Friday, December 20, 2024

హాలీవుడ్‌పై టెక్నాలజీ పడగ!

- Advertisement -
- Advertisement -

అమెరికా సినిమా నిర్మాణ క్షేత్రం హాలీవుడ్. ఒక రకంగా ప్రపంచ సినిమాను శాసించే మద గజంగా కూడా దీనిని పేర్కొనవచ్చు.మనం చూస్తున్న భారీ ఇంగ్లిష్ సినిమాలన్నీ అక్కడే తయారవుతాయి. 1910లో అక్కడ నుండి ఇన్ ఓల్ కాలిఫోర్నియా అనే 17 నిమిషాల తొలి సినిమా బయటకొచ్చింది. పారామౌంట్, కొలంబియా, యూనివర్సల్, వార్నర్ బ్రదర్స్ మొదలగు భారీ స్టూడియోలు అక్కడే ఉన్నాయి. 25 లక్షల మందికి హాలీవుడ్ జీవనోపాధి కల్పిస్తోంది.
ఎప్పటికప్పుడు చేతికి అందివస్తున్న టెక్నాలజీని కూడా ఉపయోగిస్తూ హాలీవుడ్ అద్భుతాలను సృష్టిస్తోంది. అవతార్, స్టార్ వార్స్, టైటానిక్, జురాసిక్ పార్క్ లాంటి భారీ గ్రాఫిక్స్ చిత్రాల నిర్మాణంతో ప్రపంచ చలన చిత్ర నిర్మాణంలో, ప్రదర్శనలో, వసూళ్లలో ముందు నిలుస్తోంది. ఈ మధ్య వస్తున్న హాలీవుడ్ సినిమాల్లో నటీనటులకు శ్రమ తగ్గేలా విజువల్ ఎఫెక్ట్ వాడకం పెరిగిపోతోంది. వయసు పైబడిన నటీనటులను యువకులుగా, అందంగా చూపేందుకు టెక్నాలజీ పనికొచ్చేసరికి తొలుత అందరూ దాన్ని ఆహ్వానించారు. ఉదాహరణకి 81 ఏళ్ల హర్రిసన్ ఫోర్డ్‌ను ఇండియానా జోన్స్‌లో యువకుడిగా చూపించగలిగారు. ఫోర్డ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో 25 నిమిషాల ప్లాష్ బ్యాక్‌లో ఆయన యువకుడిగా కనబడతాడు. ఎఐ ఆధారిత ఫేస్ స్వాప్ టెక్నాలజీతో ఇది సాధ్యమయిందట.

అయితే సినిమాల్లో టెక్నాలజీ భూతం పెరిగి పెరిగి చివరికి కొన్ని క్రాఫ్ట్‌లను మింగేసే దశకు చేరుకుంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ , చాట్ జిపిటి రాకతో తమ అస్తిత్వానికి రాబోయే ఉపద్రవాన్ని గ్రహించిన హాలీవుడ్‌లోని స్క్రిప్ట్ రచయితలు, నటీనటులు తమ హక్కులను, ఆదాయాన్ని కాపాడుకునేందుకు మోషన్ పిక్చర్స్, టెలివిజన్ ప్రొడ్యూసర్స్ మండలితో కొన్ని ఒప్పందాలు చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు.

