హైదరాబాద్: కంచ గచ్చిబౌలి భూముల కోర్టు కేసులపై సిఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ తదుపరి కార్యాచరణపై అధికారులకు సిఎం పలు ఆదేశాలు జారీ చేశారు. ఎఐ వీడియోల సృష్టిపై విచారణకు అదేశించేలా కోర్టును కోరాలని అధికారులను సిఎం ఆదేశించారు. కంచ గచ్చిబౌలిలో 25ఏళ్లలో ఎన్నో ప్రాజెక్టులు నిర్మించారని అధికారులు తెలిపారు. కానీ, ఎన్నడూ వన్యప్రాణులు, పర్యావరణం వంటి వివాదాలు రాలేదని అన్నారు. ఎఐ ఫేక్ వీడియోలతో గందరగోళం సృష్టించారని అధికారులు స్పష్టం చేశారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సిఎం అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో సైబర్ క్రైమ్ విభాగాన్ని బలోపేతం చేయాలని ఎఐ కంటెంట్‌ను పసిగట్టే టెక్నాలజీని, ఫోరెన్సిక్, హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ టూల్స్ సమకూర్చుకోవాలని సిఎం అన్నారు. ఈ సమీక్షలో డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొంగులేటి, సిఎస్, డిజిపి, టిజిఐఐసి ఎండి, అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు.