Wednesday, January 22, 2025

ప్రగతి పథంలో పదేళ్ళ తెలంగాణ

- Advertisement -
- Advertisement -

నీళ్ళు, నిధులు, నియామకాలు, సొంత సాంస్కృతిక, సామాజిక వైభవం కోసం దశాబ్దాల పోరాటం తర్వాత 2014 జూన్ 2వ తేదీన ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ అనేక ప్రజాభ్యుదయ పథకాలు, వినూత్న కార్యక్రమాలతో ప్రగతి పథంలో పయనిస్తూ పలు రంగాలలో దేశంలోనే ‘మేటి’గా నిలిచింది. తెలంగాణ రచయితలు, కవులు, కళాకారులు, మేధావులు, సామాజిక, సాంస్కృతిక రంగ కార్యకర్తలు ఒక్కటై నిలిచి, ఎన్నో ఆటు పోట్లు, నిర్బంధాలు, అవరోధాలను ఎదుర్కొని పట్టువదలని విక్రమార్కుల్లా తెలంగాణ పోరాటానికి ఊపిరిలూదారు. పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఈ పోరాటానికి అండగా నిలిచినా తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎప్పటికప్పుడు ఎన్నో వినూత్న రూపాలతో ప్రజలను చైతన్యపరచి తెలంగాణ రాష్ట్రం సాకారం కావడంలో నిర్వహించిన పాత్ర శ్లాఘనీయమైంది.

అప్పట్లో ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని ఐక్య ప్రగతి శీల కూటమి ప్రభుత్వాన్ని, ఆ కూటమిలోని వివిధ భాగస్వామ్య పార్టీల నాయకులను ఒప్పించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం నుండి ప్రకటన చేయించి, దశాబ్దాల కల సాకారం కావించడంలో కెసిఆర్ అపర చాణక్యం ప్రదర్శించారు. నిజానికి ఎన్నో పార్టీలు ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేయాలని పోరుబాటలో నిలిచినా అందులో భాగస్వామిగా వున్న కెసిఆర్ తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఆమరణ నిరాహార దీక్షకు దిగడం ప్రజలలో ఆందోళనోధృతిని పెంచింది. కేంద్ర ప్రభుత్వం, వివిధ పార్టీలు కూడా ఇక ‘తెలంగాణ’ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయక తప్పదనే పరిస్థితి నెలకొంది. తెలంగాణ శాసన సభకు జరిగిన తొలి ఎన్నికల్లో ఉద్యమ పార్టీగా తెలంగాణ రాష్ట్ర సమితికే మెజారిటీ స్థానాలు కట్టబెట్టి ప్రజలు కెసిఆర్ నాయకత్వంపై తమకు గల అకుంఠిత విశ్వాసాన్ని, నమ్మకాన్ని వ్యక్తం చేశారు. కెసిఆర్ సారథ్యంలో ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం ఎన్నో అభ్యుదయ పథకాలకు, సంస్కరణలకు శ్రీకారం చుట్టింది.

తెలంగాణలో అప్పులపాలై ఆర్థిక దుస్థితికి గురైన అన్నదాతలను ఆదుకోవడానికి “రైతుబంధు” పథకాన్ని ప్రవేశపెట్టి రాష్ట్రంలోనే గాక, వివిధ రాష్ట్రాల ప్రజల జేజేలు అందుకుంది. ముఖ్యమంత్రి కెసిఆర్ వినూత్న ఆలోచనలు చేయడం వల్లనే రైతుబంధు, దళిత బంధు సహా వివిధ రంగాలలో ఆయా వృత్తుల ప్రజల జీవన స్థితిగతుల మెరుగు కోసం ప్రవేశపెట్టిన ఎన్నో పథకాలు సత్ఫలితాలు ఇవ్వడం ఆరంభమైంది. నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, కమలనాథులు కెసిఆర్ రైతు బంధు పథకం నుండి స్ఫూర్తి పొంది “ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి” అనే జాతీయ పథకాన్ని ప్రవేశపెట్టి దేశ వ్యాప్తంగా ప్రతి రైతు కుటుంబానికి 4 నెలలకోసారి రూ. 2 వేల వంతున ఏడాదిలో రూ. 6 వేల వంతున రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది. దేశంలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ఊదరగొట్టిన ప్రధాని నరేంద్ర మోడీ, కమల నాథులు ఘోరంగా విఫలమై ఆ విషయాన్ని పట్టించుకోవడమే మానేశారు. అకాల వర్షాలు, కరవులు, వరదల వల్ల ఏటేటా దేశంలో రైతులు పంటలు నష్టపోతూనే వున్నారు. అయినా అన్న దాతలకు సాయమందించడానికి బిజెపి ప్రభుత్వం ముందుకు రావడం లేదు. కాగా ఇటీవల భారీ వర్షాలు, వడగండ్ల వానల వల్ల వేల కోట్లు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 10 వేల వంతున సాయం ప్రకటించి, కెసిఆర్ ప్రభుత్వం మాటలు కాదు చేతల్లో చూపాలని రుజువు చేసింది. రైతులు మరణిస్తే ఆ కుటుంబాలు అనాథలవుతాయి.

