Wednesday, January 22, 2025

ధూంధాం.. దశాబ్ది

- Advertisement -
- Advertisement -

ఘనంగా తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు
రాష్ట్రవ్యాప్తంగా నెల రోజులు సంబురాలు
రాజధానిలో వారం రోజులు ప్రత్యేక కార్యక్రమాలు

అమరుల త్యాగాలను స్మరించుకుంటూ గడచిన 9ఏళ్ల ప్రస్థానాన్ని ఆవిష్కరించే ప్రయత్నం
ఉత్సవాల నిర్వహణపై ఉన్నతాధికారులతో రెండు సార్లు సిఎస్ సమావేశం 
త్వరలో ముఖ్యమంత్రి దగ్గర జరిగే సమావేశంలో నిర్ణయం
సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాల రూపకల్పనపై దృష్టిసారించిన సాంస్కృతిక శాఖ
సాధారణ పరిపాలన శాఖ ఆధ్వర్యంలో ఉత్సవాల నిర్వహణ
లుంబినీ పార్కులో నిర్మించిన అమర వీరుల స్తూపం ఆవిష్కరణ వాయిదా?
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించనుంది. రాష్ట్రవ్యాప్తంగా నెల రోజులపాటు వివిధ రకాల సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు, కవి సమ్మేళనాలు ఉండేలా కార్యక్రమాల రూపకల్పన ఉండనుంది. నగరంలో వారం రోజుల పాటు ప్రత్యేక సంబురాలు జరపాలని ప్రభుత్వం భావిస్తోంది. సెలబ్రేషన్స్‌లో భాగంగా ముఖ్యమంత్రి కెసిఆర్ బహిరంగ సభ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ పదేళ్లలో రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రతిబింబించేలా ప్రోగ్రాం షెడ్యూల్‌ను ప్రిపేర్ చేస్తున్నారు. ఈ దిశలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఉన్నతాధికారులు కొత్త సచివాలయంలో రెండు సార్లు సమావేశం అయ్యారు.

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రతిబింబించేలా సంబురాలు
తెలంగాణా సాధించిన తరవాత జరిగిన అభివృద్ధి, అమలైన సంక్షేమ కార్యక్రమాలు ప్రతిబింబించేలా రాష్ట్రవ్యాప్తంగా ఈసారి అవతరణ సంబురాలు ఉండబోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా నెల రోజులు, రాజధానిలో వారం రోజులపాటు ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్‌తోపాటు జిల్లాల్లోని ప్రభుత్వ, చారిత్రక కట్టడాలను సర్వాంగసుందరంగా అలంకరించనున్నారు. రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాలను సర్వాంగ సుందరంగా అలంకరించనున్నారు. గడచిన 10 ఏళ్లలో విజనరీ సిఎం కెసిఆర్ నేతృత్వంలో తెలంగాణాలో సమాంతరంగా సాగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై విస్తృత ప్రచారం కల్పించనున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన రైతుబంధు, దళితబంధు లాంటి ఒక 10 ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రాముల్లో రోజుకు ఒకటి లేదా రెండు అంశాల చొప్పున ఆవిర్భావ ఉత్సవాల సందర్భంగా రాజధానిలో వారం రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉంది. తద్వారా యూత్, ప్రభుత్వ లబ్దిదారుల దృష్టిని ఆకర్షించి, ప్రభుత్వ పథకాలపై వాళ్లలో అవగాహన కల్పించేందుకు కృషి చేయనుంది.

అమరుల త్యాగాలను స్మరించుకుంటూ
అమరుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రభుత్వం గడచిన 9 ఏళ్ల ప్రస్థానాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేయనుంది. వాస్తవానికి తెలంగాణా ఆవిర్భావ దినోత్సవానికి ఒకరోజు ముందు అంటే, జూన్ 1వ తేదీన లుంబినీ పార్కులో నిర్మించిన అమరవీరుల స్థూపాన్ని సిఎం కెసిఆర్ ఆవిష్కరించాలనుకున్నారు. కానీ, ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో దాన్ని స్వల్పంగా వాయిదా వేసినట్లు సమాచారం. సెలబ్రేషన్స్‌లో భాగంగా ఒకరోజు ఆ కార్యక్రమం ఉంటుందని తెలుస్తోంది. ఆ క్రమంలోనే ఒకరోజు ఎన్‌టిఆర్ స్టేడియం, నిజాం కాలేజీ గ్రౌండ్ లేదా ఎల్‌బి స్టేడియంలలో ఏదో ఒకచోట పబ్లిక్ గ్యాదరింగ్, మీటింగు నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. బహిరంగ సభను ఉద్దేశించి ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రం ఏర్పడ్డ తరవాత ఈ 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఆయన ప్రజలకు వివరించనున్నట్లు తెలుస్తోంది.

ఇక రాష్ట్ర అవతరణ దశాబ్ది సంబురాల్లో భాగంగా జూన్ 2వ తేదీన పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చే కార్యక్రమం ఉంటుంది.ఉత్సవాలు ఎన్నిరోజులు నిర్వహించాలి, కార్యక్రమాలను రూపొందించాలి అన్నదానిపై త్వరలో ముఖ్యమంత్రి దగ్గర జరిగే సమావేశంలో నిర్ణయిస్తారు. సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతర షెడ్యూల్ రూపకల్పనపై సాంస్కృతిక శాఖ కసరత్తు మొదలుపెట్టింది. కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలను సాధారణ పరిపాలనా శాఖ చేపట్టనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News