Monday, January 20, 2025

ఓటర్లకు తెలంగాణ ఆమ్ ఆద్మీ పార్టీ పిలుపు

- Advertisement -
- Advertisement -

అసెంబ్లీ ఎన్నికల్లో మతోన్మాద పార్టీలను ఓడించండి
బలమైన లౌకికవాద అభ్యర్థులను గెలిపించండి

మన తెలంగాణ / హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మతోన్మాద రాజకీయ పార్టీలను నిలువరించడానికి బలమైన అభ్యుదయ, సామ్యవాద, లౌకిక అభ్యర్థులను గెలిపించాలని తెలంగాణ ఆమ్ ఆద్మీ పార్టీ ఓటర్లకు విజ్ఞప్తి చేసింది. మతోన్మాద బిజెపి, దాని మిత్రపక్షం జనసేన, ఎంఐఎం పార్టీలను ఓడించాలని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చింది. నవంబరు 30న జరగనున్న ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీపార్టీ మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా క్రియాశీలక పాత్ర ను పోషించబోతోందని ఆ పార్టీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ తెలిపారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు గాను 103 నియోజకవర్గాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ బలంగా ఉందని, అయినప్పటికీ మతోన్మాద శక్తులను ఓడించడమే లక్షంగా అసెంబ్లీ ఎన్నికలలో ప్రత్యక్షంగా పాల్గొనకుండా బిజెపి, మజ్లిస్, పార్టీలను బిజెపి మిత్రపక్షమైన జనసేన అభ్యర్థులను ఓడించడానికి ఆమ్ ఆద్మీ పార్టీ వాలంటీర్లు కృషి చేయాలని డాక్టర్ సుధాకర్ పిలుపునిచ్చారు.

కేంద్రంలో ఫాసిస్టు శక్తిగా ఎదుగుతున్న బిజెపిని ఓడించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఆమ్‌ఆద్మీపార్టీ ‘ కేంద్ర రాజకీయ వ్యవహారాల కమిటీ‘ ఈపర్యాయం తెలంగాణా ఎన్నికల్లో ప్రత్యక్షంగా పాల్గొనకుండా మతోన్మాద పార్టీలను ఓడించడంలో కీలక పాత్ర పోషించమని ఆదేశించిందని తెలిపారు. దేశ వ్యాప్తంగా ప్రత్యామ్నయ శక్తిగా ఎదుగుతున్న ఆమ్ ఆద్మీ పార్టీని, కేజ్రీవాల్‌ను అణగదొక్కడానికి మోడీ ప్రభుత్వం ఈడి, సిబిఐ చే దాడులు చేయిస్తోందని ఆరోపించారు. పార్టీ స్థాపించిన పదేళ్ళలోనే ఆప్ జాతీయ పార్టీగా బలపడిందని, రెండు రోష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. భవిష్యత్తులో ఆమ్ ఆద్మీ పార్టీ దేశంలో చరిత్ర సృష్టించబోతోందన్నారు. నాణ్యమైన ప్రభుత్వ విద్య, బస్తీ దవాఖానాలు, అందరికీ ఉచిత వైద్యం, ఉచిత త్రాగునీరు, ఉచిత కరెంటు, మహిళలకు బస్సులలో ఉచిత ప్రయాణం, సీనియర్ సిటిజన్‌లకు ఉచితంగా తీర్థయాత్రలు, ప్రభుత్వ ఆఫీసుల్లో అవినీతి నిర్మూలన, తదితర సేవలను ఢిల్లీ వాసులకు ఆప్ ప్రభుత్వం కల్పిస్తోందని ఆయన చెప్పారు.

గుజరాత్ లో 13 శాతం ఓట్లు సాధించి ఐదుగురు ప్రజాప్రతినిధులు గెలవడం, మధ్యప్రదేశ్ లో మేయర్ స్థానంతో పాటు, పలు రాష్ట్రాల స్థానిక ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధిస్తూనే ఉందని తెలిపారు. ప్రధాని మోడీ, మంత్రి అమిత్ షా లు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాలను కూల కొట్టడం, ప్రజా ప్రతినిధులను పశువుల్లాగా కొనడం జరుగుతోందని ఆరోపించారు. ఇది చాలాదన్నట్లు ఈడి, సిబిఐ, ఐటి లను పురిగొల్పి తమ రాజకీయ ప్రత్యర్థులని ఏదో విధంగా లొంగదీసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారని ధ్వజమెత్తారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ దిగజారిందని విమర్శించారు.. ఆదాని, అంబానీ , మెహల్ చోస్కి, .నీరవ్ మోడీ లాంటి కుబేరులకి లక్షలాది కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను మాఫీ చేశారని, మళ్లీ వారికే ఈ దేశ సంపదనంతా కూడా అప్పచెబుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఎల్‌ఐసి లాంటి సంస్థని, బొగ్గు గనులని, పవర్ ప్రాజెక్టులను, రోడ్లు, విమానాశ్రయాలు, నౌక పోర్టులు, గనులు ఆఖరికి ప్రజల కోసం అట్టడుగు వర్గాల కోసం నిర్మించిన రైల్వే వ్యవస్థను కూడా ప్రైవేటు పరం చేస్తున్నారని ఆరోపించారు.

2024 లో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో ప్రధాని పదవికి అరవింద్ కేజ్రీవాల్ ప్రత్యర్థి అవుతారనే భయంతో కేజ్రీవాల్ కు ఈడి సమన్లు జారీ చేసి అరెస్టు చేయాలని కుట్ర చేసిందని ఆరోపించారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందని డాక్టర్ సుదాకర్ అన్నారు. అంతకు ముందు ఆప్ పదేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ కార్యాలయంలో పార్టీ జెండాను ఎగరవేసి ఆప్ కార్యకర్తలు ప్రతిజ్ఞ చేశారు. విలేకరుల సమావేశంలో కోర్ కమిటి సభ్యులు సులేమన్ రాజ్, అన్సారీ, మాజిద్, ముఖ్య అధికార ప్రతినిధి వినయ్ రెడ్డి, అధికార ప్రతినిధులు పరీక్షన్ రాజ్, .జావెద్ షరీఫ్, ఫణిభూషణ్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

AAP2

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News