ఈ వాస్తవాన్ని గుర్తించే కెసిఆర్ ప్రభుత్వం వినూత్నంగా “రైతు బీమా” పథకాన్ని అమలు చేస్తూ, వ్యాధులతో మరణించినా లేదా సహజ మరణమైనా సరే అన్న దాతల కుటుంబాలకు రూ. 5 లక్షల బీమా పరిహారాన్ని అందిస్తూ ప్రశంసలందుకుంటోంది. సంక్షేమ పథకాల అమలులో ముందుండే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా ఈ బీమా పథకం అమలు చేయడం లేదు. వడగండ్ల కడగండ్ల రైతులకు ఎట్టి సాయమూ అందించడం లేదు. వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కూడా తరచూ వ్యవసాయ రంగ అధికారులతో చర్చలు జరుపుతూ క్షేత్ర స్థాయిలో పర్యటించి ఎప్పటికప్పుడు విషయాలు తెలుసుకొని సేద్యపు రంగాన్ని మెరుగుపరచడానికి చర్యలు చేపట్టడం అభినందనీయం.
కెసిఆర్ 2014 జూన్ 2న నవ తెలంగాణ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తర్వాత జరిగిన పలు ఎన్నికలలో నానాటికీ మెజారిటీ పెంచుకుంటూనే వుండటం గమనార్హం. ఈ జూన్ 2 నాటికి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి పదేళ్ళు పూర్తవుతున్న సందర్భంగా గ్రామ, మండల, జిల్లా స్థాయిలోనే గాక రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వరకు పండగ వాతావరణంలో “తెలంగాణ ఘన కీర్తి దశ దిశలా చాటేలా తెలంగాణ సాంస్కృతిక విశిష్టతను, వైవిధ్యాన్ని చాటేలా అత్యంత ఘనంగా ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఆట పాటకు నెలవు తెలంగాణ.

ప్రజలను భక్తితత్వంలో, ఆధ్యాత్మిక చింతనను ప్రోదిచేసే విధంగా నిత్యం ప్రజల నోళ్లలో నిలిచే ఎన్నో మందార మకరంద మాధుర్యాల వంటి ఆణిముత్యాల వంటి పద్యాలను అందించిన మహాకవి పోతన, నరుని దృష్టిలోనే తేడాలు… శివుని దృష్టిలో అంతా సమానులేనని చాటుతూ మహాత్ముడు బసవణ్ణ చరిత్రను “బసవ పురాణం’గా మలిచిన అచ్చ తెనుగు కవి శ్రీ పాల్కురికి సోమన్న, ప్రాణములొడ్డి ఘోరగహనాటవులన్ పడగొట్టి, ఎముకల్ నుసిచేసి భక్తి బాగానములను సృజించిన తెలంగాణము రైతుదే అని ఎలుగెత్తిన మహా కవి దాశరథి, మట్టి, మనిషి, ఆకాశం అనే గ్రంథాన్ని రాసి నేల తల్లితో మనిషికి గల బంధావ్యాన్ని, అనుబంధాన్ని విశదం చేసిన జ్ఞాన పీఠ్ అవార్డు గ్రహీత సి. నారాయణ రెడ్డి, “ఒక్క సిరా చుక్క వేయి మెదళ్ళ కదలిక”గా అద్భుతమైన రీతిలో అభివర్ణించిన మహాకవి కాళోజీ, మాయమైపోతున్నాడమ్మా… మనిషన్నవాడు అని మానవత్వపు విలువలు మంటగలపడంపై ఆవేదన వ్యక్తం చేసిన కవి అందెశ్రీ, తన ఆట, పాటతో తెలంగాణలో విప్లవోద్యమ స్ఫూర్తిని రగిలించి, ఇటీవల చల్లబడ్డ ప్రజా గాయకుడు గద్దర్, జానపద గేయాలతో తెలంగాణ అస్తిత్వాన్ని చాటిన జానపద గాయకుడు గోరటి వెంటన్న, తన నవలల ద్వారా భూస్వామ్య యుగపు దొరల పాలనలో దారుణంగా వుండిన జన జీవితాన్ని చిత్రించిన ప్రముఖ రచయిత శ్రీ దాశరథ రంగాచార్య, తెలంగాణ సామాజిక జీవితాలను చిత్రించిన వైతాళికులు శ్రీ సురవరం ప్రతాప రెడ్డి, వట్టికోట ఆళ్వారు స్వామి, “అది దయ్యాల మేడ… శిథిల సమాజాల నీడ … రాబంధుల రాచవాడ” అని నిజాం ప్రభుత్వ నిరంకుశత్వాన్ని చాటిన ప్రముఖ ఉర్దూ కవి మక్దుమ్ మొహియుద్దీన్, ఇలా ఎందరో రచయితలు, కళాకారులు, తెలంగాణ గడ్డను సుసంపన్నం చేశారు. వారందరినీ ఈ సందర్భంగా స్మరించుకొని తెలంగాణ వారత్వాన్ని మునుముందుకు తీసుకుపోవాలి.

