ప్రయోగాత్మకంగా ఒక గనిలో ఏర్పాటుకు పరిశీలన
సిఎండి బలరామ్‌కు వివరించిన ఆస్ట్రేలియా బృందం
మన తెలంగాణ / హైదరాబాద్: భూగర్భ గనులను నూరు శాతం ప్రమాదరహిత గనులుగా రూపొందించడం కోసం సింగరేణి యాజమాన్యం అంతర్జాతీయస్థాయిలో అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతికతను పరిశీలిస్తోందని, మేలైన సాంకేతికతను వినియోగించడానికి సింగరేణి సిద్ధంగా ఉందని సిఎండి ఎన్.బలరామ్ పేర్కొన్నారు. భూగర్భ గనులలో పైకప్పుకూలి జరిగే ప్రమాదాలను నివారించడం కోసం ఆస్ట్రేలియా దేశానికి చెందిన నోమ్ అనే సంస్థ కొత్తగా రూపొందించిన ఆధునిక పరికరాల పనితీరును గురువారం హైదరాబాద్ సింగరేణి భవన్ లో పరిశీలించిన తరువాత పై ఆయన ఉన్నత స్థాయి అధికారులతో చర్చించారు .భూగర్భగనులలో రక్షణ చర్యలు ఎన్నో తీసుకున్నప్పటికీ అకస్మాత్తుగా పైకప్పు కూలి కార్మికులు మృతిచెందిన సంఘటనలు గతంలో అనేకం జరిగాయి. కాగా ఆస్ట్రేలియాకి చెందిన ప్రముఖ పరిశోధన సంస్థ నోమ్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పై కప్పు ప్రమాదాలు జరగకముందే ముందస్తు హెచ్చరికలు జారీ చేసే ఒక యంత్ర విభాగాన్ని రూపొందించారు. దీనివలన పైకప్పు ప్రమాదం జరగకముందే గనిలోని కార్మికులను అధికారులు హెచ్చరిస్తూ ఫ్లాష్ లైటింగ్ ద్వారా కానీ సైరన్ ద్వారా గాని ఇది అప్రమత్తం చేస్తుంది. దీనివలన ప్రమాదాన్ని నివారించడం కోసం అన్ని రకాల చర్యలు తీసుకొని, ప్రాణ నష్టం జరగకుండా చూసే అవకాశం ఏర్పడుతుంది. ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సింగరేణి సంస్థలో కూడా వినియోగించాలని కోరుతూ ఆస్ట్రేలియాకి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నాథన్ ఓవెన్, జనరల్ మేనేజర్ కేసన్ ఫిన్ లెన్ సంస్థ చైర్మన్ మరియు ఎండి ఎన్ బలరాం, డైరెక్టర్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్ జి వెంకటేశ్వర్ రెడ్డి, జనరల్ మేనేజర్ (ఆర్ అండ్ డి ) ఎస్డిఎం సుభానికి డెమో స్టేషన్ ద్వారా వివరించారు.
దీనిపై డైరెక్టర్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్ జి వెంకటేశ్వర్ రెడ్డి వివరిస్తూ ప్రమాదాల నివారణకు ఇప్పటికే సింగరేణి సంస్థ అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తుందని, భూగర్భంలో పైకప్పు కిందికి జారడం పైన ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసే ఈ కొత్త సాంకేతికత వల్ల ప్రమాదాలను నూరు శాతం అరికట్టే అవకాశం ఉందన్నారు. జనరల్ మేనేజర్ (ఆర్ అండ్ డి ) ఎస్. డి.ఎం సుభాని మాట్లాడుతూఆస్ట్రేలియా బృందం వారు ఇచ్చిన డెమోనిస్ట్రేషన్ ను పరిశీలించామని, దీనిపై ఉన్నత స్థాయిలో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని వివరించారు.