ప్రధాని వ్యాఖ్యలకు తేజస్వీ కౌంటర్
ఉధంపూర్: పవిత్రమైన శ్రావణ మాసం, నవరాత్రి ఉత్సవాల కాలంలో మాంసాహారాన్ని తినే వీడియోలను షేర్ చేస్తూ సమాజంలోని ఒక వర్గానికి చెందిన ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారంటూ బీహార్ మాజీ ఉపముఖ్యమంత్రి, ఆర్‌జెడి నాయకుడు తేజస్వీ యాదవ్, ఇండియా కూటమికి చెందిన నాయకులపై ప్రధాని నరేంద్ర మోడీ మండిపడ్డారు. శుక్రవారం జమ్మూ కశ్మీరుకు చెందిన ఉధంపూర్‌లో ఒక ఎన్నికల ప్రచార సభలో ప్రధాని ప్రసంగిస్తూ ప్రజల మనోభావాలతో వారు ఆడుకుంటున్నారని విమర్శించారు.
ఎవరు ఏ ఆహారం తిన్నా తాము అడ్డుకోబోమని, శాకాహారం తినాలో లేక మాంసాహారం తినాలో ఎవరి ఇష్టం వారిదని మోడీ అన్నారు. అయితే వారి(ప్రతిపక్షం) ఉద్దేశాలు వేరని, వారిది మొగలుల మనస్తత్వమని ఆయన వ్యాఖ్యానించారు. భారతదేశంలోని పాలకులపై మొఘల్ చక్రవర్తులు దండెత్తినపుడు వారిని ఓడించడంతోనే సంతృప్తి చెందేవారు కాదని, ఆలయాలను ధ్వంసం చేస్తేనే వారికి తృప్తి ఉండేదని మోడీ చెప్పారు. ఆలయాలను ధ్వంసం చేయడం ద్వారా మొఘల్ చక్రవర్తులు ఆనంద పడేవారని, వారి లాగే ఇండియా కూటమి నాయకులు కూడా హిందువులు పవిత్రంగా భావించే శ్రావణ మాసంలో మాంసాహారం తింటూ ఆ వీడియోలను షేర్ చేసి ఆనందం పొందుతున్నారని ప్రఢాని వ్యాఖ్యానించారు.
తమ ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి మొగలుల తరహౠలోనే అదే మనస్తత్వంతో ప్రజలను రెచ్చగొడుతూ ఆనందం పొందుతున్నారని ఆయన ఆరోపించారు. తాను ఈ వ్యాఖ్యలు చేసినందుకు తనను దూషిస్తారని, అయితే పరిస్థితులు అదుపుతప్పినపుడు ఏది మంచో చెప్పే హక్కు ప్రజాస్వామ్యంలో తనకు ఉందని మోడీ చెప్పారు. కాగా..ప్రధాని మోడీ వ్యాఖ్యలపై తేజస్వీ యాదవ్ స్పందించారు.
తాను ఉద్యోగాలు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం గురించి అడుగుతుంటే ప్రధాని వాటి గురించి ప్రస్తావించరని ఆయన విమర్శించారు. ప్రధాని దేని గురించి మాట్లాడుతారో ఆయన ఇష్టమని, కాని తమకు ఏం చేశారో చెప్పాలని బీహార్ ప్రజలు అడుగుతున్నారని తేజస్వీ చెప్పారు. గత పదేళ్లలో బీహార్‌కు ఏం చేశారో చెప్పమని అడుగుతున్నామని, బీహార్‌కు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదు అని ఆయన నిలదీశారు.