హైదరాబాద్: తనపై కేసులు నమోదు చేసి దర్యాప్తు పేరుతో వేధించడం రాజ్యాంగ విరుద్ధమని తీన్మార్ మల్లన్న శుక్రవార నాడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈక్రమలో సిసిఎస్, చిలకలగూడ పోలీస్ స్టేషన్లు కేసులు నమోదు చేశారని, తనను పోలీస్‌స్టేషన్‌కు పిలవకుండా ఆదేశాలివ్వాలని ఆ పిటిషన్‌లో తీన్మార్ మల్లన్న కోరారు. అలాగే తనపై నమోదైన కేసులపై ఆన్ లైన్ లో విచారణ జరిపేలా ఆదేశించాలని పేర్కొన్న మల్లన్న పిటిషన్ పై హైకోర్టు సోమవారం విచారణ జరపనుంది. ఇదిలాఉండగా ఓ యువతి ఫిర్యాదుతో చింతపండు నవీన్‌కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్నపై హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం విదితమే.
ఇటీవల మల్లన్నకు చెందిన యూట్యూబ్ ఛానల్‌లో సోదాలు నిర్వహించి హార్డ్ డిస్కులు ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదే సమయంలో శుక్రవారం సైబర్ క్రైమ్ పోలీస్‌స్టేషన్‌లో విచారణకు హాజరు కావాలని మల్లన్నకు నోటీసులు జారీ చేశారు. అయితే శుక్రవారం హాజరవుతారని అందరూ భావించినప్పటికీ మల్లన్న గైర్హాజరయ్యారు. తాను జ్వరంతో బాధ పడుతున్నానని, పరీక్ష చేయించుకునేందుకు ఆసుపత్రికి వెళ్తున్నానని విచారణకు హాజరు కాలేనని పోలీసులకు సమాచారం అందించారు. ఈలోగా మల్లన్న నేరుగా హైకోర్టును ఆశ్రయించారు. విచారణ పేరుతో తనను పోలీసులు ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారని, సైబర్ క్రైమ్ పోలీసులిచ్చిన నోటీస్‌ను రద్దు చేయాలని కోర్టును కోరినట్లు సమాచారం.