Friday, November 22, 2024

ఎసిబి వలలో తహశీల్దార్

- Advertisement -
- Advertisement -

రూ. 10లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడిన శామీర్‌పేట తహశీల్దార్

మన తెలంగాణ / శామీర్‌పేట: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, శామీర్‌పేట తహసీల్దార్ సత్యనారాయణ గౌడ్ రూ.10 లక్షలు లంచం తీసుకుంటుండగాఎసిబి అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎసిబి డి.ఎస్.పి మజీద్ అలీఖాన్ తెలిపిన వివరాల ప్రకారం.. మువ్వ రామశేషగిరిరావు అనే వ్యక్తి శామీర్‌పేట మండలం, లాల్‌గడి మలక్‌పేటలో 2006లో వ్యవసాయ భూమి కొనుగోలు చేశాడు. 2013లో పట్టాదారు పాసు పుస్తకాలు వచ్చాయి. ధరణి వెబ్‌సైట్‌లో భూమి నమోదు కాకపోవడంతో నమోదు చేయాలని ఏడాది క్రితం తహసీల్దార్ సత్యనారాయణను సంప్రదిస్తే రూ.40 లక్షలు డిమాండ్ చేశారు. సంవత్సరం క్రితం బాధితుడు రూ. 10 లక్షలు తహసీల్దార్‌కు ఇచ్చాడు. మళ్ళీ తాజాగా తహసీల్దార్‌కు రూ. 20 లక్షల చెక్‌ను బాధితుడు రాసి ఇచ్చాడు. అలాగే మరో రూ. 10 లక్షలు తహసీల్దార్ డ్రైవర్ బద్రిని తీసుకోమన్నాడు. దీంతో బాధితుడు డబ్బులు డ్రైవర్ బద్రికి నగదు ఇస్తుండగా ఎసిబి అధికారులు వల పన్ని పట్టుకున్నారు. తహసీల్దార్ కార్యాలయంతో పాటు పెద్దపల్లి జిల్లాలోని ఆయన సొంత గ్రామంతోపాటు ప్రస్తుతం ఆయన ఉంటున్న తూంకుంట ఇంట్లో కూడా సోదాలు చేపట్టామని తెలిపారు. ఈ దాడుల్లో ఎసిబి ఇన్స్పెక్టర్లు మల్లికార్జున్, పురేందర్ బట్, సిబ్బంది రాజేష్, రవి, సాబీర్, యూసుఫ్, తదితరులు పాల్గొన్నారు.
చెప్పులు అరిగేలా తిరిగాను : బాధితుడు రామ శేషగిరిరావు
శామీర్‌పేట మండలం, లాల్ గాడి మలక్ పేట గ్రామంలో 2006లో 29 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశానని బాధితుడు మువ్వ రామ శేషగిరిరావు తెలిపారు. ధరణిలో ఈ భూమిని నమోదు కొరకు తహసీల్దార్‌ను సంప్రదించగా రూ. 40 లక్షలు డిమాండ్ చేశారని తెలిపాడు. గతంలో నగరంలోని హోటల్లో రూ.10 లక్షలు తహసిల్దార్‌కు ఇచ్చానని, మంగళవారం తహసిల్దార్ డ్రైవర్ బద్రికి పది లక్షల రూపాయలు ఇచ్చానని తెలిపాడు. మరో 20 లక్షల రూపాయలు చెక్కు రాసి ఇచ్చానని అన్నాడు. ఇంతవరకు తనకు ధరణిలో భూమి నమోదు కాలేదని, దీంతో తాను విసిగిపోయి ఎసిబి అధికారులను ఆశ్రయించానని తెలిపాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News