- Advertisement -
మాస్కో : రష్యా దేశీయ విమాన సంస్థ ‘ఉరల్ ఎయిర్ లైన్స్’కు చెందిన ఎ320 విమానం మంగళవారం బయలుదేరిన తరువాత సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్ దానిని అత్యవసరంగా పొలాల్లో ల్యాండ్ చేయవలసి వచ్చింది. సోచిలోని బ్లాక్‌సీ రిసార్ట్ నుంచి సైబీరియా నగరం ఓమ్స్‌కు బయలుదేరింది. అందులో 167 మంది ప్రయాణికులు ఉన్నారు. నొవొసిబిర్క్ ప్రాంతానికి రాగానే విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది.
పైలట్ అప్రమత్తమై కామెంకా గ్రామ సమీపం లోని పొలాల్లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అయితే విమానం సురక్షితంగా ల్యాండ్ అయినప్పటికీ దాని భాగాలు కొన్ని దెబ్బతిన్నాయి. ప్రయాణికులను సమీప గ్రామం లోకి అధికారులు తరలించారు. ప్రయాణికులకు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. భద్రతా నియమాలను ఉల్లంఘించిన నేపథ్యంలో రష్యా ఇన్‌వెస్టిగేటివ్ కమిటీ క్రిమినల్ కేసు నమోదు చేసింది.
- Advertisement -