ఇప్పటికే సినిమా షూటింగ్ దశలోనే నటీనటుల ప్రాధాన్యత తగ్గుముఖం పడుతోంది. కొన్ని సన్నివేశాల్లో నటించిన వారి ఆకారాలను, రూపాలను అవసరార్థం టెక్నాలజీ సాయంతో మార్చుతూ మిగితా సన్నివేశాలు చిత్రీకరించి సినిమాలను పూర్తి చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. గుంపులో నటించే ఎక్స్ ట్రా నటులకు ఒక రోజు వేతనమిచ్చి ఆ దృశ్యాలను సినిమా అంతా వాడుకుని నటుల ఆదాయానికి గండి కొడుతూ నిర్మాతలు పెట్టుబడిని తగ్గించుకుంటున్నారు. ఈ పరిస్థితిని గ్రహించిన హాలీవుడ్ స్క్రిప్ట్ రచయితలు చాట్ జిపిటి వాడకాన్ని పరిమితం చేయాలని, చిత్రంపై రచనా హక్కులు తమకే ఉండాలని నిర్మాతలను కోరారు. అవసరమైతే కృతిమ మేధస్సు వాడకంతో మేమే సినిమాకు అవసరమైన కథ, స్క్రీన్ ప్లే , మాటలు సిద్ధం చేసి ఇస్తామని సినిమా టైటిల్స్‌లో రచయితగా ఒక వ్యక్తి పేరు ఉండాలని, ఆ క్రెడిట్ తమకే దక్కాలని కోరుతున్నారు. టెక్నాలజీ సాయంతో చేసిన పనికి రచయితకు కాపీ రైట్ ఉండే అవకాశం ఉండదని నిర్మాతలు అడ్డుపడుతున్నారు. అయితే రచయితలకు మోషన్ పిక్చర్స్, టెలివిజన్ ప్రొడ్యూసర్స్ నుండి సరియైన స్పందన రాకపోవడంతో మే నెలలో వారు సమ్మె ఆరంభించారు. ఈ సమ్మెకు పిలుపునిచ్చిన స్క్రీన్ రైటర్స్ గిల్ లో 11500 మంది సభ్యులు ఉన్నారు.

వీరికి తోడుగా- ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తమ అనుమతి లేకుండానే తమ రూపాలను, గొంతులను సృష్టించి పాత్రల నిడివిని పెంచుకోవడంపై హాలీవుడ్ నటీనటుల నుండి కూడా వ్యతిరేకత మొదలైంది. ఒకసారి క్లౌన్ రూపానికి తాము అనుమతి ఇచ్చాక దానిని విచ్చలవిడిగా వాడుకొని కళాకారులకు అపార నష్టాన్ని కలిగిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. దానితో రచయితలకు తోడుగా హాలీవుడ్ నటీనటులు కూడా జులై 13న సమ్మెకు దిగారు. యాక్టర్స్ గిల్‌లో 65,000 నటీనటులు ఉన్నారు. 1960 తర్వాత అక్కడ ఇదే మరో సమర శంఖారావం. ఈ జంట సమ్మెల వల్ల హాలీవుడ్‌లో ఎన్నో భారీ చిత్రాల నిర్మాణం పనులు స్తంభించాయి. జులై 17న లాస్ ఏంజెల్స్‌లో వందలాది హాలీవుడ్ నటులు తమ డిమాండ్ల ప్లకార్డులతో రోడ్డెక్కారు. అమెరికాలోని లాస్ ఏంజెల్స్, న్యూయార్క్ , బోస్టన్, షికాగో నగరాలతో పాటు లండన్ లోనూ నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు. ప్రముఖ హాలివుడ్ నటుడు టామ్ క్రూజ్ సంఘాల మధ్య జూమ్ చర్చలో ప్రత్యక్షమై సమ్మెకు మద్దతుగా మాట్లాడడంతో నటీనటుల్లో ఉత్సాహం, పట్టుదల మరింత పెరిగాయి.

దేశ దేశాల్లో అవుట్ డోర్ షూటింగులు, భారీ సెట్టింగులు, తారాగణానికి మిలియన్ డాలర్ల పేమెంట్లు తప్పించుకునేందుకు హాలీవుడ్ చిత్ర నిర్మాణ రంగం టెక్నాలజీని విరివిగా వాడుకోవడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది. రాను రాను చిత్ర నిర్మాణమంతా విజువల్ ఎఫెక్ట్ నిపుణుల చేతిలోకి వెళితే నిర్మాత గడప దాటే అవసరం కూడా ఉండదు. ఈ మార్పును అడ్డుకునేలా డిజిటల్ కంటెంట్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో రచయితల, నటీనటులు ప్రాధాన్యతను తగ్గించే చర్యలను తీవ్రంగా వ్యతిరేకించాలని సంఘాలు కృతనిశ్చయంగా ఉన్నాయి. టెక్నాలజీ వాడకం పెరగడాన్ని ఆపలేకున్నా దాని నియంత్రణకై తగిన చట్టాలు రూపకల్పన, హక్కుల పరిరక్షణ జరగాలని ప్రధాన డిమాండ్‌గా కనబడుతోంది. ఎఐ వాడకం వల్ల సృజనకారులు అస్తిత్వానికి భంగం కలుగకుండా చిత్ర నిర్మాణం కొత్త నియమ నిబంధనలతో కూడిన ఒప్పందంతో కొనసాగాలని గిల్ నేతలు కోరుతున్నారు.

