పాట్నా: ఆర్‌జెడి అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో సంక్షోభం సమసిపోవడం లేదు. తన నాటకీయ చేష్టలతో పార్టీని ఇరుకున పెడుతున్న లాలూ పెద్ద కుమారుడు, బీహార్ శాసనభ్యుడు తేజ్ ప్రతాప్ యాదవ్ మంగళవారం సాయంత్రం హఠాత్తుగా తన తల్లి రబ్రీ దేవి ఇంటికి చేరుకుని రాత్రంతా అక్కడే గడపడమేకాక తనకు ప్రభుత్వం కేటాయించిన బంగళాలో ఇక ఉండబోవడం లేదంటూ ప్రకటించడంతో లాలూ కుటుంబంలో మళ్లీ సంక్షోభం రాజుకున్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. తన రాజీనామా లేఖను తన తండ్రికి అందచేయాలని భావిస్తున్నట్లు సోమవారం నాడే ట్వీట్ చేసిన తేజ్ ప్రతాప్ మళ్లీ కుటుంబం వద్దకు చేరుకోవడం పార్టీలో సంతోషం కన్నా ఆందోళనకు దారితీస్తోంది. తండ్రి స్థాపించిన పార్టీకి వారసుడిగా ఎదిగి పార్టీ సారథ్య బాధ్యతలు నిర్వహిస్తున్న లాలూ చిన్నకుమారుడు, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్‌కు తాజా పరిణామాలు చికాకు కలిగించవచ్చని పార్టీ వర్గాలు తెలిపాయి. తల్లి నివాసంలోనే ఉంటున్న తేజస్వి యాదవ్‌కు తేజ్ ప్రతాప్ వ్యవహార శైలిపై పార్టీ దిగువ శ్రేణి క్యాడర్ నుంచి తీవ్ర ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ పరిస్థితిని ఆయన ఎలా ఎదుర్కొంటారోనని పార్టీ శ్రేణులు ఆసక్తిగా గమనిస్తున్నాయి.
లాలూ కుటుంబంలో మళ్లీ తేజ్ ప్రతాప్ ”చిచ్చు”
- Advertisement -
- Advertisement -
- Advertisement -