హైదరాబాద్ : ఓయూ తొలిదశ (1969) ఉద్యమకారుడు డాక్టర్ ఎం.శ్రీధర్ రెడ్డి కన్నుమూశారు. అనారోగ్యంతో సోమవారం మధ్యాహ్నం బంజారాహిల్స్ లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. సంపూర్ణ తెలంగాణ ప్రజా సమితి (ఎస్‌టిపిఎస్) నాయకులు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి కన్నా ముందే తొలి దశ తెలంగాణ ఉద్యమాన్ని తట్టి లేపిన వారిలో డాక్టర్ ఎం.శ్రీధర్ రెడ్డి ఒకరు. ఓయూ నుంచే తెలంగాణ ఉద్యమ జ్వాలలు దేశవ్యాప్తంగా ఎగజిమ్మిన ఉద్యమనేతగా ఆయనకు పేరుంది. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకి జూబ్లీ హిల్స్ మహాప్రస్థానం లో శ్రీధర్ రెడ్డి అంత్యక్రియలు జరగనున్నాయి. పిసిసి ఉపాధ్యక్షులు కుమార్ రావు, మలిదశ తెలంగాణ ఉద్యమనేత తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ ఛైర్మన్ పిసిసి రాష్ర ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతారాయ్ ఆయన సమకాలికులు.
సిఎం కెసిఆర్ సంతాపం
తొలితరం తెలంగాణ ఉద్యమకారుడు ఉస్మానియా యూనివర్శిటీ నాటి విద్యార్థి సంఘం నేత ఎం. శ్రీధర్ రెడ్డి మృతిపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. తొలి, మలి దశల్లో తెలంగాణ ఉద్యమానికి శ్రీధర్ రెడ్డి చేసిన కృషిని సిఎం ఈ సందర్భంగా స్మరించుకున్నారు. నాటి 1969 ఉద్యమంలో శ్రీధర్‌రెడ్డి క్రియాశీలంగా, కీలక పాత్రను పోశించారని, తాను నమ్మిన విలువల కోసం శ్రీధర్ రెడ్డి కట్టుబడి, రాజీపడకుండా పనిచేశారని సిఎం తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు సిఎం కెసిఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, పిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సిపిఐ సీనియర్ నాయకులు సురవరం సుధాకర్ రెడ్డి తదితరులు శ్రీధర్‌రెడ్డి మృతి పట్ల సంతాపం తెలిపారు.