మంత్రి కెటిఆర్ సమక్షంలో ఐఎస్‌బితో సాంకేతిక విద్యాశాఖ ఒప్పందం
మనతెలంగాణ/ హైదరాబాద్ : యువతకు ఉపాధి అవకాశాలను పెంచేందుకు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌తో తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ బోర్డు అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. శుక్రవారం గచ్చిబౌలిలోని ఐఎస్‌బి ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ సమక్షంలో ఐఎస్‌బి డిప్యూటీ డీన్ ప్రొఫెసర్ దీపామణి, ఎస్‌బిటిఇటి కార్యదర్శి డాక్టర్ సి శ్రీనాథ్ సంతకం చేశారు. సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, ఐఎస్‌బి డీన్ ప్రొఫెసర్ మదన్ పిల్లుట్ల, ఐటి, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ పాల్గొన్నారు. అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు తెలంగాణలో ఉపాధి నైపుణ్యాలను బలోపేతం చేసేందుకు ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రధానంగా నాలుగు నైపుణ్య కార్యక్రమాల పాఠ్యాంశాలను అభివృద్ధి చేయనున్నారు.- వ్యాపార అక్షరాస్యత కార్యక్రమం, ప్రవర్తనా నైపుణ్యాల కార్యక్రమం, డిజిటల్ అక్షరాస్యత ప్రోగ్రామ్, వ్యవస్థాపక అక్షరాస్యత ప్రోగ్రామ్, లెర్నింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఎల్‌ఎంఎస్) ప్లాట్‌ఫారమ్‌లో నిపుణులతో డిగ్రీ విద్యార్థుల కోసం ఈ కార్యక్రమం అమలు చేయనున్నారు.
కోర్సులను విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థులకు సాంకేతిక విద్యాశాఖ, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ సంయుక్తంగా సర్టిఫికేట్‌లను అందజేస్తారు. కమిషనర్ నవీన్ మిట్టల్ మాట్లాడుతూ తెలంగాణ విద్యార్థులకు మరింత ఉపాధి కల్పించేందుకు, భవిష్యత్తు అవకాశాలకు సిద్ధంగా తయారు చేయనున్నట్లు తెలిపారు. డీన్, ప్రొఫెసర్ మదన్ పిల్లుట్ల మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని నైపుణ్యం కలిగిన శ్రామికశక్తికి కేంద్రంగా మర్చేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందన్నారు. రాష్ట్ర యువతను ప్రపంచ వ్యాప్తంగా పోటీపడేలా చేయడంలో మరింత క్రియాశీలకంగా పనిచేస్తామన్నారు. ప్రతి కోర్సు 40 గంటల పాటు ఆన్‌లైన్‌లో శిక్షణ తరగతులను నిర్వహించనున్నట్లు తెలిపారు. త్వరలోనే ఇందుకు సంబంధిత మార్గదర్శకాలను వెబ్‌సైట్‌లో ఉంచుతామని వెల్లడించారు.