డిసెంబర్‌లో ఆత్మహత్య చేసుకున్న బెంగళూరు టెకీ అతుల్ సుభాష్, అతని నుంచి విడాకులు తీసుకున్న భార్య నికితా సింఘానియాల నాలుగు సంవత్సరాల కుమారుడు తల్లి దగ్గరే ఉండాలని సుప్రీం కోర్టు సోమవారం సాయంత్రం తీర్పు ఇచ్చింది. నికిత వేధింపుల కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని అతుల్ అంతకు ముందు ఆరోపించారు. బాలుని కస్టడీని కోరిన సుభాష్ తల్లి అంజు దేవి పిటిషన్‌కు స్పందనగా సుప్రీం కోర్టు న్యాయమూర్తులు బివి నాగరత్న, ఎస్‌సి శర్మ వీడియో లింక్ ద్వారా బాలునితో మాట్లాడిన తరువాత తీర్పు వెలువరించారు.
కేసు విచారణ సోమవారం మొదలుకాగా, మరింత సమగ్రంగా అఫిడవిట్ దాఖలు చేయడానికి ఒక వారం సమయాన్ని పిటిషనర్ కోరారు. కానీ, జస్టిస్ నాగరత్న ఆ అభ్యర్థనను తిరస్కరించారు. ‘ఇది హెబియస్ కార్పస్ (పిటిషన్)& మేము బాలుని చూడాలని అనుకుంటున్నాం. బాలుని తీసుకురండి. కొంత సేపైన తరువాత కోర్టు విచారణ చేపడుతుంది’ అని ఆమె స్పష్టం చేశారు. 45 నిమిషాల విరామానంతరం వీడియో లింక్‌పై బాలుడు కనిపించాడు. 45 నిమిషాల సమయంలో అతని అస్తిత్వం పరిరక్షణ కోసం కోర్టు ఆఫ్‌లైన్‌లోకి వెళ్లింది.