Thursday, January 23, 2025

టీచర్ల బదిలీలు, పదోన్నతులు షురూ

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీ, పదోన్నతులకు ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది. శనివారం(జూన్ 8) నుంచి ఉపాధ్యాయుల బదిలీ, పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం కానున్నది. పదవీ విరమణకు మూడేళ్ల ఏళ్లలోపు ఉన్న వారికి తప్పనిసరి బదిలీ నుంచి మినహాయింపు నిచ్చింది. మల్టీ జోన్ 1లో శనివారం నుంచి ఈ నెల 22 వరకు బదిలీలు, పదోన్నతులు కల్పించనున్నారు. అలాగే మల్టీ జోన్ 2లో శనివారం నుంచి ఈ నెల 30 వరకు బదిలీలు, పదోన్నతులు చేపట్టనున్నారు. కోర్టు కేసులతో గతంలో ఎక్కడ ప్రక్రియ ఆగిపొయిందో అక్కడి నుంచి బదిలీల ప్రక్రియ ప్రారంభించనున్నారు.

టెట్‌తో సంబంధం లేకుండానే ఉపాధ్యాయుల పదోన్నతులు చేపట్టనున్నట్లు విద్యాశాఖ స్పష్టం చేసింది. వాస్తవానికి ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలను 2023 ఫిబ్రవరిలో ప్రారంభించగా, నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే అదే నెలలో నాన్ స్పౌజ్‌లు కోర్టును ఆశ్రయించారు. దీంతో 2023 ఆగస్టులో కోర్టు బదిలీలు, పదోన్నతులను నిలిపివేస్తూ స్టే ఇచ్చింది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు వెళ్ళడంతో స్టేను కోర్టు ఎత్తివేసింది. దీంతో సెప్టెంబర్‌లో బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన షెడ్యూల్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మల్టీజోన్-1లో ప్రధానోపాధ్యాయుల స్థాయిలో బదిలీలు పదోన్నతులు చేపట్టారు. హెచ్‌ఎంలు గ్రేడ్- 2కు 1788 మంది, స్కూల్ అసిస్టెంట్లు, సమాన కేడర్‌కు చెందిన 10684… మొత్తం 12472 మందికి పదోన్నతులు కల్పించారు.

ఈ సమయంలోనే జోన్ వివాదం తలెత్తడంతో జోన్ -2లో హెచ్‌ఎంల పదోన్నతుల ప్రక్రియ ఆగిపోయింది. దీంతో స్కూల్ అసిస్టెంట్లు, ఎస్‌జిటిల పదోన్నతులు చేపట్టాలని భావించారు. కానీ పదోన్నతులకు టెట్ అర్హత ఉండాలని నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్స్ ఎడ్యుకేషన్(ఎన్‌సిటిఇ) నిబంధన అమలు చేయాలని కోరుతూ కొంతమంది హైకోర్టుకు ఆశ్రయించగా, న్యాయస్థానం స్టే ఇవ్వడంతో మళ్లీ పదోన్నతుల ప్రక్రియ నిలిచిపోయింది.

తాజాగా 2010 ఆగస్టు 23 కన్నా ముందు నియామకం జరిగిన ఉపాధ్యాయులకు టెట్ అవసరం లేదని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంతో పాటు మిగతా న్యాయవివాదాలు కొలిక్కి వచ్చాయి. దీంతో ఉపాధ్యాయుల పదోన్నతులకు మార్గం సుగమం అయింది. గతేడాది ఎక్కడ ప్రక్రియ ఆగిపోయిందో అక్కడి నుంచే మళ్లీ మొదలు కానుంది. మల్టీ జోన్-1లో కొంత ప్రక్రియ పూర్తయినందువల్ల దానికి ఒక షెడ్యూల్, మల్టీ జోన్ -2కు మరో షెడ్యూలు జారీ అయ్యాయి.

