Tuesday, November 5, 2024

అనారోగ్య ‘టెకీ’లు

- Advertisement -
- Advertisement -

కడుపులో చల్ల కదలకుండా కూర్చుని పని చేసుకునే ఉద్యోగం దొరికితే బాగుండునని అనుకునేవారు చాలా మందే ఉంటారు. ఐటి ఉద్యోగాలు ఈ కోవకే చెందుతాయనే దురభిప్రాయం చాలా మందిలో ఉన్నమాట నిజం. హాయిగా ఎసి నీడన కంప్యూటర్ ముందు కాళ్లు జాపుకుని కూర్చుని పని చేసుకునే వీలున్న ఐటి ఉద్యోగాలు తమ పిల్లలకు రావాలని కోరుకునే తల్లిదండ్రులు కూడా లేకపోలేదు. అయితే కదలకుండా గంటల తరబడి కుర్చీలను అంటిపెట్టుకుని కూర్చునే ఉద్యోగుల్లో పలు రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయంటూ వైద్యులు అడపాదడపా హెచ్చరిస్తూ ఉండటం కద్దు.

ఐటి ఉద్యోగుల విషయానికొస్తే, పని గంటలతో పాటు పని ఒత్తిడీ ఎక్కువే. వీటిని అధిగమించేందుకు కొందరు జంక్ ఫుడ్, సిగరెట్లు, మద్యపానానికి అలవాటు పడుతున్నారు. ఇవి అనారోగ్య సమస్యలను మరింత పెంచుతున్నాయి. తాజాగా ఐటి ఉద్యోగుల ఆరోగ్య స్థితిగతులపై హెచ్.సి.ఎల్. హెల్త్ కేర్ సంస్థ చేపట్టిన విస్తృత అధ్యయనంలో ఆందోళన కలిగించే పలు అంశాలు బయటపడ్డాయి. ఈ హెల్త్ కేర్ సంస్థ దేశవ్యాప్తంగా 25 -40 ఏళ్ల మధ్య వయసున్న 56 వేల మంది ఐటి ఉద్యోగులపై వారి పని ప్రదేశాల వద్దే వైద్యుల సమక్షంలో పరీక్షలు నిర్వహించింది. ప్రీ డయాబెటీస్, డయాబెటీస్, ఊబకాయం, రక్తపోటు, రక్తహీనత, హైపోథైరాయిడిజమ్, అధిక కొవ్వు, ప్రీ హైపర్ టెన్షన్- ఇలా ఎనిమిది అంశాలపై నిర్వహించిన వైద్య పరీక్షల్లో కేవలం 23 శాతం మందిలో మాత్రమే ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవట.

మిగిలినవారిలో ప్రతి ఒక్కరూ ఒకటి, అంతకుమించిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తేలింది. కేవలం కూర్చుని పని చేయడం మాత్రమే కాదు, ఏ భంగిమలో కూర్చుంటున్నారనేది కూడా ముఖ్యమే. కూర్చునే రీతిలో కూర్చోకపోవడం వల్ల వెన్నెముక సమస్యలు తలెత్తుతున్నాయి. ఐటి ఉద్యోగుల్లో తలనొప్పి, కంటి సమస్యలు కూడా ఎక్కువే. ఎక్కువ సేపు కంప్యూటర్ ముందే గడిపేవారు కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ (సివిసి) అనే సమస్యతో సతమతమవుతున్నట్లు గతంలోనూ ఓ సర్వే తేల్చి చెప్పింది. కార్పొరేట్ వ్యవస్థలలో పని చేసే ఉద్యోగులలో పెరుగుతున్న అనారోగ్య సమస్యలను వెలుగులోకి తేవడమే లక్ష్యంగా హెచ్.సి.ఎల్. సంస్థ ఈ అధ్యయనం చేపట్టడం అభినందనీయం. లక్షల్లో జీతం పొందే ఐటి ఉద్యోగులపై పని భారం, ఒత్తిడి విపరీతంగా ఉంటుందన్నది కాదనలేని సత్యం.

గంటల కొద్దీ కూర్చుని పని చేస్తేనే తప్ప టార్గెట్లు పూర్తి కావు. రోజంతా పని చేసి అలసిసొలసిపోయే ఉద్యోగులకు వ్యాయామం చేసే ఓపిక, శ్రద్ధ ఉండటం లేదు. ఐటి ఉద్యోగాలు చేసే భార్యాభర్తలు భిన్నమైన పని వేళల కారణంగా సంసార సుఖానికి దూరమవుతున్నారనే విషయం తెలిసిందే. కాగా రోజంతా కంప్యూటర్‌తో సహజీవనం చేసే ఉద్యోగులలో సంతానలేమి సమస్య ఎక్కువగా కనిపిస్తోందని హెచ్.సి.ఎల్. అధ్యయనంలో తేలడం కలవరపెట్టే అంశం. పాతికేళ్ల వయసుకే ఐటి ఉద్యోగులు అనారోగ్యం బారిన పడుతుండగా, 40 ఏళ్లు దాటిన వారిపై వివిధ రకాల రోగాలు ముప్పేట దాడి చేస్తున్నాయట. కేవలం ఐటి ఉద్యోగులే కాదు, యాంత్రిక జీవన శైలికి, రివర్స్ టైమ్‌లో పనిచేయడానికి అలవాటు పడిన ఉద్యోగులలో అధిక శాతం మంది ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, పిన్న వయసులోనే తమ ప్రాణాలకు ముప్పు కొనితెచ్చుకుంటున్నారు.

ఆరోగ్యమే మహాభాగ్యమని పెద్దలు ఊరకనే చెప్పలేదు. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్లు చదువుసంధ్యలు, ఆస్తిపాస్తులు ఎన్ని ఉన్నా, ఆరోగ్యం లేకపోతే అవన్నీ వృథాయే. పని వేళల్లో ప్రతి గంటకు ఐదు నిమిషాల సేపు లేచి నాలుగు అడుగులు వేయడం తప్పనిసరంటూ వైద్యులు చేసే హెచ్చరికలను పెడచెవిన పెడుతున్న ఉద్యోగులే ఎక్కువ మంది. పని ఒత్తిడిలో ఏం తింటున్నామనే విషయాన్ని కూడా వారు పట్టించుకోవడం లేదు. ఆ సమయానికి ఏది దొరికితే అది తినడం, జంక్ ఫుడ్ వైపు మొగ్గుచూపడం ఐటి ఉద్యోగులలో ఎక్కువగా కనిపించే దుర్లక్షణం. పని భారం ఎంత ఉన్నప్పటికీ దైనందిన జీవితంలో వ్యాయామానికి కొంత సమయం కేటాయించుకోవడం ముఖ్యం. ధూమ, మద్యపానాలకూ, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండటమూ తప్పనిసరి. తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవడం వల్ల అనారోగ్య సమస్యలను మొగ్గదశలోనే తుంచివేసే అవకాశం ఉంటుంది. సంపాదనలో పడి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం వివేకవంతుల లక్షణం కాదనే విషయాన్ని గుర్తించి మసలుకున్నప్పుడే ఉద్యోగులలోనూ, వారి కుటుంబాలలోనూ సుఖసంతోషాలు వెల్లివిరిసేది!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News