నిర్మాతలు చిత్ర నిర్మాణంపై పెట్టుబడి పెట్టే వ్యాపారులు. లాభనష్టాలు వారికే సొంతం. తక్కువ ఖర్చుతో ఎక్కువ వసూళ్లను రాబట్టాలని ప్రయత్నం ఎప్పుడు ఉండేదే! అందుకే వారు తమ ఇష్టప్రకారంగా సినిమా నిర్మాణాలు చేపడతాం. రచయితల, నటీనటుల సమ్మెకు అర్థమే లేదని కొట్టిపారేస్తున్నారు. అలనాటి నుండి సినీ రంగంలో ఎన్నో సాంకేతిక మార్పులు వచ్చాయి. వాటిని వాడుకుంటూ తెరపై ఎన్నో అద్భుతాలు ఆవిష్కృతమవుతున్నాయి. ఆ పరంపరలోనే గ్రాఫిక్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాయి. మున్ముందు మరెన్నో రావచ్చు. తమ పాత్రను, టాలెంట్‌ను కాలానికి తగినట్లు మార్చుకోవాలి కానీ సాంకేతిక సౌలభ్యాన్ని ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదని నిర్మాతల వాదన.ఈ సమ్మెలో తాము గట్టిగా నిలబడి చిత్రసీమతో తగిన ఒప్పందాలు చేసుకోకపోతే టెక్నాలజీ వాడకం పెరిగిపోయి రచయితల, నటీనటుల అస్తిత్వం కనుమరుగయ్యే ప్రమాదముందనే భయం వారిలో పెరిగిపోతోంది. వీరి డిమాండ్లకు మోషన్ పిక్చర్స్, టెలివిజన్ ప్రొడ్యూసర్స్ కలిసి పరిష్కారం తేవలసి ఉంది. అయితే చిత్ర నిర్మాణంపై బతికే యాక్టర్లు, రైటర్లు నిర్మాతలను ఎదిరించి ఏం సాధిస్తారో కాలమే చెబుతుంది.
మరో విషయం సినిమా నిర్మాణం, గ్రాఫిక్స్ వాడకం ఒక్క హాలీవుడ్‌కే పరిమితమైన సమస్య కాదు. మన దేశంలో, తెలుగులో వస్తున్న భారీ సినిమాలు టెక్నాలజీపై ఆధారపడి తయారవుతున్నాయి. మన వయసు మళ్లిన తారలు కూడా తమ ముఖాలపై కాకుండా తెరపై రంగులద్దడం ద్వారా అందంగా కనబడుతున్నారు. ఉన్నచోట నిలబడి ఆకాశంలో విహరిస్తున్నారు. సింహాలపై స్వారీ చేస్తున్నారు. మీరు కదలకుండానే ఇవన్నీ సాధ్యమైనప్పుడు మీరెందుకు, మీకు అంతేసి రెమ్యునరేషన్లు ఎందుకు అంటే జవాబు లేదనే అనుకోవాలి. గీతలతో సృష్టించబడిన యానిమేషన్ పాత్రలు కనక వర్షం కురిపిస్తుంటే పాత్రల పోషణకు మనుషులే కావాలా అని అడిగితే రేపైనా అవసరం లేదనే సమాధానం రావచ్చు. యంత్రాల రాకతో చేతి వృత్తులు పోతే మనిషి మరో అవతారం ఎత్తలేదా! ఇదీ అంతే!

-బి.నర్సన్,  9440128169

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News