నేటి నుంచి మల్టీజోన్ 1 పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం
మల్టీ జోన్-1లో స్కూల్ అసిస్టెంట్ పదోన్నతుల శనివారం నుంచి ప్రక్రియ ప్రారంభమవుతుంది. మల్టీజోన్ 1లో ఈనెల 8,9 దరఖాస్తు చేసిన వారి సీనియారిటీ జాతాను జాబితాను ఆర్‌జెడి లేదా డిఇఒ కార్యాలయాలలో విడుదల చేస్తారు. 10,11 తేదీల్లో అభ్యంతరాల స్వీకరణ, 12,13 సీనియారిటీ తుది జాబితా విడుతల చేస్తారు. ఈ నెల 13 నుంచి 16 వరకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ఎస్‌జిటిలు, తత్సమాన కేడర్ ఉపాధ్యాయులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించి అర్హులైన ఎస్‌జిటిలకు పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తారు. అనంతరం బదిలీల కోసం ఈ నెల 17వ తేదీన ఎస్‌జిటి పోస్టుల ఖాళీల వివరాలను డిఇఒ కార్యాలయాలలో డిస్‌ప్లే చేస్తారు.

బదిలీల కోసం ఈ నెల 18 నుంచి 20 వరకు తుది సీనియారిటీ జాబితా విడుదల చేసి, వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పిస్తారు. ఈ నెల 21,22 తేదీలలో బదిలీ ఉత్తర్వులు జారీ చేస్తారు. అలాగే మల్టీజోన్ 2లో ఈనెల 8వ తేదీన హెడ్‌మాస్టర్ పోస్టుల పదోన్నతుల కోసం స్కూల్ అసిస్టెంట్ సీనియారిటీ జాతాను జాబితాను ఆర్‌జెడి లేదా డిఇఒ కార్యాలయాలలో విడుదల చేస్తారు. 9న అభ్యంతరాల స్వీకరించి, 10, 11 తుదీలలో సీనియారిటీ తుది జాబితా విడుతల చేసి, హెడ్‌మాస్టర్ పోస్టులకు స్కూల్ అసిస్టెంట్‌లు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించి అర్హులైన పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టుల పదోన్నతుల కోసం ఈనెల 14న ఎస్‌జిటి సీనియారిటీ జాతాను జాబితాను ఆర్‌జెడి లేదా డిఇఒ కార్యాలయాలలో విడుదల చేస్తారు.

అనంతరం బదిలీల కోసం ఈ నెల 12, 13 తేదీలలో స్కూల్ అసిస్టెంట్ పోస్టుల ఖాళీల వివరాలను డిఇఒ కార్యాలయాలలో డిస్‌ప్లే చేస్తారు. బదిలీల కోసం ఈ నెల 16 నుంచి 18 వరకు తుది సీనియారిటీ జాబితా విడుదల చేసి, వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పిస్తారు. ఈ నెల 19న బదిలీ ఉత్తర్వులు జారీ చేస్తారు. అనంతరం ఈనెల 20న స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ఎజ్‌జిటి సీనియారిటీ జాతాను జాబితాను ఆర్‌జెడి లేదా డిఇఒ కార్యాలయాలలో విడుదల చేస్తారు. 21 నుంచి 24 వరకు తుది సీనియారిటీ జాబితా విడుతల చేసి, ఎస్‌జిటిలు, తత్సమాన కేడర్ ఉపాధ్యాయులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించి అర్హులైన ఎస్‌జిటిలకు పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తారు. అనంతరం బదిలీల కోసం ఈ నెల 25న తేదీన ఎస్‌జిటి పోస్టుల ఖాళీల వివరాలను డిఇఒ కార్యాలయాలలో డిస్‌ప్లే చేస్తారు. బదిలీల కోసం ఈ నెల 26 నుంచి 28 వరకు తుది సీనియారిటీ జాబితా విడుదల చేసి, వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పిస్తారు. ఈ నెల 29,30 తేదీలలో బదిలీ ఉత్తర్వులు జారీ చేస్తారు.

ఎంతమందికి పదోన్నతులు..?

కేటగిరీ                          పదోన్నతి లభించే వారు

హెడ్‌మాస్టర్ గ్రేడ్                    2 763
స్కూల్ అసిస్టెంట్                   5123
ప్రైమరీ స్కూల్ హెడ్‌మాస్టర్         2130
లాంగ్వేజ్ పండిట్లు, పిఇటిలు అప్‌గ్రెడేషన్ 10479
మొత్తం                            18495

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News