ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్‌ను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. తీన్మార్ మల్లన్న పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని, దీనిపై నోటీసులిచ్చినా వివరణ ఇవ్వకపోవడంతో మల్లన్నను సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ అధికారికంగా ప్రకటించింది. మల్లన్నను ఎన్నో సార్లు హెచ్చరించామని, బిసి కులగణన ప్రతులు చించడంపై ఏఐసిసి సీరియస్ అయ్యిందని కాంగ్రెస్ తెలిపింది.
ఫిబ్రవరి 5వ తేదీన నోటీసులు, మార్చి 01వ తేదీన సస్పెన్షన్
కొన్ని రోజుల క్రితం వరంగల్ లో జరిగిన బిసిల బహిరంగ సభలో కులగణన సర్వే, రెడ్డి సామాజిక వర్గాన్ని కించపరుస్తూ తీన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేశారు. కులగణనలో బిసిల సంఖ్యను తక్కువ చేసి చూపించారని ఆయన వ్యాఖ్యానిం చారు. ఈ నేపథ్యంలోనే తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని రెడ్డి సామాజిక వర్గం నేతలు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారం కాస్త సీరియస్ కావడంలో కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ ఫిబ్రవరి 5వ తేదీన తీన్మార్ మల్లన్నకు నోటీసులు ఇచ్చింది. ఫిబ్రవరి 12వ తేదీ లోగా వివరణ ఇవ్వాలంటూ ఈ నోటీసుల్లో తెలిపింది.
కాంగ్రెస్ షోకాజ్ నోటీసులపై తీన్మార్ మల్లన్న ఎలాంటి వివరణ ఇవ్వలేదు. దీంతో మార్చి 01వ తేదీన పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. తక్షణమే పార్టీ నుంచి తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేస్తున్నట్టు క్రమశిక్షణా కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ మీనాక్షి నటరాజన్ హైదరాబాద్‌కు వచ్చిన మరుసటిరోజే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై వేటు పడటం కాంగ్రెస్ శ్రేణుల్లో హాట్ టాఫిక్‌గా మారింది.