సుస్థిరాభివృద్ధిలో ఆరవ స్థానం, స్వఛ్చ విద్యుత్‌లో నెంబర్‌వన్
మెరుగైన పనితీరు కనబరిచిన తెలంగాణ
ఎస్‌డిజి సూచిలో 69 పాయింట్లతో ఆరవ స్థానంలో నిలిచిన రాష్ట్రం
భారత్‌లో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలపై నీతి ఆయోగ్ నివేదిక
మనతెలంగాణ/హైదరాబాద్: సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో తెలంగాణ మంచి పనితీరు కనబరిచిందని నీతి అయోగ్ తెలిపింది. 69 స్కోరుతో తెలంగాణ అరవ స్థానంలో నిలిచింది. 2020-21 సంవత్సరానికి తెలంగాణ 2 పాయింట్లు పురోగతి సాధించినట్లు నీతి అయోగ్ వెల్లడించింది. నీతిఆయోగ్ విడుదల చేసిన తాజా నివేదికలో కేరళ తొలి స్థానంలో కొనసాగగా, బిహార్ చివరి స్థానంలో ఉంది. హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలు సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచీలో 2వ స్థానంలో నిలిచాయి. కేంద్రపాలిత ప్రాంతాల్లో చండీగఢ్ తొలిస్థానంలో నిలిచింది. భారత్‌లో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో ఆయా ప్రభుత్వాల పనితీరును పర్యవేక్షిస్తోన్న నీతిఆయోగ్, ప్రతిఏటా నివేదిక ఇస్తుంది. సామాజిక, ఆర్థిక, పర్యావరణ అంశాలను పరిగణలోకి తీసుకొని నీతిఆయోగ్ ఈ ర్యాంకులను కేటాయిస్తుంది. 2018 నుంచి వీటిని ప్రకటిస్తుండగా.. తాజాగా మూడవ ఎడిషన్‌ను నీతిఆయోగ్ ప్రకటించింది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచీ 2020-21 నివేదికను నీతిఆయోగ్ ఉపాధ్యక్షులు రాజీవ్ కుమార్ విడుదల చేశారు. ఇందులో 75 స్కోరుతో కేరళ తొలిస్థానాన్ని మరోసారి నిలబెట్టుకోగా, 74 స్కోరుతో హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలు రెండవ స్థానంలో నిలిచాయి. ఇక ఈ ఏడాది సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో బిహార్ అత్యంత పేలవమైన పనితీరు కనబరిచింది. బిహార్, ఝార్ఖండ్, అస్సాం రాష్ట్రాలు చిట్టచివరలో నిలిచాయి. ఇక ఈ సూచీలో 73 పాయింట్లతో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో నిలవగా, తెలంగాణ 69 పాయింట్లతో మెరుగైన పనితీరును కనబరిచింది.
స్వఛ్చ విద్యుత్‌లో 100 పాయింట్లతో ప్రథమ స్థానం
నీతిఆయోగ్ వెల్లడించిన ఈ నివేదకలో సరసమైన, స్వఛ్చ విద్యుత్ శక్తిలో తెలంగాణ మెరుగైన పనితీరు కనబరించింది. విద్యుత్ శక్తి ఎస్‌డిజి సూచిలో 100 పాయింట్లతో పలు రాష్ట్రాలతో కలిసి మొదటి స్థానంలో నిలిచింది. ముఖ్యమంత్రి కెసిఆర్ ఏడేళ్లలో లోటు విద్యుత్ కలిగిన రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చేందుకు వ్యూహాత్మకంగా ప్రణాళికలు చేశారు. దాంతో విద్యుత్ శక్తి ఎస్‌డిజి సూచిలో తెలంగాణ నెంబర్ వన్ స్థానానికి దక్కించుకుంది. అలాగే పరిశుభ్ర నీటి సరఫరా, పారిశుధ్యంలలో చక్కటి పనితీరు కనబరిచి తెలంగాణ 96 పాయింట్లతో రెండవ స్థానంలో నిలివగా, ఆర్థిక అభివృద్ధిలో తెలంగాణ మూడవ స్థానంలో నిలిచినట్లు నీతిఅయోగ్ వెల్లడించింది.
Telangana 6th rank in NITI Aayog SDG India index