్ వ్యవహరాలు చూసుకుంటున్నారు. ఇప్పటికే వీరికి నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది. దీంతోపాటు పంజాగుట్టలోని పిఎస్‌ఆర్ గ్రానైట్స్, హైదర్‌గూడలోని జనప్రియ అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్లలో తనిఖీలు నిర్వహించారు. సోమాజిగూడలోని గ్రానైట్ వ్యాపారి శ్రీదర్ ఇంట్లోనూ సోదాలు జరిగాయి. కరీంనగర్‌లో నాలుగు చోట్ల, అలాగే బావుపేటలోని గ్రానైట్ పరిశ్రమల కార్యాలయాల్లోనూ అధికారులు సోదాలు చేశారు. హైదరాబాద్ అత్తాపూర్‌లోని జనప్రియ అపార్టుమెంట్‌లో ఎస్‌విజి2 గ్రానైట్ భాగస్వామి అయిన రవీందర్ రావు నివసిస్తుండగా అక్కడ ఈడి, ఐటి అధికారులు దాడులు నిర్వహించారు. పిఎస్‌ఆర్ గ్రానైట్ యజమాని శ్రీధర్‌రావు హైదరాబాద్‌లో ఉండగా ఆయన గెస్ట్‌హౌస్ కం ఆఫీస్‌లో కూడా సోదాలు నిర్వహించారు.

కరీంనగర్ కమాన్ సమీపంలో నివాసముంటున్న గ్రానైట్ వ్యాపారి అరవింద్ వ్యాస్, ఎస్‌విజి1 గ్రానైట్ యజమాని వేణుగోపాల్ కార్వా నివాస గృహాల్లో తనిఖీలు నిర్వహించి రికార్డులు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. పదేళ్ల క్రితం కరీంనగర్‌కు చెందిన ఎనిమిది గ్రానైట్ కంపెనీలు విదేశాలకు గ్రానైట్ రవాణా చేసిన సమయంలో అక్రమాలకు పాల్పడి ప్రభుత్వానికి కోట్ల రూపాయల నష్టం వాటిల్లజేశారని ఆరోపణలు వచ్చాయి.దీనిపై 2013లో విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ విచారణ జరిపించి ఆయా కంపెనీలు తప్పుడు కొలతలతో 124 కోట్ల 94లక్షల రూపాయల విలువజేసే గ్రానైట్ అక్రమంగా రవాణా చేశాయని తేల్చి ఆయా కంపెనీలకు ఐదు రేట్లు జరిమానా విధించారు. నిబంధనలు ఉల్లంఘించిన కంపెనీలు రూ.749.64కోట్లు చెల్లించాలని ఈడి అధికారులు నోటీసులు జారీ చేశారు.

దుబాయ్ నుంచి మంత్రి గంగుల రిటర్న్…

ఐటి, ఈడి దాడుల విషయం తెలుసుకున్న మంత్రి గంగుల కమలాకర్ దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు బయల్దేరి వచ్చారు. మంగళవారం కుటుంబ సభ్యులతో కలిసి దుబాయ్ వెళ్లిన మంత్రి ఆదాయపన్ను శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల సోదాల గురించి ఫోన్‌లో తెలుసుకుని హుటాహుటిన హైదరాబాద్‌కు టికెట్‌లు బుక్‌చేసుకుని వచ్చారు.

దర్యాప్తు సంస్థలకు సహకరిస్తా : మంత్రి గంగుల కమలాకర్

మన తెలంగాణ/సిటీబ్యూరో: కేంద్ర దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరిస్తానని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. దర్యాప్తు సంపూర్ణంగా తనిఖీలు పూర్తి చేయండని, నిజా నిజాలు తేల్చాల్సిన బాధ్యత దర్యాప్తు సంస్థలదని తెలిపారు. ఈడి అధికారులకు ఇంటి తాళాలు తీయాలని వీడియో కాల్‌లో చెప్పానని అన్నారు. ఇంట్లోని ప్రతి లాకర్‌ను ఓపెన్ చేసి చూసుకొమ్మని చెప్పానని, సోదాల్లో ఎంత క్యాష్ దొరికిందో, ఏమేం స్వాధీనం చేసుకున్నారో వారే చెప్పాలని అన్నారు.

మైనింగ్, రాయల్టీకి సంబంధించిన అంశాలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనివని స్పష్టం చేశారు. బయట దేశాల నుంచి డబ్బులు హవాలా ద్వారా తెచ్చామని ఈడి, అక్రమంగా డబ్బలు నిల్వ ఉంచామని ఐటి శాఖ తనిఖీలు చేస్తోందని తెలిపారు. గతంలో మాపై చాలామంది ఈడి, ఐటికి ఫిర్యాదు చేశారని, దానిని మేం స్వాగతించామని తెలిపారు. పారదర్శకంగా వ్యాపారం నిర్వహిస్తున్నామని, ప్రభుత్వ అన్ని అనుమతులతో వ్యాపారం నిర్వహిస్తున్నామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News