భారతీయ వాయుసేనలో మరో దేశీయ అస్త్రం సమకూరింది. తేలిక పాటి పోరాట పటిమ గల తేజాస్ శ్రేణికి చెందిన తేజాస్ మార్క్ 1 ఎ ఫైటర్ జెట్ బెంగళూరులో విజయవంతంగా రూపొందింది. ఈ శ్రేణికి చెందిన ఫైటర్ తొలి యుద్ధ విమానం బెంగళూరులోని హిందూస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్ (హెచ్‌ఎఎల్)లో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారయింది. ఈ విషయాన్ని హెచ్‌ఎఎల్ అధికారులు పేర్కొన్నారని వార్తా సంస్థలు గురువారం తెలిపాయి. ఈ విమాన ప్రయాణ సామర్థతను తొలిసారిగా నమూనాగా 15 నిమిషాల పాటు పరీక్షించారు. త్వరలోనే ఈ ఫైటర్‌ను రాజస్థాన్‌లోని బికనేర్ నాల్ వైమానిక స్థావరానికి తరలిస్తారు. పాకిస్థాన్ సరిహద్దుల నుంచి ముప్పును తట్టుకునే రీతిలో అత్యంత వ్యూహాత్మకంగా ఇక్కడ ఎయిర్‌బేస్‌లో ప్రవేశపెడుతారు.
ఇది రెండు సీటర్ల శిక్షక విమానం ఐఎఎఫ్‌కు సేవలు అందించేందుకు సిద్ధం అవుతుంది. ఇక పూర్తి స్థాయిలో ఈ ఫైటర్‌ను ఈ నెల 31న బేస్‌కు తరలించడం జరుగుతుందని వెల్లడించారు. ఇక వాయుసేన ఇప్పటికే హెచ్‌ఎఎల్‌తో ఇటువంటి 83 ఫైటర్స్ కొనుగోళ్ల దిశలో కాంట్రాక్టు కుదుర్చుకుంది. దీని విలువ రూ 48,000 కోట్ల వరకూ ఉంది. ఇక మరో 97 ఇటువంటి ఎల్‌సిఎలను రూ 65000 కోట్ల విలువైన కాంట్రాక్టుకు కొనుగోలు చేయాలని సంకల్పించింది. దీనిపై రక్షణ శాఖ నుంచి అనుమతి కూడా తీసుకుంది. తేజాస్ ఫైటర్‌లకు అనుమతి ఓ చారిత్రక మైలురాయి అని ఐఎఎఫ్ చీఫ్ ఎయిర్ మార్షల్ విఆర్ చౌదరి తెలిపారు. ఇప్పుడు ఎయిర్‌ఫోర్స్ బలం 220 ఎల్‌సిఎ మార్క్ 1ఎలకు చేరుతుంది. దీనితో వాయుదళంలో పది స్కాడ్రన్ల బలం చేకూరుతుంది.