కాకతీయుల పాలనతో గొలుసు కట్టు చెరువులతో తెలంగాణ సస్యశ్యామలంగా ఉండేదని ప్రతీతి. కాల క్రమేణా శిథిలమైన చెరువులను, కుంటలను “మిషన్ కాకతీయ” పేరుతో పునరుద్ధరించి పల్లె సీమలు మళ్ళీ కళకళలాడేలా చేయడంతో, ఇప్పుడు చెరువులు, కుంటలు నీటితో తొణికిసలాడుతూ జనాన్ని, జీవాలను సేద తీరుస్తున్నాయి. తెలంగాణ దేశంలో అగ్రభాగాన నిలవాలంటే, జన జీవితాలు మెరుగుపడాలంటే గ్రామీణ దుస్థితిని తొలగించి, సేద్యపు రంగాన్ని మెరుగుపరిస్తేనే పాడి పంటలతో భాగ్య సీమలవుతాయని గుర్తించే ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్నో ఎత్తిపోతల పథకాలతో సాగు నీరందించడం ప్రశంసనీయం. మిషన్ భగీరథ ద్వారా పల్లె ప్రజలకు మంచి నీరందించడం అభినందనీయం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోతే విద్యుత్తు సరఫరా లేక తెలంగాణ అంధకారమవుతుందనే అంచనాలను తలకిందులు చేస్తూ, 24 గంటలు విద్యుత్తు సరఫరా చేయడం గమనార్హం. తగినంత విద్యుత్ వుంటేనే వ్యవసాయం, పరిశ్రమలు అభివృద్ధి చెంది, ఎందరికో ఉపాధి లభించడమే గాక, కేంద్ర, రాష్ట్రాలకు పన్నుల ఆదాయం పెరుగుతుంది. కాళేశ్వరం భారీ ఎత్తిపోతల పథకంపై ఎన్నో విమర్శలు వచ్చినా గొలుసు కట్టు రిజర్వాయర్ల ద్వారా 20 లక్షల ఎకరాలకు నీరందిస్తున్నట్లు ప్రభుత్వ గణాంకాలు ఘోషిస్తున్నాయి. హైదరాబాద్ నానాటికీ విస్తరిస్తూ నిజంగా “అంతర్జాతీయ నగరం”గా వివిధ వర్గాల ప్రజలతో వాణిజ్య, పారిశ్రామిక, ఐటి, ఫార్మా కంపెనీలతో సంపదలకు నిలయమవుతోంది.

కరోనా మహమ్మారి నిర్మూలనకు ఎంతో తోడ్పడిన టీకాలను భారత్ బయో టెక్ వంటి ఎన్నో వైద్య పరిశోధనా సంస్థలు మన భాగ్య నగరంలో ఉత్పత్తి చేసి అమెరికా సహా వివిధ దేశాలకు సరఫరా చేసి మానవాళి మనుగడకు తోడ్పటం గర్వకారణం. జనాభా, రవాణా అవసరాలు పెరుగుతుండడంతో ఎన్నో ఫ్లై ఓవర్లను నిర్మించి, మెట్రో రైళ్ళను విస్తరించి రాకపోకలను సుగమం చేశారు. ఇంకా ఎంతో చేయవలసి వుంది. తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలలో వాతావరణం, భూమి, స్థలాల లభ్యత వల్ల వాణిజ్యం, పరిశ్రమల విస్తృతికి, వివిధ దేశాల నుండి పెట్టుబడుల ఆకర్షణకు ఎన్నో సానుకూల అవకాశాలున్నాయి. ఈ వాస్తవాన్ని గుర్తించే ముఖ్యమంత్రి కెసిఆర్, ఐటి మంత్రి కెటిఆర్ ప్రభుతులు తెలంగాణలో పరిశ్రమల అభివృద్ధికి అవసరమైన పెట్టుబడుల ఆకర్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకొంటున్నారు. కొన్ని పార్టీవలె 80:20 అని జన విభజన చేస్తూ, అనైక్యత పెంచకుండా తెలంగాణ అన్ని వర్గాలను అక్కున చేర్చుకొని, సమ్మిళిత అభివృద్ధి” అంటే ఏమిటో చేతల్లో నిరూపిస్తున్నారు. అందుకే సంపద వృద్ధి, జిఎస్‌డిపిలో తెలంగాణ “మేటి”గా నిలుస్తోంది. సామాజిక న్యాయాన్ని కోరే అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహం నెలకొల్పడం, అద్భుతమైన రీతిలో కొత్త సచివాలయం నిర్మాణం ప్రశంసలందుకొంది.

