Monday, December 23, 2024

హిట్ అండ్ రన్ కేసుల్లో టీనేజర్లు

- Advertisement -
- Advertisement -

దేశ వ్యాప్తంగా ఇప్పుడు హిట్ అండ్ రన్ కేసులపై చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఈ కేసుల్లో ఇటీవల మైనారిటీ తీరని బాలురు దోషులుగా పట్టుబడుతుండడం గమనార్హం. వాహనదారుడు ఒక వ్యక్తిని ఢీకొట్టి అతని పరిస్థితి ఎలా ఉందో పట్టించుకోకుండా అక్కడ నుంచి పరారైనప్పుడు దాన్ని హిట్ అండ్ రన్‌గానే పరిగణిస్తారు. యావత్ దేశాన్ని ఆగ్రహానికి గురి చేసిన మైనర్ బాలుని పుణె పోర్షే కేసు గురించి తెలుసుకుంటే అత్యంత ధనవంతులైన వారు తమ పిల్లల పెంపకంలో ఎంత నిర్లక్షంగా ఉంటున్నారో తెలుస్తుంది.

పుణె కల్యాణి నగర్‌లో బ్రహ్మ రియాల్టీకి చెందిన విశాల్ అగర్వాల్ కుమారుడు 17 ఏళ్ల వేదాంత్ అగర్వాల్ గత మే 17న ఇంటర్మీడియట్ రిజల్ట్ నేపథ్యంలో ఫుల్‌గా తాగి ర్యాష్ డ్రైవింగ్ చేయడం ఇద్దరి ప్రాణాలను బలిగొంది. ఈ సంఘటనకు ముందు కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే మైనర్ బాలుడు రూ. 48 వేల మద్యం షాపులో తీసుకున్నట్టు బయటపడింది. మైనర్‌కు మద్యం సరఫరా చేసిన వైన్ షాప్‌లకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. మైనర్‌కు పోలీసులు బిర్యానీలు, పిజ్జాలు సరఫరా చేశారంటూ కూడా అనేక ఆరోపణలు వచ్చాయి. దీనిపై కాంగ్రెస్ నేతలు తీవ్రంగా విమర్శించారు. బాధితులకు న్యాయం చేయాలంటూ కూడా పిఎస్ ఎదుట ధర్నా చేపట్టారు. గత నెలలో శివసేన నేత రాజేష్ షా కుమారుడు మిహిర్ షా మద్యం మత్తులో బిఎండబ్లు కారు నడుపుతూ ద్విచక్ర వాహనంపై వెళ్తున్న దంపతులను ఢీకొట్టి పరారయ్యాడు.

గత నెలలోనే రాజ్యసభ ఎంపి బిఎం రావు కుమార్తె చెన్నై పేవ్‌మెంట్‌పై బిఎండబ్లు వాహనంతో ఢీకొట్టి బాధితుని మృతికి కారణమైంది. వీరంతా బడాబాబుల పిల్లల కాబట్టి వీరికి తక్షణం బెయిల్ మంజూరైంది.ఇలాంటి హిట్ అండ్ రన్ కేసులు రానురాను పెరుగుతున్నాయి. 2022లో 67,387 సంఘటనలతో హిట్ అండ్ రన్ కేసుల్లో దాదాపు 30,486 మంది ప్రాణాలు కోల్పోగా, ఈ సంఖ్య గత పదేళ్లలో అత్యధికం అని డేటా చెబుతోంది. రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ హైవేస్ మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం 2013లో 49,576 హిట్ అండ్ రన్ కేసులు నమోదు కాగా, 2018లో ఈ కేసుల సంఖ్య 69,522 కు పెరిగింది. కొవిడ్ 19 ఆంక్షల ఫలితంగా 2020లో ఈ కేసులు 52,448కి తగ్గినా 2022 నాటికి ఈ సంఖ్య పెరగడం ప్రారంభమై 67,387 కి చేరుకుంది. హిట్ అండ్ రన్ కేసుల్లో ప్రమాద స్థలం నుంచి నిందితులు పరారైపోవడానికి ప్రధాన కారణం అక్కడ ఉన్న వారు తమపై దౌర్జన్యం చేస్తారని లేదా కోర్టుల పాలవుతామన్న భయమే.

అలాంటి సమయంలో వారి భయం పోగొట్టేలా చట్టానికి సవరణలు చేయాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. అలాగే ఇప్పుడు అమలవుతున్న నిబంధనలను ప్రజలు ఎలా పాటిస్తున్నారో నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. రోడ్డు ప్రమాదాల మృతుల సంఖ్య చాలా వరకు నమోదు కావడం లేదని, ఐఐటి ఢిల్లీ రోడ్ సేఫ్టీ ఇన్ ఇండియా స్టేటస్ రిపోర్టు 2023 వెల్లడించింది. 2019లో ప్రభుత్వం వెల్లడించిన డేటా కన్నా 40 శాతం ఎక్కువగా రోడ్డు ప్రమాద మరణాలు సంభవించాయని వెల్లడించింది. అయితే చాలా వరకు కేసులు నమోదు కాకపోయినా హిట్ అండ్ రన్ కేసులు చాలా జరుగుతున్నాయి. ఇది వరకు హిట్ అండ్ రన్ కేసుల నిందితులకు అప్పటి వరకు ఉన్న ఐపిసి సెక్షన్ 304ఎ కింద గరిష్ఠంగా రెండేళ్లు శిక్ష పడేది. అయితే ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 106 (2) కింద గరిష్ఠంగా 10 ఏళ్ల వరకు శిక్షపడే అవకాశం ఉంది.

నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) డేటా ప్రకారం 2022 లో మొత్తం 47806 కేసుల్లో 16 శాతం కేసులకే శిక్ష పడింది. ఎన్‌సిఆర్‌బి రికార్డు బట్టి హిట్ అండ్ రన్ కేసుల్లో 58.9 శాతం ఓవర్ స్పీడ్ కారణంగానే ప్రమాదాలు ఏర్పడినట్టు తెలుస్తోంది. అలాగే 26.4 శాతం కేర్‌లెస్ డ్రైవింగ్ లేదా ఓవర్ టేకింగ్ వల్లనే జరిగాయి. వాతావరణ పరిస్థితుల వల్ల 8.8 శాతం, డ్రగ్స్ లేదా ఆల్కహాలు ప్రభావం వల్ల 1.7 శాతం కేసులు నమోదయ్యాయి. మోటార్ వెహికల్స్ యాక్ట్ 2019 లోని సెక్షన్ 161 ప్రకారం హిట్ అండ్ రన్ బాధితులకు నష్టపరిహారాన్ని నిర్ణయించారు. మృతులైతే రూ. 2 లక్షలు, తీవ్ర గాయాలైతే రూ.50,000 వరకు చెల్లించవలసి ఉంటుంది. హిట్ అండ్ రన్ కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నప్పటికీ బాధితులకు ప్రభుత్వపరంగా నష్టపరిహారం చెల్లింపు చాలా తక్కువగా ఉంటోంది. 202122 లో 773 వివాదాలకు మొత్తం రూ. 1.84 కోట్లు నష్టపరిహారంగా చెల్లించారు. 2022 23 లో కేవలం 78 వివాదాలకు మాత్రమే రూ. 1.47 కోట్లు చెల్లించడమైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News