తెలంగాణ లోగోను, బతుకమ్మ, తెలంగాణ తల్లి, బోనాలు, పాలపిట్ల, అమర వీరుల స్మారకం, యాదాద్రి మెట్రో రైలు, టి హబ్, కాళేశ్వరం వంటి ఎన్నో లోగోల సమాహార, చిహ్నాలతో రూపొందించారు. అమర వీరుల స్మారక చిహ్నాలతో వారిని ప్రత్యేకంగా ఓ రోజున స్మరించుకొంటూ ముఖ్యమంత్రి కెసిఆర్ జూన్ 2న సచివాలయం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. జూన్ 3న రైతుల దినోత్సవాన్ని, 4న భద్రతా దినోత్సవం, 5న విద్యుత్ స్వయం సమృద్ధి సాధన, 6న పారిశ్రామిక ప్రగతి, 7న మంచి నీటి దినోత్సవం, 8న ఊరూరా కుంటలు, 9న సంక్షేమ దినోత్సవాలు, 10న తెలంగాణ సుపరిపాలన, 11న తెలంగాణ సాహిత్య దినోత్సవం, 12న తెలంగాణ పరుగు పండుగ దినోత్సవాలను వైభవంగా జరపాలని సంకల్పించారు. రైతాంగాన్ని ఆదుకోవడంలో ‘మేటి’గా నిలిచిన కెసిఆర్, ఆసరా తదితర పథకాలు, వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పింఛన్లు ఇస్తూ వేలాది మందికి అండగా నిలిచారు. పాలనా రంగాన్ని ప్రజల వద్దకు తీసుకు వెళ్ళే కార్యక్రమాలు నిరంతరాయంగా జరగాలి.

రాజధాని హైదరాబాద్‌లో వర్షం వస్తే నీరు బయటకు పోక ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. చాలా చోట్ల రోడ్లు మెరుగు పరచాల్సి వుంది. కెసిఆర్ ప్రభుత్వం గత ఐదేళ్ళలో సాధించిన ప్రగతిని, విజయాలను స్మరించుకొంటూనే, ఇంకా ఏం చేస్తే పరిస్థితి మరింత మెరుగవుతుందనే అంశాలపై మేధావులు, పౌర సంఘాలతో చర్చించాలి. చరిత్రాత్మక తెలంగాణ, సాయుధ పోరాటం అంతర్జాతీయంగా తెలంగాణ కీర్తి ప్రతిష్ఠలను ఇనుమడింప జేసింది. చైనా కంటే ముందే రైతాంగ సాయుధ పోరాటాన్ని జరిపి మన విప్లవకారులు, రైతు, కూలీ సంఘాలు తాము ఎవరికీ తీసిపోమని నిరూపించారు. తెలంగాణను సాధించి ప్రగతి పథంలో నడుపుతున్న నేతగా ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రులు, పార్టీ నేతలు ప్రజల పట్ల మరింత వినయ, వినమ్రతలతో వ్యవహరిస్తూ, అందరినీ విశ్వాసంలోకి తీసుకొని అభివృద్ధి కృషిలో భాగస్వాములను చేస్తే రాష్ట్రం అనతి కాలంలోనే దేశంలో అగ్ర భాగాన నిలుస్తుంది. కెసిఆర్ ప్రభుత్వ శాస్త్ర, సాంకేతిక, సాహిత్య, సాంస్కృతిక రంగాలపై, విద్య, వైద్య రంగాలపై మరింత దృష్టి సారించి జన జీవన ప్రమాణాలు మెరుగు పరిస్తే జనం మద్దతుకు కొదవుండదు.

పతకమూరు దామోదర్ ప్రసాద్
9440990381
(సీనియర్ జర్నలిస్టు)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News